Union Budget 2024: జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 23న కేంద్ర బడ్జెట్‌

జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, ఆ మరుసటి రోజు ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్‌ (Union Budget 2024) ను సమర్పిస్తారని కిరణ్‌ రిజిజు తెలిపారు.  

Updated : 06 Jul 2024 16:21 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించి, నరేంద్రమోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే కూటమి కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రభుత్వం జులై 23న బడ్జెట్‌ (Union Budget 2024)ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సమర్పించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు.

ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తున్నారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ ఇదే. దీంతో వరసగా ఏడుసార్లు బడ్జెట్‌ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్‌ అందుకోనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్‌ వరసగా ఆరుసార్లు బడ్జెట్‌ సమర్పించారు.

2019లో రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామన్‌కు (Nirmala Sitharaman) ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రెండో మహిళగా గుర్తింపు పొందారు. ఎప్పటిలా సూట్‌కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్‌ ప్రతులను తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని