OYO: ఓయోకు తొలిసారి త్రైమాసిక లాభాలు.. సీఈఓ రితేశ్‌

OYO భవిష్యత్‌ వృద్ధి సైతం మెరుగ్గా కనిపిస్తోందని ఓయో సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. యూఎస్‌, యూకేలో సరికొత్త సాంకేతికతల అమలు ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు.

Published : 26 Sep 2023 14:01 IST

దిల్లీ: ఓయో (OYO) పేరిట హోటల్స్‌ను నిర్వహిస్తున్న ‘ఒరావెల్‌ స్టేస్‌ లిమిటెడ్‌’ తొలిసారి లాభాలను నివేదించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరుతో ముగియనున్న త్రైమాసికంలో సంస్థ పన్నేతర లాభాలు రూ.16 కోట్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌ స్వయంగా ఉన్నతోద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు ఈ విషయంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.

ఓయో (OYO) ఈ ఏడాది పదో వసంతంలోకి అడుగుపెట్టిందని రితేశ్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఈ శుభ సందర్భానికి అనుగుణంగానే కంపెనీ తొలిసారి త్రైమాసిక లాభాలను నమోదు చేయబోతుందని వెల్లడించారు. అలాగే భవిష్యత్‌ వృద్ధి సైతం మెరుగ్గా కనిపిస్తోందని తెలిపారు. యూఎస్‌, యూకేలో సరికొత్త సాంకేతికతల అమలు ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల విడుదలైన వార్షిక నివేదిక ప్రకారం.. కంపెనీ కార్యకలాపాల ఆదాయం 2022- 23లో రూ.5,463 కోట్లకు చేరినట్లు తెలిపారు. క్రితం సంవత్సరం నమోదైన రూ.4,781 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి రికార్డయినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని