Automobile: ఏప్రిల్‌ కార్ల సరఫరాల్లో 13% వృద్ధి: సియామ్‌

Passenger vehicle dispatches: ఏప్రిల్‌ నెలలో రికార్డు స్థాయిలో కార్ల సరఫరాలు జరిగాయి. ద్విచక్ర, త్రిచక్ర వాహన సరఫరాల్లోనూ వృద్ధి నమోదైంది.

Published : 12 May 2023 15:33 IST

దిల్లీ: దేశీయంగా ఏప్రిల్‌ నెలలో ప్రయాణికుల వాహన సరఫరాలు (Passenger vehicles) 13 శాతం పెరిగాయని వాహన తయారీదార్ల సమాఖ్య (సియామ్‌) వెల్లడించింది. గతేడాది అన్ని విభాగాల్లో మెరుగైన డిమాండ్‌ కారణంగా వృద్ధి నమోదైందని తెలిపింది. 2022 ఏప్రిల్‌లో 2,93,303 యూనిట్ల వాహనాలు సరఫరా అవ్వగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ సంఖ్య 3,31,278గా నమోదైందని సియామ్‌ తెలిపింది.

కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,37,320 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసినట్లు సియామ్‌ పేర్కొంది. గతేడాది ఏప్రిల్‌లో ఈ సంఖ్య 1,31,995గా ఉంది. హ్యుందాయ్‌ సైతం 49,701 వాహనాలను సరఫరా చేసిందని తెలిపింది. టూవీలర్‌ విభాగంలో సైతం 15 శాతం వృద్ధితో 13,38,588 యూనిట్లు డీలర్లకు సరఫరా చేసినట్లు సియామ్‌ వెల్లడించింది. గతేడాది ఈ సంఖ్య 11,62,582 యూనిట్లుగా ఉంది. మోటార్‌ సైకిల్‌ విభాగంలో 8,39,274 యూనిట్లు, స్కూటర్ల విభాగంలో 4,64,389 యూనిట్లు సరఫరా జరిగినట్లు తెలిపింది. 

త్రీవీలర్‌ సరఫరాలు సైతం 20,997 యూనిట్ల నుంచి 42,885 యూనిట్లకు పెరిగినట్లు సియామ్‌ తెలిపింది. కార్లు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు సంబంధించి అన్ని విభాగాల్లో డిమాండ్‌ కారణంగా ఏప్రిల్‌లో మెరుగైన వృద్ధి నమోదైందని సియామ్‌ తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన బీఎస్‌-VI ఫేజ్‌-2 నిబంధనలను అందిపుచ్చుకొనే ప్రక్రియ సాఫీగా సాగిందనడానికి సూచికగా దీన్ని పేర్కొనవచ్చునని సియామ్‌ అధ్యక్షుడు వినోద్‌ అగర్వాల్‌ తెలిపారు. ఏప్రిల్‌ నెలలో ఈ స్థాయిలో కార్ల విక్రయాలు జరగడం ఇదే తొలిసారి అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మేనన్‌ చెప్పారు. త్రీవీలర్‌ విక్రయాలు కొవిడ్‌ మునుపటి స్థాయికి చేరాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు