Paytm-SBI నుంచి రూపే క్రెడిట్ కార్డ్‌.. ఈ కొనుగోళ్లపై 3% క్యాష్‌బ్యాక్‌

Paytm-SBI Rupay Credit card: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌పీసీఐ, పేటీఎం సంయుక్తంగా కొత్త క్రెడిట్‌ కార్డును లాంచ్‌ చేశాయి. రూపే నెట్‌వర్క్‌పై ఈ కార్డు పనిచేస్తుంది.

Published : 18 May 2023 20:42 IST

ముంబయి: ప్రముఖ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ పేటీఎం (Paytm), ఎస్‌బీఐ కార్డ్‌ (SBI card), నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (NPCI) కలిసి కొత్త క్రెడిట్‌ కార్డును లాంచ్‌ చేశాయి. ఎస్‌బీఐ- పేటీఎం కలిసి ఇది వరకే ఓ క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చాయి. తాజాగా ఎన్‌పీసీఐతో కలిసి రూపే నెట్‌వర్క్‌పై కొత్త క్రెడిట్‌ కార్డును (RuPay credit card) తీసుకొచ్చారు.

ఈ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి పేటీఎం ద్వారా చేసే చెల్లింపులపై 2 శాతం క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. ఇతర కొనుగోళ్లపై 1 శాతం క్యాష్‌ బ్యాక్‌ వస్తుంది. ఈ కార్డు ద్వారా ఫ్యూయల్‌ కొనుగోళ్లపై 1 శాతం సర్‌ఛార్జీ రద్దు ఉంటుంది. ‘ప్లాటినమ్‌’ కార్డు హోల్డర్లకు లక్ష రూపాయల వరకు సైబర్‌ ఫ్రాడ్‌ కవరేజీ సదుపాయం ఉంటుంది. వెల్‌కమ్‌ బెన్‌ఫిట్‌లో భాగంగా పేటీఎం ఫస్ట్‌ మెంబర్‌ షిప్‌ కింద రూ.75 వేల వరకు ప్రయోజనాలు పొందొచ్చని ఆయా సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇందులో భాగంగా ఓటీటీ మెంబర్‌షిప్‌తో పాటు, పేటీఎం యాప్‌ ద్వారా చేసే విమాన టికెట్లపై డిస్కౌంట్ సైతం పొందొచ్చు. పేటీఎం యాప్‌ ద్వారా చేసే మూవీ, ట్రావెల్‌ టికెట్లపై 3 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

ఈ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ మాట్లాడుతూ.. రూపే క్రెడిట్‌ కార్డు నెట్‌వర్క్‌పై పనిచేసే ఈ క్రెడిట్‌ కార్డును క్యూఆర్‌ కోడ్‌ ద్వారా యూపీఐ చెల్లింపులకు వినియోగించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల డిజిటల్‌ పేమెంట్స్‌లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందన్నారు. పేటీఎంతో కలిసి లాంచ్‌ చేసిన ఈ  కార్డు ద్వారా తమ క్రెడిట్‌ కార్డు విభాగం మరింత బలోపేతం అవుతుందని ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ, సీఈఓ రామమోహన్‌ రావు అన్నారు. ఈ క్రెడిట్‌ కార్డు యువతను ఆకట్టుకుంటుందని ఎన్‌పీసీఐ సీఈఓ ప్రవీణా రాయ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని