Paytm : ఆర్‌బీఐ ఆంక్షలతో పేటీఎం షేరు కుదేల్‌!

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో 51 శాతం వాటాను కలిగి ఉన్నారు

Updated : 14 Mar 2022 12:04 IST

ముంబయి: కొత్త ఖాతాలు తెరవడం నిలిపివేయాల్సిందిగా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది. దీంతో సోమవారం కంపెనీ షేర్ల విలువ భారీగా పతనమైంది. ఓ దశలో 12 శాతానికి పైగా కుంగి రూ.672 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. ఉదయం 11:20 గంటల సమయంలో స్టాక్‌ ధర 11 శాతం మేర నష్టపోయి రూ.691 వద్ద చలిస్తోంది. ఇష్యూ ధరతో పోలిస్తే.. ఈ స్టాక్‌ ఇప్పటి వరకు 70 శాతం వరకు కుంగింది.

బ్యాంక్‌లో కొన్ని పర్యవేక్షణ లోపాలు గుర్తించడంతో ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949లోని 35ఏ సెక్షన్‌ కింద, కొత్త ఖాతాలు తెరవడాన్ని తక్షణమే నిలిపివేయాల్సిందిగా పేటీఎంను ఆదేశించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. పేటీఎం ఐటీ వ్యవస్థపై సమగ్ర ఆడిట్‌ నిర్వహించేందుకు, ఒక ఐటీ ఆడిట్‌ సంస్థను నియమించుకోవాల్సిందిగా ఆర్‌బీఐ సూచించింది. 2016 ఆగస్టులో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఏర్పాటైంది. 2017 మేలో నోయిడాలో శాఖతో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఆర్‌బీఐ ఆంక్షలను పేటీఎం ఎదుర్కోవడం మూడోసారి కాగా, కొత్తఖాతాలు ప్రారంభించవద్దనడం రెండోసారి.

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో 51 శాతం వాటాను కలిగి ఉన్నారు. మిగిలిన వాటా వన్97 కమ్యూనికేషన్స్ కలిగి ఉంది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, తమ ప్రస్తుత కస్టమర్‌లు బ్యాంకింగ్ సేవలన్నింటినీ సజావుగా ఉపయోగించుకోవచ్చునని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని