Paytm share: రికార్డు కనిష్ఠానికి పేటీఎం షేర్‌.. ఒక్కరోజే 11 శాతం డౌన్‌!

పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ షేరు విలువ పతనం కొనసాగుతోంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో ఏకంగా 11 శాతం మేర పతనమైంది.

Published : 22 Nov 2022 22:22 IST

దిల్లీ: ప్రముఖ ఆర్థికసేవల సంస్థ పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ షేరు విలువ పతనం కొనసాగుతోంది. ఐపీఓకు వచ్చినప్పటి నుంచి ఎప్పటికప్పుడు కొత్త కనిష్ఠాలకు చేరుతూ వచ్చిన ఈ షేరు.. తాజాగా మంగళవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో ఏకంగా 11 శాతం మేర పతనమైంది. దీంతో బీఎస్‌ఈలో జీవితకాల కనిష్ఠమైన రూ.474కు చేరింది.

గతేడాది నవంబర్‌లో ఐపీఓకు వచ్చిన పేటీఎం.. ఆరంభం నుంచే మదుపరులకు షాకుల మీద షాకులు ఇస్తూ వచ్చింది. రూ.2150 వద్ద లిస్టయిన ఈ షేరు ఏ రోజు ఆ స్థాయికి చేరింది లేదు. ఓ పది రోజుల క్రితం వరకు రూ.600 ఎగువన ఉన్న ఆ షేరు విలువ.. ఈ నెల 15న లాకిన్‌ గడువు ముగియడంతో భారీగా పతనమైంది. గతంలో పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్‌బ్యాంక్‌ తన వాటాలను తగ్గించుకోవడమూ ఇందుకు కారణమైంది.

తాజాగా పేటీఎం షేరుకు జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూపంలో కొత్త సవాల్‌ ఎదురైంది. పేటీఎం, ఫోన్‌పే, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి సంస్థకు జియో ఫైనాన్షియల్‌ గట్టి పోటీ ఇవ్వబోతోందంటూ రీసెర్చ్‌ సంస్థ మెక్వారీ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో దేశంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థగా అవతరించబోతోందని పేర్కొంది. దీంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో పేటీఎం షేరు విలువ ఏకంగా క్రితం ముగింపు రూ.537 నుంచి రూ.60 క్షీణించి రూ.474.3 వద్ద ముగిసింది. కనిష్ఠ స్థాయిల వద్ద మద్దతు లభించినప్పటికీ.. సెంటిమెంట్‌ బలహీనంగా ఉండడంతో నష్టాలు తప్పలేదు. మరోవైపు ఏడాది క్రితం పేటీఎంతో పాటు ఐపీఓకు వచ్చిన నైకా పరిస్థితీ ఇలానే ఉంది. ఇవాల్టి ట్రేడింగ్‌లో నైకా షేరు విలువ 3.41 శాతం క్షీణించి రూ.177.30 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని