Paytm CEO: పేటీఎం సీఈఓ అరెస్ట్‌.. విడుదల.. ఏం జరిగిందంటే?

పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మను దిల్లీ పోలీసులు ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. కాసేపటికే బెయిల్‌పై విడుదల కూడా చేశారు......

Published : 13 Mar 2022 13:55 IST

దిల్లీ: పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మను దిల్లీ పోలీసులు ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. కాసేపటికే బెయిల్‌పై విడుదల కూడా చేశారు. గత నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యంగా కారు నడిపి మరో వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 22న తన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కారులో ప్రయాణిస్తున్న విజయ్‌ శేఖర్‌ శర్మ.. వేగంగా వచ్చి డీసీపీ బెనితా మేరీ జైకర్‌కు చెందిన కారును ఢీకొట్టారు. ఈ ఘటన మదర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సమీపంలో జరిగింది. అయితే, విజయ్‌ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆ సమయంలో డీసీపీ కారును పెట్రోల్‌ కొట్టించడానికి తీసుకెళ్తున్న డ్రైవర్‌ దీపక్‌ కుమార్‌.. విజయ్‌ కారు నెంబర్‌ను రాసుకున్నారు. జరిగిన విషయాన్ని డీసీపీకి తెలిపారు.

దర్యాప్తు జరిపిన పోలీసులు కారు గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ కంపెనీకి చెందినదని గుర్తించారు. అక్కడకు వెళ్లి విచారిస్తే.. అది విజయ్‌ది అని తేలింది. దీంతో వెంటనే పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, బెయిల్‌ ఇవ్వగలిగే సెక్షన్ల కింద నేరం ఉండడంతో కాసేపటికే ఆయన్ని వదిలేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని