Motor Insurance: తక్కువ నడిపితే తక్కువ ప్రీమియం చెల్లించండి.. ఈ పాలసీల గురించి తెలుసా?

ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే కారు తీస్తుంటారా? అయినా వేల రూపాయలు ప్రీమియం కడుతుంటారా?  అయితే మీలాంటి వారి కోసమే ఈ బీమా పాలసీలు..

Published : 07 May 2023 19:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయాలు పెరగడంతో కారు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, కారుకొన్నాక తమ రోజువారీ అవసరాల కోసం వినియోగించే వారు కొందరైతే.. ఎప్పుడో ఒకసారి గానీ పార్కింగ్‌ నుంచి బయటకు తీయని వారు మరికొందరు. కారు వాడినా వాడకపోయినా మోటారు వాహన బీమా (Motor Insurance) తీసుకోవడం తప్పనిసరి. ఒకవేళ మీరు రెండో కేటగిరీకి చెందిన వారైతే ‘పే యాజ్‌ యూ డ్రైవ్‌’ (PAYD) మోటార్‌ బీమా పాలసీని పరిశీలించొచ్చు. మీ వినియోగాన్ని బట్టి బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉండడం ఈ పాలసీల ప్రత్యేకత. PAYD పాలసీలు అనేవి మీరు వాహనం నడిపే తీరు, మీరు తిరిగిన దూరం ఆధారంగా ఈ పాలసీల్లో ప్రీమియం ఉంటుంది. ఎవరైతే అప్పుడప్పుడూ మాత్రమే కారును వినియోగిస్తారో అలాంటి వారికి ఇవి సరిపోతాయి.

సాధారణంగా వాహన బీమా పాలసీలో వాహనానికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు పరిహారం ఇవ్వడం (ఓన్‌ డామేజీ), తృతీయ పక్షానికి నష్టం జరిగితే పరిహారం ఇవ్వడం (థర్డ్‌ పార్టీ) ఉంటాయి. థర్డ్‌ పార్టీ బీమా లేకుండా వాహనం రోడ్డుపైకి రాకూడదు. అయితే, PAYD పాలసీ తీసుకున్నంత మాత్రాన థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంలో ఎలాంటి మార్పూ ఉండదు. అయితే, మీరు తిరిగే దూరాన్ని బట్టి, నడిపే విధానం బట్టి ఓన్‌ డ్యామేజీ పార్ట్‌లో ప్రీమియంలో కొంతమేర రాయితీ పొందొచ్చు. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో  అందిస్తున్న ప్లాన్‌ను తీసుకుంటే ఏడాదిలో 10వేల కిలోమీటర్లలోపే ప్రయాణిస్తే.. ఓన్‌ డ్యామేజీ ప్రీమియంలో 25 శాతం వరకు రాయితీ పొందొచ్చు. ఓడోమీటర్‌ రీడింగ్‌ ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. మిగిలిన బీమా సంస్థలు సైతం ఈ తరహా పాలసీలను విక్రయిస్తున్నాయి.

పాలసీలు రెండు రకాలు

పే యాజ్‌ యూ డ్రైవ్‌ పాలసీలు అనేవి యాడ్‌ ఆన్‌ రూపంలో లభిస్తాయి.  ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వాహన ప్రయాణ దూరం ఆధారంగా ప్రీమియం ఉంటుంది. ఓడో మీటర్‌లోని దూరం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. ఇక రెండోది డ్రైవర్‌ ప్రవర్తనను బట్టి బీమా ప్రీమియం ఉంటుంది. అంటే వాహన వేగం, యాక్సిలరేషన్‌, బ్రేకింగ్‌ వంటి అంశాల ఆధారంగా ప్రీమియం లెక్కిస్తారు. ఇందుకోసం టెలీమెటిక్స్‌ డివైజులను వాడుతారు. రెండూ కలగలిపిన హైబ్రిడ్‌ పాలసీలు సైతం ఉంటాయి.

తీసుకునేముందు ఏం చూడాలి?

PAYD పాలసీలను తీసుకునే ముందు సంప్రదాయ సమగ్ర బీమా పాలసీలతో పాటు వేర్వేరు సంస్థలు అందించే బీమా పాలసీలను సరిపోల్చండి. ప్రీమియం రేట్లు, కవరేజీ పరిమితులు వంటివీ తనిఖీ చేయండి. నడిపే విధానం ఆధారిత పీఏవైడీ పాలసీలు తీసుకొనేటప్పుడు టెలీమెటిక్స్‌ డివైజులను అమర్చాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌ ప్రవర్తనను అంచనావేయడంతో పాటు లొకేషన్‌ వంటి వ్యక్తిగత సమాచారం సైతం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలసీ తీసుకొనేముందు  పర్సనల్‌ డేటాను ఎలా వినియోగిస్తారనేది తెలుసుకోండి. అలాగే PAYD పాలసీల్లో లిమిటెడ్‌ కవరేజీ మాత్రమే అందించే అవకాశం ఉంది. కాబట్టి  పాలసీని తీసుకొనేముందు  పాలసీని క్షుణ్ణంగా పరిశీలించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు