Google: ఇంటి నుంచే పనిచేస్తుంటే.. గూగుల్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత!

గూగుల్‌ ఉద్యోగుల్లో శాశ్వతంగా ‘ఇంటి నుంచి పని’ విధానాన్ని ఎంచుకున్న వారికి వేతనాలు తగ్గనున్నాయి. కంపెనీ జూన్‌లో తీసుకొచ్చిన ‘వర్క్‌ లొకేషన్‌ టూల్‌’ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి....

Updated : 11 Aug 2021 14:46 IST

న్యూయార్క్‌: గూగుల్‌ ఉద్యోగుల్లో శాశ్వతంగా ‘ఇంటి నుంచి పని’ విధానాన్ని ఎంచుకున్న వారికి వేతనాలు తగ్గనున్నాయి. కంపెనీ జూన్‌లో తీసుకొచ్చిన ‘వర్క్‌ లొకేషన్‌ టూల్‌’ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. సిలికాన్‌ వ్యాలీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియను ఇతర పెద్ద కంపెనీలూ పాటిస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విటర్‌లు సైతం తక్కువ వ్యయాలుండే ప్రాంతాలకు మారిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి. రెడిట్, జిల్లో వంటి చిన్న కంపెనీలు కూడా ప్రాంతం ఆధారిత చెల్లింపుల నమూనాకు మారాయి.

10 శాతం వరకు కోత!..

ఆల్ఫాబెట్‌ ఇంక్‌కు చెందిన గూగుల్‌ తన ఉద్యోగుల కోసం ఒక కాలిక్యులేటర్‌ను అందజేసింది. దీని ద్వారా ఉద్యోగులు ఏ ప్రాంతానికి వెళితే వేతనాల్లో ఏ మార్పులు చోటుచేసుకుంటాయన్నది తెలుసుకోవచ్చు. ‘మా వేతన ప్యాకేజీలన్నీ ప్రాంతం ఆధారంగానే నిర్ణయిస్తాం. స్థానిక మార్కెట్లోని ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాన్నీ ఇస్తుంటామ’ని గూగుల్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. నగరాలు, రాష్ట్రాలను బట్టి వేతనాల్లో తేడాలుంటాయని ఆయన వివరించారు. సియాటిల్‌ కార్యాలయానికి దగ్గరలో ఉండే గ్రామీణ ప్రాంతానికి మారిన ఉద్యోగులకు 10 శాతం మేర కోత ఉండొచ్చని ‘వర్క్‌ లొకేషన్‌ టూల్‌’ ఆధారంగా ఒక గూగుల్‌ ఉద్యోగి తెలిపారు. దీంతో రెండు గంటల ప్రయాణమైనా సరే కార్యాలయానికే వెళ్లాలని ఆయా ఉద్యోగులు భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని