Apple: ఐఫోన్ల తయారీకి భారత్‌లో పెగట్రాన్‌ మరో ఫ్యాక్టరీ!

Pegatron to open second factory: భారత్‌లో మరో ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు యాపిల్‌ ఫోన్లను తయారుచేసే సంస్థ పెగట్రాన్‌ కార్పొరేషన్‌ ప్రయత్నిస్తోంది. ఆ కంపెనీకిది భారత్‌లో రెండో ఫ్యాక్టరీ.

Published : 24 Mar 2023 21:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్: యాపిల్‌ ఫోన్లు (Apple) తయారు చేసే కంపెనీలు ఒక్కొక్కటిగా చైనా నుంచి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ సంస్థ భారత్‌లో తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తుండగా.. అదే దేశానికి చెందిన మరో సంస్థ పెగట్రాన్‌ కార్పొరేషన్‌ (Pegatron) సైతం భారత్‌లో తన రెండో ప్లాంట్‌ను తెరవాలని చూస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమ ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలికి తరలించాలన్న యాపిల్‌ భావిస్తున్న వేళ పెగట్రాన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

పెగట్రాన్‌ (Pegatron) 150 మిలియన్‌ డాలర్లతో తమిళనాడులోని చెన్నైకి సమీపంలో తొలి యాపిల్‌ ఫోన్ల (Apple iphones) తయారీ కేంద్రాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో తొలి ప్లాంట్‌ను నెలకొల్పింది. ఇక్కడే మరో ప్లాంట్‌ను నెలకొల్పి కొత్త ఐఫోన్లను అసెంబుల్‌ చేయనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలి ప్లాంట్‌కు దగ్గర్లోనే రెండో ప్లాంట్‌ నెలకొల్పేందుకు చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. అయితే, ఎంత మొత్తంతో చేపట్టేదీ తెలియనప్పటికీ.. మొదటి ఫ్యాక్టరీతో పోలిస్తే కాస్త చిన్న ప్లాంట్‌నే పెగట్రాన్‌ ఏర్పాటు చేయబోతోందని తెలిసింది. దీనిపై పెగట్రాన్‌ గానీ, యాపిల్‌ గానీ స్పందించలేదు.

భారత్‌లో గత కొన్నేళ్లుగా యాపిల్‌ ఉత్పత్తుల తయారీలో వేగం పుంజుకుంది. 2002 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య దాదాపు 9 బిలియన్‌ డాలర్ల స్మార్ట్‌ఫోన్లు మన నుంచి ఎగుమతి అయ్యాయి. మొత్తం ఐఫోన్లలో ఈ వాటా 50 శాతంతో సమానమని ఇండియన్‌ సెల్యులర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. భారత్‌లో యాపిల్‌ చేపడుతున్న తయారీలో 10 శాతం ఫోన్లను పెగట్రాన్‌ ఉత్పత్తి చేస్తోందని రీసెర్చి సంస్థ కౌంటర్‌పాయింట్‌ తెలిపింది. యాపిల్‌తో పాటు విస్ట్రన్‌, ఫాక్స్‌కాన్‌ సంస్థలు దేశంలో ఐఫోన్ల తయారీ చేపడుతున్నాయి. భారత్‌లో ఐప్యాడ్‌ ట్యాబ్లెట్లతో పాటు ఎయిర్‌పాడ్స్‌ను సైతం తయారు చేయాలని యాపిల్‌ భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని