OYO IPO: ఫిబ్రవరిలో ఓయో ఐపీఓ పత్రాల రీఫైల్‌

ఓయో తొలిసారి 2021 సెప్టెంబరులో ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. జాప్యం కావడంతో మరోసారి పత్రాలు సమర్పించాలని సెబీ కోరింది. దీంతో వచ్చే నెలలో అప్‌డేట్‌ చేసిన ముసాయిదా పత్రాలను ఓయో సమర్పించనుంది.

Published : 18 Jan 2023 16:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఓ (IPO) ముసాయిదా పత్రాలను మరోసారి సెబీకి సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు ఓయో (OYO) పేరిట ఆతిథ్య సేవలను అందిస్తోన్న ‘ఒరావెల్‌ స్టేస్‌ లిమిటెడ్‌’ బుధవారం తెలిపింది. మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ (Sebi) సూచనల మేరకు తగు మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి మధ్యలో తిరిగి ప్రాథమిక పత్రాలను సమర్పిస్తామని పేర్కొంది. గత ఏడాదిలో సమర్పించిన పత్రాలను అప్‌డేట్‌ చేసి పంపాలని సూచిస్తూ ఇటీవల సెబీ వాటిని తిప్పి పంపిన విషయం తెలిసిందే.

‘అన్ని కీలక విభాగాలలోనూ తాజా పత్రాలను అప్‌డేట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. న్యాయనిపుణులు, ఆడిటర్లు, ఐపీఓ బ్యాంకర్ల సహకారంతో ప్రతి విభాగానికి ప్రత్యేక జట్టుగా విభజించి సభ్యులను నియమించాం. 2023 ఫిబ్రవరి మధ్యనాటికి ముసాయిదా పత్రాలను సిద్దం చేస్తాం’ అని ఓయో ఉన్నతోద్యోగులు తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో వచ్చిన కీలక మార్పులు, కొత్తగా సమీకరించాలనుకుంటున్న నిధుల వివరాలకు సంబంధించిన అంశాలను కొత్త ముసాయిదా పత్రాల్లో పొందుపర్చనున్నట్లు పేర్కొంది.

ఆతిథ్య సేవలను అందిస్తోన్న ఓయో తొలిసారి సెప్టెంబరు 2021లో ఐపీఓకు దరఖాస్తు చేసుకుంది. రూ. 8,430 కోట్ల సమీకరణ కోసం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. కానీ, కరోనా సంక్షోభం నుంచి వ్యాపారం పుంజుకోకపోవడంతో ఆ ప్రయత్నాలను పక్కన పెట్టింది. దాంతో పాటు మార్కెట్‌ ఒడుదొడుకుల నేపథ్యంలో అది మరింత ఆలస్యమైంది. 2023లోనైనా ఐపీఓకి రావాలని ఓయో ప్రయత్నిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు