Health Insurance: బృంద బీమాలో తల్లిదండ్రులను చేర్చడం మంచిదేనా?

సంస్థ ఆఫర్‌ చేసే గ్రూప్‌ కవర్‌ పాలసీలో తల్లిదండ్రులను చేర్చడం వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published : 20 Mar 2023 15:04 IST

ఇంటర్నెట్ డెస్క్: చాలా ప్రైవేట్‌ సంస్థలు ఉద్యోగి హోదాను బట్టి ఉచితంగానే బృంద బీమా (గ్రూప్‌ మెడికల్‌ కవరేజీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అయితే, ఉద్యోగులే కాకుండా వారి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకు కూడా ఈ బీమా పొందొచ్చు. అయితే, ఉద్యోగి తల్లిదండ్రులకు కంపెనీ అందించే ఈ బీమా కవర్‌ వల్ల ఉపయోగాలు ఏంటి? ఏవైనా ఇబ్బందులున్నాయా? ఆ కవరేజీ సరిపోతుందా?

ప్రీమియం

బృంద బీమాలో ఉద్యోగి, జీవిత భాగస్వామి, పిల్లలు, ఇంకా ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు కూడా బీమా కవరేజీలో ఉంటారు. ఇటువంటి పాలసీలు ఉద్యోగులు, వారి కుటుంబానికి తగిన ఆరోగ్య ధీమాను అందిస్తున్నప్పటికీ.. గ్రూప్‌ బీమా పరిధిలో తల్లిదండ్రులను చేర్చుకున్నప్పుడు వారి వయసు ఆధారంగా చాలా సంస్థలు అధిక బీమా ప్రీమియం వసూలు చేస్తాయి. 

బీమా కవరేజీ సరిపోతుందా?

యజమాని అందించే బీమా కింద తల్లిదండ్రులను కవర్‌ చేయడం వల్ల అదనపు బీమా ప్రయోజనం కలుగుతుంది. అయితే, సీనియర్‌ సిటిజన్లకు సాధారణంగానే వైద్య ఖర్చులు ఎక్కువ ఉంటాయి. వారు వయసు రీత్యా తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. అలాగే, వ్యాధుల తీవ్రత వారిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బృంద బీమాలో ఉండే బీమా కవరేజీ సరిపోకపోవచ్చు.

ఇబ్బందులు

వృద్ధులు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉన్నందున, పాలసీ సంవత్సరంలో అనేక క్లెయిమ్‌లు వారి గురించే చేయల్సి ఉండొచ్చు. అటువంటి సందర్భంలో మిగతా కుటుంబసభ్యులకు తక్కువ బీమా హామీ మిగులుతుంది. కాబట్టి, యజమాని ఆఫర్‌ చేస్తున్నదానితో పాటు తల్లిదండ్రుల కోసం ప్రత్యేక పాలసీని కొనుగోలు చేయడం మంచిది. అంతేకాకుండా, ఉద్యోగి తన సంస్థను మారాలనుకున్నా లేదా విశ్రాంతి తీసుకున్నా, సంస్థను విడిచిపెట్టిన వెంటనే యజమాని అందించే ప్లాన్‌ ముగుస్తుంది. ఉద్యోగికే కాకుండా.. తల్లిదండ్రులకు తప్పనిసరిగా అవసరమయ్యే ఎటువంటి ఆరోగ్య బీమా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో అనారోగ్యాలు ఏర్పడినప్పుడు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు.

విశ్వసనీయత

ఉద్యోగి, అతడి కుటుంబాన్ని బృంద బీమా పరిధిలోకి తీసుకురావడం సులభం అయినప్పటికీ, దాని కొనసాగింపు సంస్థ యజమానికి సంబంధించిన ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. కవరేజీ ప్రయోజనాలను యజమాని తగ్గించాలని నిర్ణయించుకున్నా, పాలసీని నిలిపివేయాలని లేదా పాలసీలో తల్లిదండ్రులకు లభించే ప్రయోజనాన్ని తీసివేయాలని నిర్ణయించుకున్నా.. అది మీ వైద్య కవరేజీ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.

ఉపయోగాలు

గ్రూప్‌ కవర్‌ కింద ఉద్యోగి, అతడిపై ఆధారపడినవారు ముందస్తు మెడికల్‌ చెక్‌-అప్‌లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఉద్యోగితో పాటు కుటుంబసభ్యులు ఎటువంటి అవాంతరాలు, మెడికల్‌ రిపోర్టులు అవసరం లేకుండా తక్షణమే ఆరోగ్య బీమా పాలసీని పొందుతారు. రిటైల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే.. చాలా గ్రూప్‌ పాలసీలు జీరో వెయిటింగ్‌ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. పాలసీ ప్రారంభం నుంచి ఉద్యోగికి, అతడిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు తక్షణ కవరేజీని అందిస్తాయి. ఇది చాలా సానుకూలాంశం. ఉదా: తల్లిదండ్రులకు ఉబ్బసం, మధుమేహం లేదా ఏదైనా తీవ్రమైన వైద్య పరిస్థితులు ఉంటే.. వారు చికిత్స పొంది, బృంద బీమా  కింద క్లెయిమ్‌ చేయవచ్చు. ఎందుకంటే, ఇది మొదటి రోజు నుంచి చికిత్సలను కవర్‌ చేస్తుంది.

చివరిగా: బృంద బీమా కవర్ ఉన్నప్పటికీ సమగ్ర కవరేజీ కోసం అదనంగా సొంతంగా ఆరోగ్య బీమా పాలసీ ఉండడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని