Home Loan: హోమ్‌ లోన్‌ చెల్లించేశారా? ఈ పత్రాలన్నీ తీసుకోవడం మర్చిపోవద్దు!

Home Loan: హోమ్‌ లోన్‌ పూర్తిగా చెల్లించిన తర్వాత భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉండొద్దంటే కచ్చితంగా పూర్తిచేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం..

Updated : 20 Sep 2023 13:21 IST

Home Loan: హోమ్‌ లోన్‌ ఒక దీర్ఘకాల రుణం. పూర్తిగా తిరిగి చెల్లించడమంటే జీవితంలో ఒక ఆర్థిక మైలురాయిని చేరుకున్నట్లే. అయితే, లోన్‌ (Home Loan)ను పూర్తిగా చెల్లించేశాం కదా అని చేతులు దులిపేసుకుంటే సరిపోదు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉండొద్దంటే కచ్చితంగా పూర్తిచేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం..

నిరభ్యంతర పత్రం పొందాలి..

హోమ్‌ లోన్‌ (Home Loan) చివరి బకాయిని చెల్లించిన వెంటనే బ్యాంకులను సంప్రదించాలి. నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (No objection certificate- NOC)/లోన్‌ క్లోజర్‌ స్టేట్‌మెంట్‌ను ఇవ్వమని కోరాలి. కొన్నిసార్లు దీన్నే ‘నో డ్యూస్‌ సర్టిఫికెట్‌’గానూ వ్యవహరిస్తారు. ఎన్‌ఓసీలో హోమ్‌ లోన్‌ (Home Loan)కు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఎంత మొత్తం, ఎప్పుడు, ఏ వడ్డీరేటుతో తీసుకున్నారు? ఇంకా ఏమైనా బకాయిలున్నాయా? ఇప్పటి వరకు ఎంత మొత్తం చెల్లించారు? వంటి వివరాలు ఎన్‌ఓసీ (NOC)లో ఉంటాయి. అలాగే ఒకవేళ లోన్‌ పూర్తిగా క్లోజ్‌ అయితే, ఎలాంటి బకాయిలు లేవని ఎన్‌ఓసీ (NOC)లో విధిగా పేర్కొంటారు. ఇల్లు పూర్తిగా రుణగ్రహీతకే చెందుతుందని.. దానిపై రుణదాతకు ఎలాంటి హక్కు లేదని స్పష్టంగా ఉంటుంది. దీనిపై బ్యాంకుల స్టాంప్‌, సంబంధింత అధికారి సంతకం కచ్చితంగా ఉండాలి.

తనఖా పత్రాలు తీసుకోవాలి..

లోన్‌ (Home Loan) తీసుకునే ముందు తనఖా కింద బ్యాంకులు కొన్ని పత్రాలను తీసుకుంటాయి. మీరు ఏయే పత్రాలను సమర్పించారో లోన్‌ (Home Loan) మంజూరు సమయంలో బ్యాంకు వాటి వివరాలను మీకు తెలియజేస్తుంది. లోన్‌ క్లోజ్‌ చేయగానే అవన్నీ బ్యాంకు నుంచి తీసుకోవాలి. ఏ ఒక్కదాన్నీ రుణదాతలు అట్టేపెట్టుకునే అధికారం లేదు. ఇటీవల ఆర్‌బీఐ ఈ విషయంలో నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. లోన్‌ పూర్తయిన 30 రోజుల్లోగా పత్రాలు ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే రోజుకి రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

బ్యాంకులు లేదా రుణ సంస్థలే మీకు డాక్యుమెంట్లు పంపాలని ఆశించొద్దు. మీరే స్వయంగా వెళ్లి తీసుకోవడం మంచిది. ఎందుకంటే పత్రాలన్నీ ఉన్నాయా? వాటిలో ఏవైనా పేజీలు మిస్సయ్యాయా? స్వయంగా చూసుకుంటేనే మేలు. లేదంటే మళ్లీ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అలాగే పత్రాలన్నీ తీసుకున్నట్లు సంతకం చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలి.

ఆస్తి పత్రాలపై ఎలాంటి షరతులు ఉండొద్దు..

ఏ ఇంటి కోసమైతే లోన్‌ తీసుకుంటున్నామో.. దాన్ని బ్యాంకు అనుమతి లేకుండా విక్రయించడానికి వీలుండదు. ఆ మేరకు ప్రాపర్టీ డాక్యుమెంట్లపై బ్యాంకు షరతులు విధిస్తుంది. ఈ నేపథ్యంలో లోన్‌ను పూర్తిగా చెల్లించిన వెంటనే అధికారికంగా ఆ షరతులను తొలగించుకోవాలి. దానికోసం బ్యాంకు నుంచి ఒక అధికారిని తీసుకొని రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ రిజిస్ట్రార్‌ డాక్యుమెంట్లపై ఉన్న షరతులు, నిబంధనలను అధికారికంగా తొలగించి రికార్డులను అప్‌డేట్‌ చేస్తారు. తద్వారా రుణగ్రహీత సదరు ఆస్తికి పూర్తి హక్కుదారు అవుతారు.

కొత్త ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ పొందండి..

ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ ఆస్తికి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీల సమగ్ర రికార్డుగా పనిచేస్తుంది. కొత్త ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (Encumbrance certificate- NC) జారీ చేసినప్పుడు, అది ఇంటి యాజమాన్య బదిలీ, ఆస్తిపై ఎవరికైనా హక్కులు ఉన్నాయా? వంటి వివరాలు ఎన్‌సీలో ఉంటాయి. ప్రత్యేకించి గృహ రుణం (Home Loan) వంటి కీలకమైన సమాచారం దీంట్లోనే ఉంటుంది. ఈ పత్రానికి చట్టపరంగా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక ఆస్తిపై ఎలాంటి ఆర్థిక వివాదాలు లేవని ధ్రువీకరించేది ఈ పత్రమే.

క్రెడిట్‌ రిపోర్ట్‌ అప్‌డేట్‌..

లోన్‌ (Home Loan)ను పూర్తిగా చెల్లించిన వెంటనే ఆ సమాచారాన్ని క్రెడిట్‌ బ్యూరోలకు తెలియజేయమని బ్యాంకులను కోరాలి. 30 రోజుల తర్వాత క్రెడిట్‌ రిపోర్టును చెక్‌ చేసుకోవాలి. వివరాలు అప్‌డేట్‌ అయ్యాయో లేదో చూసుకోవాలి. లేదంటే మరోసారి బ్యాంకులను సంప్రదించి స్టేటస్‌ ఏంటో తెలుసుకోవాలి. ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకోవాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాపోతే.. ఎన్‌ఓసీని జత చేసి క్రెడిట్‌ బ్యూరోలకు లేఖ రాయాలి. ఈ ప్రక్రియ కొనసాగిస్తూనే ఎప్పటికప్పుడు క్రెడిట్‌ రిపోర్టును చెక్‌ చేసుకుంటూ ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని