HDFC ergo: ఇకపై తిరిగిన దూరానికే బీమా ప్రీమియం చెల్లించండి!

పాలసీదారుడు ఒక సంవత్సరంలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తారో దాని ఆధారంగా బీమా ప్రీమియంను చెల్లించవచ్చు

Updated : 04 May 2022 16:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ప్రైవేట్ రంగ బీమా సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘పే యాజ్ యు డ్రైవ్’ పేరుతో సరికొత్త పాలసీని ప్రారంభించింది. పాలసీదారులకు బీమా ప్రీమియంను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పాలసీని ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది. దీని ప్రకారం పాలసీదారుడు ఒక సంవత్సరంలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తారో దాని ఆధారంగా బీమా ప్రీమియంను చెల్లించవచ్చు. తక్కువ కిలోమీటర్లు వాహనం నడిపే వినియోగదారులకు, రెండు లేదా అంతకంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్న వారికి ఈ పాలసీ సరిగ్గా సరిపోతుందని సంస్థ తెలిపింది.

మన దేశంలో చాలా మంది వాహన బీమా పాలసీదారులు తమ వాహనాలను తరచుగా ఉపయోగించరు. అయినప్పటికీ ఎక్కువగా వాహనాలను వినియోగించే వారి మాదిరిగానే బీమా ప్రీమియంలను చెల్లిస్తున్నారు. ‘పే యాజ్ యు డ్రైవ్’ ప్రోగ్రామ్ కారు వాస్తవ వినియోగం ఆధారంగా ప్రీమియం చెల్లించే అవకాశాన్ని అందిస్తుంది. వాహనంలో అమర్చిన ‘టెలిమాటిక్స్’ పరికరం సాయంతో పాలసీదారులు కారులో ఎంత దూరం ప్రయాణించారనే విషయాన్ని తెలుసుకోవచ్చు. పాలసీదారులు ఎంచుకున్న ‘డిస్టెన్స్ శ్లాబ్‌’ల ఆధారంగా ‘ఓన్ డ్యామేజ్’ ప్రీమియంలో 10 నుంచి 20 శాతం ఆదా చేసుకోవచ్చునని సంస్థ తెలిపింది. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి 10,000 పాలసీలు లేదా రూ.50 లక్షల ప్రీమియం (ఏది ముందుగా పూర్తి అయితే అది) వరకు మారుతీ సుజుకీ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రత్యేకంగా అందించనున్నారు. ఈ ఆఫర్‌ 2022 మే 14 వరకు ఎంపిక చేసిన నగరాల్లో కొత్త మారుతీ సుజుకీ కార్ల యజమానులకు అందుబాటులో ఉండనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని