Vehicle Sales: ప్రయాణికుల వాహన టోకు విక్రయాల్లో 92% వృద్ధి

పండుగ సీజన్‌ నేపథ్యంలో సెప్టెంబరులో ప్రయాణికుల వాహన టోకు విక్రయాలు 92 శాతం పెరిగాయి. మొత్తంగా సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలోనూ టోకు అమ్మకాల్లో గణనీయ వృద్ధి నమోదైంది.

Published : 13 Oct 2022 18:27 IST

దిల్లీ: కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల (Passenger vehicles- PV) టోకు సరఫరాలు సెప్టెంబరులో ఏకంగా 92 శాతం పెరిగాయని భారత వాహన తయారీదార్ల సంఘం (SIAM) వెల్లడించింది. 2021 సెప్టెంబరులో 1,60,212 పీవీలు డీలర్లకు చేరగా, గత నెలలో ఈ సంఖ్య 3,07,389కి చేరింది. పండుగల సీజన్‌లో ఉండే గిరాకీని దృష్టిలో ఉంచుకుని డీలర్లు అధికంగా ఆర్డర్లు పెట్టినట్లు తెలిపింది.

సియామ్‌ గణాంకాల ప్రకారం.. సెప్టెంబరులో ద్విచక్రవాహన విక్రయాలు 13 శాతం పెరిగి 17,35,499 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 15,37,604గా నమోదైంది. అదే సమయంలో మోటార్‌ సైకిళ్ల అమ్మకాలు 9,48,161 యూనిట్ల నుంచి 18 శాతం ఎగబాకి 11,14,667కు పెరిగాయి. స్కూటర్ల విక్రయాలు 9 శాతం పెరిగి 5,72,667 యూనిట్లకు చేరాయి. 

జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ప్రయాణికుల వాహన విక్రయాలు 38 శాతం పెరిగాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో 7,41,442 యూనిట్లు అమ్ముడుకాగా.. ఈసారి ఆ సంఖ్య 10,26,309 యూనిట్లుగా నమోదైంది. ద్విచక్ర వాహన విక్రయాలు సెప్టెంబరు త్రైమాసికంలో 13 శాతం పెరిగి 46,73,931 యూనిట్లకు చేరాయి.  మరోవైపు వాణిజ్య వాహన టోకు విక్రయాలు సైతం 41,36,484 యూనిట్ల నుంచి 13 శాతం పెరిగి 46,73,931 యూనిట్లకు పెరిగింది. మొత్తం సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికంలో విక్రయాలు అన్ని కేటగిరీల్లో కలిపి 51,15,112 యూనిట్ల నుంచి 60,52,628 యూనిట్లకు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని