Rs.2000 నోట్ల డిపాజిట్‌ రూ.50 వేలు మించితే పాన్‌ తప్పనిసరి: శక్తికాంత దాస్‌

రూ.2,000 నోట్ల డిపాజిట్‌ సమయంలో పరిమితికి మించితే పాన్‌ తప్పనిసరిగా సమర్పించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 

Updated : 22 May 2023 12:41 IST

దిల్లీ: నగదు నిర్వహణలో భాగంగానే రూ.2,000 నోట్లను (Rs.2000 Notes) ఉపసంహరించుకుంటున్నామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) చెప్పారు. 2016లో నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి వేగంగా నగదును చొప్పించడంలో భాగంగానే రూ.2,000 నోటును తీసుకొచ్చినట్లు వివరించారు. నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు సోమవారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

సెప్టెంబరు 30 నాటికి చాలా వరకు రూ.2,000 నోట్లు (Rs.2000 Notes) ఖజానాకు చేరతాయని తాము ఆశిస్తున్నట్లు శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) తెలిపారు. నోట్ల మార్పిడి సమయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందన్నారు. మార్పిడి కోసం బ్యాంకుల వద్ద ప్రజలు హడావుడి పడాల్సిన అవసరం లేదని సూచించారు. నాలుగు నెలల సమయం ఉందని గుర్తు చేశారు. ప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకొని నోట్లన్నీ వాపస్‌ చేస్తారనే ఉద్దేశంతోనే అంత సమయం ఇచ్చామని తెలిపారు. కొందరు వ్యాపారులు గతకొంత కాలం నుంచే రూ.2,000 నోట్లను (Rs.2000 Notes) తిరస్కరిస్తున్నారన్నారు. ఉపసంహరణ ప్రకటన తర్వాత అది మరింత ఎక్కువై ఉంటుందని పేర్కొన్నారు.

రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్‌ సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉన్నట్లు దాస్‌ గుర్తు చేశారు. ఆ నిబంధన రూ.2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. రేపటి నుంచి బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రూ.2,000 నోట్ల స్థానంలో ఇతర నోట్లను ఇచ్చేందుకు తగినంత నగదు అందుబాటులో ఉంచామన్నారు. ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా తక్కువని తెలిపారు. చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2,000 నోట్ల వాటా కేవలం 10.18 శాతం మాత్రమేనని వెల్లడించారు. రూ.1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టనున్నారని వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

గుర్తింపు కార్డులు లేకుండా డిపాజిట్లను అనుమతిస్తే.. నల్లధనాన్ని ఎలా గుర్తిస్తారనే ప్రశ్నకు దాస్‌ స్పందించారు. డిపాజిట్ల విషయంలో ఇప్పటికే అవలంబిస్తున్న నిబంధనలనే రూ.2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తింపజేయాలని బ్యాంకులకు సూచించినట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో అయ్యే డిపాజిట్లను తనిఖీ చేసే అంశాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో బ్యాంకులకు నిర్దిష్టమైన నిబంధనలను ఉన్నాయని.. వాటినే ఇప్పుడూ అమలు చేస్తాయని స్పష్టం చేశారు.

నీడ, నీళ్ల వంటి వసతులు కల్పించండి..

నోట్ల మార్పిడి కోసం వచ్చే వారికి తగిన వసతులు కల్పించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. 2016 నోట్ల రద్దు సమయంలో సామాన్యులు భారీ లైన్లలో నిలబడి ఇబ్బందులు పడ్డారని గుర్తుచేసింది. కొంతమంది చనిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నోట్ల మార్పిడి కోసం వచ్చేవారికి నీడ, నీళ్ల వంటి వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. ముఖ్యంగా వేసవి నేపథ్యంలో సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని తెలిపింది. అలాగే కౌంటర్లన్నింటిలో నోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని