Loans: పీ2పీ రుణం మంచిదేనా?

పీ2పీ రుణాలు క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రభావం చూపే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల రుణం తీసుకున్న‌వారు  సమయానికి చెల్లింపులు చేయాలి. 

Published : 14 Dec 2021 16:20 IST

పీర్ టూ పీర్ లెండింగ్ అంటే ఒక‌రి నుంచి మ‌రొక‌రు డ‌బ్బు అప్పుగా తీసుకోవ‌డం. దీన్నే సంక్షిప్తంగా పీ2పీ లెండింగ్ అంటారు. అంటే, రుణ గ్ర‌హీత‌లను, రుణదాత‌లను ఒకే వేదిక‌పైకి తీసుకురావ‌డం. ఇవి బ్యాంకులు, ఫైనాన్సియల్ ఇన్స్‌టిట్యూషన్ల మాదిరిగా పనిచేయవు. ఇందులో రుణదాత మీ వంటి వ్యక్తులు కావచ్చు లేదా ఆర్థిక సంస్థలు కావచ్చు. ఫెయిర్ సెంట్, ఐ2ఐ ఫండింగ్, పీర్లాండ్ వంటి పీ2పీ సంస్థలకు ఆర్థికేతర బ్యాంకింగ్ సంస్థల లైసెన్సు ఉంది. 

ఎలా పనిచేస్తుంది?
మీరు భారతీయులైతే ఈ వేదిక ద్వారా రుణం తీసుకోవచ్చు. ఇందుకుగాను మీ పేరు, చిరునామా, కాంటాక్ట్ నెంబర్, పుట్టిన తేది, జెండర్, తీసుకోవాలనుకుంటున్న రుణం మొత్తం, ఉద్యోగం, ఆదాయం, పాన్ వంటి పూర్తి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. వెరిఫికేషన్ పూర్తయిన తరువాత ఈ వేదికను ఉపయోగించి వ్యక్తిగత రుణం లేదా వ్యాపారానికి రుణం తీసుకోవచ్చు. వడ్డీ రేటు 8.95 శాతం నుంచి 30 శాతం వరకు ఉంటుంది. రూ. 30 వేల‌ నుంచి  రూ. 5 లక్షల వరకు రుణం పొందడానికి అవకాశం ఉంది. సాధారణంగా వ్యాపారం, గృహ మరమ్మత్తులు, కుటుంబంలో జరిగే శుభకార్యాలకు రుణం పొందొచ్చు. 

ఏం చెయ్యాలి?
ఖర్చుల కోసం రుణం తీసుకోవడం మంచిది కాదు. అయినప్పటికీ రుణం తీసుకోవాలనుకుంటే వడ్డీ రేట్లను పోల్చి చూడడం మంచిది. ప్రోసెసింగ్ రుసుములు, రుణ మొత్తంపై 3 శాతం నుంచి 5.5 శాతం వరకు ఉండొచ్చు. మీరు నాన్‌- బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ‌ను ఎంచుకుంటే మీ క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపించకుండా సమయానికి చెల్లింపులు చేయాలి. 

రాబ‌డికి హామీ ఉండ‌దు..
ఈ వేదిక‌ల ద్వారా రుణం ఇచ్చి వ‌డ్డీ పొందాల‌నుకునే వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీటిలో డ‌బ్బు తిరిగి చెల్లించడంపై హామీ ఉండ‌దు. ఈ లెండింగ్ యాప్లు స‌ర్వీసు మాత్ర‌మే అందిస్తాయి కానీ ఇత‌ర ఆర్థిక ప‌ర‌మైన అంశాల‌కు చ‌ట్ట‌ప‌రంగా భాద్య‌త వ‌హించ‌వు. ఈ యాప్లు వినియోగించే ముందు పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డం మంచిది. ఇందులో రిస్క్ ఆధారంగా రాబడి ఉంటుంది. ఒక్కోసారి అసలు మొత్తాన్ని కోల్పోవలసి రావచ్చు. 

పి2పి లెండింగ్ ద్వారా రుణం పొంద‌డం ఎలా?
* ముందుగా విశ్వ‌స‌నీయ పి2పి వెబ్‌సైట్‌లో స‌భ్యునిగా రిజిస్ట‌ర్ చేసుకోవాలి.
* మీరు రిజిస్ట‌ర్ అయిన వెబ్‌సైట్‌ మ‌ధ్య‌వ‌ర్తిగా ప‌నిచేస్తూ మీ త‌ర‌పున అన్ని ఫార్మాలిటీల‌ను పూర్తి చేసి, అస‌ర‌మైన మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న రుణ‌దాత‌తో మిమ్మ‌ల్ని క‌నెక్ట్ చేస్తుంది. 
* రుణం పొందే ముందు, మీ వ్య‌క్తిగ‌త వివ‌రాలు, ఉద్యోగ స్థితి, క్రెడిట్ చ‌రిత్ర వంటివి చెక్‌చేస్తారు. న‌ష్ట‌భ‌యం త‌గ్గించేందుకు విశ్వ‌స‌నీయ రుణ‌గ్ర‌హీత‌ల‌ను ఎంచుకోవ‌డంలో భాగంగా ఈ వివ‌రాలను తెలుసుకుంటారు. కాబ‌ట్టి స‌రైన స‌మాచారాన్ని అందించాలి.
* రుణ‌ ఆమోదం పొందిన తర్వాత, వివిధ ఆప్ష‌న్లు, రిస్క్ క్యాటగిరీలు వ‌స్తాయి. మీకు అవ‌స‌ర‌మైన మొత్తాన్ని ఏ క్యాటగిరీ నుంచి తీసుకోవాలో మీరే నిర్ణ‌యించుకోవ‌చ్చు. 
* అలాగే, మీరు రుణ‌దాత‌గా రుణాలు ఇవ్వ‌చ్చు. ఇక్క‌డ కూడా రిస్క్ క్యాటగిరీలు ఉంటాయి. ఎక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబ‌డి వ‌స్తుంది. ఇలాంటి చోట అస‌లు మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని