కరోనా వచ్చినా.. భారత వృద్ధి పథం పదిలం: టాటా గ్రూప్‌ ఛైర్మన్‌

భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల వృద్ధి పథాన్ని కరోనా మహమ్మారి ఏమాత్రం ప్రభావితం చేయలేదని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్ తెలిపారు....

Published : 11 Jan 2022 23:06 IST

దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల వృద్ధి పథాన్ని కరోనా మహమ్మారి ఏమాత్రం ప్రభావితం చేయలేదని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్ తెలిపారు. అయితే, వృద్ధి లక్ష్యాలను కొంతమేర వాయిదా వేయగలిగిందని పేర్కొన్నారు. అలాగే ఈ దశాబ్దంలో ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశ వృద్ధి రేటే ముందుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్‌ ఏటా నిర్వహించే ‘ఫ్యూచర్‌ రెడీ’ సమావేశంలో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

డిజిటల్‌ వసతుల ద్వారా ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి సేవలను ప్రజలకు చేరువచేయాల్సిన అవసరం ఉందని చంద్రశేఖరన్‌ సూచించారు. ఇది జాతీయ ప్రాధాన్యం కావాలని ఆకాంక్షించారు. మహమ్మారి సంక్షోభ సమయంలో డిజిటల్‌ అడాప్షన్‌ వేగంగా జరిగిందని తెలిపారు. అయితే, దీన్ని ఉపయోగించుకునే స్థితిలో లేనివారు వెనుకబడ్డారని పేర్కొన్నారు. ఇది సమాజంలో ఉన్న అసమానతలను ఎత్తిచూపిందని వివరించారు.

జీఎస్టీ, బ్యాంకుల దివాలా స్మృతి, కార్పొరేటు పన్ను తగ్గింపు, బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్ల బలోపేతం వంటి సంస్కరణలు దేశ వృద్ధికి ఊతంగా నిలవనున్నాయని తెలిపారు. మరోవైపు మహమ్మారి సమయంలో ఏర్పాటు చేసిన అనేక మౌలిక వసతులు వృద్ధికి వేగాన్ని మరింత పెంచనున్నాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని