IPOs: కొన్ని నెలల్లో ఐపీఓల సందడి.. రూ.50 వేల కోట్ల సమీకరణ!

IPOs: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అనేక కంపెనీలు ఐపీఓకి సిద్ధమవుతున్నాయి. దాదాపు రూ.50 వేల కోట్ల సమీకరణ జరగొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 17 Jun 2024 13:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే కొన్ని నెలల పాటు ఐపీఓలు (IPO) సందడి చేయనున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో పలు కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. దాదాపు 30 సంస్థలు రూ.50 వేల కోట్లు సమీకరించేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మదుపర్లలో విశ్వాసం బలపడిందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్‌, ఫస్ట్‌క్రై, ఫిన్‌కేర్‌ ఎస్‌ఎఫ్‌బీ, ఎన్‌ఎస్‌డీఎల్‌, అఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రా, ఎంక్యూర్‌ ఫార్మా, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్‌, వన్‌ మొబిక్విక్‌ సిస్టమ్స్‌ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

దక్షిణ కొరియా వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ (Hyundi IPO), రేఖా ఝున్‌ఝున్‌వాలా మద్దతున్న బజార్‌ స్టైల్‌ రిటైల్‌, స్విగ్గీ, హల్దీరామ్స్‌ సైతం రాబోయే నాలుగు నుంచి ఐదు నెలల్లో ఐపీఓకి వచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్‌ ఇండియా ఇప్పటికే సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. మరోవైపు విదేశీ మదుపర్లకు వాటాలు విక్రయించాలన్న నిర్ణయాన్ని చిరుతిళ్ల తయారీ సంస్థ హల్దీరామ్స్‌ విరమించుకుంది. దీంతో ఐపీఓ ద్వారా నిధులు సమకూర్చుకోవాలని యోచిస్తోంది. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బజార్‌ స్టైల్‌ రిటైల్‌ మార్చిలోనే ఐపీఓకి దరఖాస్తు సమర్పించింది.

ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె

ఐపీఓ ద్వారా రూ.10,414 కోట్ల సమీకరణకు స్విగ్గీకి ఇటీవలే సెబీ అనుమతించింది. ఓలా ఎలక్ట్రిక్‌ పబ్లిక్‌ ఇష్యూకూ సెబీ పచ్చ జెండా ఊపింది. ఈ కంపెనీ రూ.5,500 కోట్ల ఐపీఓ వచ్చే రెండు నెలల్లోనే ప్రారంభం కావొచ్చని అంచనా. ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ సంస్థ ఫస్ట్‌క్రై రూ.1,816 కోట్ల సమీకరణ కోసం సెబీకి రెండోసారి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. వీటితో పాటు వన్‌ మొబిక్విక్‌ సిస్టమ్స్‌ రూ.700 కోట్లు, వారీ ఎనర్జీస్‌ రూ.3,000 కోట్లు, అలీడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిల్లర్స్‌ రూ.1,500 కోట్లు, ఫిన్‌కేర్‌ ఎస్‌ఎఫ్‌బీ రూ.625 కోట్ల సమీకరణకు సిద్ధమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని