Pakistan Economic Crisis: శ్రీలంక గతి పట్టొద్దని పాట్లు పడుతున్న పాక్‌

ఆర్థిక పతనం అంచున ఉన్న పాకిస్థాన్‌ను ఆ గండం నుంచి గట్టెక్కించేందుకు అక్కడి ప్రభుత్వం క్రమక్రమంగా చర్యలు చేపడుతోంది...

Published : 24 Jun 2022 18:42 IST

పరిశ్రమలపై సూపర్‌ ట్యాక్స్‌, సంపన్నులపై పేదరిక నిర్మూలన పన్ను

ఇస్లామాబాద్‌: ఆర్థిక పతనం అంచున ఉన్న పాకిస్థాన్‌ను ఆ గండం నుంచి గట్టెక్కించేందుకు అక్కడి ప్రభుత్వం క్రమంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఇంధనం, విద్యుత్తు ఛార్జీలను భారీగా పెంచిన ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ సర్కార్‌ తాజాగా మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. సిమెంటు, ఉక్కు, వాహన తయారీ వంటి భారీ పరిశ్రమలపై 10 శాతం ‘సూపర్‌ ట్యాక్స్‌’ విధిస్తున్నట్లు ప్రకటించారు. ధరల పెరుగుదల, దేశాన్ని దివాలా నుంచి రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మరోవైపు సంపన్నులపై ‘పేదరిక నిర్మూలన పన్ను’ విధిస్తున్నట్లు కూడా షెహబాజ్‌ ప్రకటించారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనపై ఏర్పాటైన ఆర్థిక కమిటీతో సమావేశమైన ఆయన అనంతరం ఈ నిర్ణయాలను వెల్లడించారు. ప్రజలపై ధరల భారాన్ని తగ్గించడమే తమ తొలి ప్రాధాన్యమని షరీఫ్‌ అన్నారు. తర్వాత దేశాన్ని బ్యాంకు ఎగవేతల నుంచి కాపాడడం మరో కర్తవ్యమన్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ నేతృత్వంలోని సర్కార్‌ మూలంగానే తమ దేశానికి ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు.

సిమెంటు, ఉక్కు, పంచదార, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎరువులు, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్‌, టెక్స్‌టైల్స్‌‌, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, సిగరెట్లు, బెవరేజీలు, కెమికల్స్‌ వంటి భారీ పరిశ్రమలకు ఈ సూపర్‌ ట్యాక్స్ వర్తించనుంది. తాజా చర్యలను కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం చేయకుండా కచ్చితంగా అమలు చేసి తీరతామని షరీఫ్‌ అన్నారు. క్లిష్ట సమయాల్లో పేదప్రజలే అనేక త్యాగాలు చేసినట్లు చరిత్ర చెబుతోందన్నారు. ఇప్పుడు సంపన్న వర్గాలు తమ వంతు సాయం అందించాల్సిన సమయం వచ్చిందన్నారు. వారి నిస్వార్థతను చాటుకోవడానికి ఇదే సరైన సమయమన్నారు. కచ్చితంగా వారు వారి పాత్రను విజయవంతంగా పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

వార్షిక ఆదాయం 150 మిలియన్‌ రూపాయలు (పాకిస్థాన్‌ రూపాయలు) దాటిన వారు ఒక శాతం, రూ.200 మిలియన్లు దాటినవారు 2 శాతం, రూ.250 మిలియన్లు దాటినవారు 3 శాతం, 300 మిలియన్లు దాటినవారు 4 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని షరీఫ్‌ ప్రకటించారు.

ఇటీవల పాక్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా క్షీణించాయి. ఈ పరిస్థితుల్లో కొత్త అప్పు పుట్టకుంటే పాక్‌ ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీలంకకు పట్టిన గతే ఆ దేశానికీ పడుతుందని ఇటీవల స్వయంగా ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రే ప్రకంటించారు. కరోనా అనంతరం ప్రపంచవ్యాప్తంగా వినియోగ వస్తువుల ధరలు జోరెత్తి, దిగుమతులకు గిరాకీ పెరిగిపోయింది. ఫలితంగా కరెంటు ఖాతా లోటుతో పాక్‌ రూపాయి భారీగా పతనమైంది. తక్కువ స్థాయి సాంకేతికతతో తయారయ్యే వ్యవసాయ, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, తోలు వస్తువులు, క్రీడా పరికరాలే ఆ దేశ ప్రధాన ఎగుమతులు. అవీ కొన్నేళ్లుగా క్షీణిస్తున్నాయి. అరకొర ఎగుమతులు, తక్కువ ఉత్పాదకతలు దీర్ఘకాలంపాటు కొనసాగడంవల్లే ప్రస్తుత దుస్థితి నెలకొంది. ప్రస్తుతం పాక్‌ ఆశలన్నీ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) రుణంపైనే ఉన్నాయి. ఐఎంఎఫ్‌ నుంచి భారీ ప్యాకేజీ కోసం చాలాకాలంగా పాక్‌ ప్రయత్నిస్తోంది. అందుకోసం ఐఎంఎఫ్‌ నిర్దేశించిన షరతులను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని