LIC IPO: కొవిడ్‌ లేకుంటేనా..ఎల్‌ఐసీ వ్యాపారం మరోలా ఉండేది!

త్వరలో ఐపీఓకి రానున్న భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) వ్యాపారంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.....

Published : 16 Feb 2022 12:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో ఐపీఓ (IPO)కి రానున్న భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) వ్యాపారంపై కరోనా మహమ్మారి (Pandemic) తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. వ్యక్తిగత, గ్రూప్‌ పాలసీల జారీ గణనీయంగా తగ్గింది. 2020 ఆర్థిక సంవత్సరంలో 62.43 మిలియన్ల పాలసీలు జారీ చేసిన సంస్థ.. 2021లో మాత్రం 52.54 మిలియన్ల పాలసీలను మాత్రమే చేయగలిగింది. 

పాలసీ విక్రయాల్లో క్షీణత..

లాక్‌డౌన్‌లు సహా ఇతర ఆంక్షలు పాలసీల విక్రయాలపై ప్రభావం చూపాయి. 2020 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 22.66 శాతం క్షీణత నమోదైంది. ఇక 2019 మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. 2021 తొలి త్రైమాసికంలో 46.20 శాతం, 2022 మొదటి త్రైమాసికంలో కొత్త పాలసీల సంఖ్యలో 34.93 శాతం తగ్గుదల కనిపించింది. ఇక 2022 తొలి అర్ధభాగంలో 2019 ఇదే సమయంతో పోలిస్తే పాలసీల జారీలో 38 శాతం తగ్గి 19 మిలియన్లుగా నమోదైంది.

ఏజెంట్లూ తగ్గారు..

ఏజెంట్ల ద్వారా ఎల్‌ఐసీ పాలసీల విక్రయాలు చేపడుతున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి మూలంగా క్రియాశీల ఏజెంట్ల సంఖ్యలోనూ భారీ తగ్గుదల నమోదైంది. 2021 మార్చి నాటికి 10.8 లక్షలుగా ఉన్న యాక్టివ్‌ ఏజెంట్ల సంఖ్య సెప్టెంబరు 2021 నాటికి 8,96,208కి తగ్గింది. గడిచిన 12 నెలల వ్యవధిలో కనీసం ఒక పాలసీని విక్రయించిన వారిని క్రియాశీల ఏజెంట్లుగా పరిగణిస్తారు. జనవరి 2022 నాటికి ఎల్‌ఐసీలో మొత్తం 13.30 లక్షల ఏజెంట్లు ఉన్నారు. మొత్తం దేశీయ జీవిత బీమా రంగంలో ఉన్న ఏజెంట్లతో పోలిస్తే ఇది 55 శాతం అధికం. మరోవైపు ఏజెంట్ల ఎంపిక నిమిత్తం ఏటా నిర్వహించే పరీక్షలను బీమా నియంత్రణా సంస్థ ఐఆర్‌డీఏ వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో కొత్త ఏజెంట్ల చేరిక తగ్గింది.

పెరిగిన డెత్‌ క్లెయింలు..

2019 ఆర్థిక సంవత్సరంలో రూ.49,338 కోట్లు, 2020లో రూ.49,210 కోట్లు, 2021లో రూ.53,574 కోట్లు, సెప్టెంబరు 30, 2021తో ముగిసిన 6 నెలల కాలంలో రూ.21,122 కోట్లు విలువ చేసే కొత్త పాలసీల ప్రీమియాలను ఏజెంట్లు సేకరించినట్లు సంస్థ సెబీకి సమర్పించిన ప్రాథమిక పత్రాల్లో పేర్కొంది. మరోవైపు సంస్థ డెత్‌ క్లెయిం (Death Claims)లు మహమ్మారి సమయంలో గణనీయంగా పెరిగాయి. 2022 ఆర్థిక సంవత్సరం కొవిడ్‌ రెండో దశ విజృంభిస్తున్న తొలి ఆరు నెలల సమయంలో రూ.21,734 కోట్లు విలువ చేసే క్లెయింలను సంస్థ పరిష్కరించింది. 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 90 శాతం అధికం. 2021లో డెత్‌ క్లెయింలకు ఎల్‌ఐసీ రూ.23,926.98 కోట్లు, 2020లో రూ.17,527.98 కోట్లు, 2019లో రూ.17,128.84 కోట్లు కేటాయించింది. ఇక సంఖ్యాపరంగా చూస్తే.. 2022 తొలి అర్ధభాగంలో 7,93,384, 2021లో 9,46,976, 2020లో 7,58,916, 2019లో సంస్థకు 7,50,950 డెత్‌ క్లెయింలు అందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని