Fixed Deposits: ఎఫ్‌డీ ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌కు జ‌రిమానాలు ఎంత?

Fixed Deposits: అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి వ‌చ్చిన‌పుడు ఎఫ్‌డీల‌ను ముంద‌స్తుగానే ఉప‌సంహ‌రించుకోవచ్చు. అయితే మెచ్యూరిటీ పూర్త‌య్యేలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌ని మూసివేయ‌డం లేదా ముందుగానే ఉప‌సంహ‌రించుకోవ‌డం వంటివి చేసిన‌ప్పుడు బ్యాంకులు పెనాల్టీని వ‌సూలు చేస్తాయి.

Updated : 07 Mar 2022 16:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ఇప్పటికీ క్రేజ్‌ తగ్గలేదు. వ‌డ్డీ రాబ‌డికి చాలా మంది వీటిపైనే ఆధారపడుతున్నారు. ఇందులో వ‌డ్డీ త‌క్కువైనా మూల ధ‌నానికి, వ‌డ్డీకి గ్యారెంటీ హామీ ఉండ‌టం.. డిపాజిట్ల‌కు రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇన్సూరెన్స్ ఉండ‌టం వల్ల చాలా మంది వీటిపై మొగ్గుచూపుతున్నారు.

బ్యాంక్ ఎఫ్‌డీలను 7 రోజుల నుంచి 10 సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధి వ‌ర‌కు ఎంచుకోవచ్చు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి వ‌చ్చిన‌పుడు ఎఫ్‌డీల‌ను ముంద‌స్తుగానే ఉప‌సంహ‌రించుకోవచ్చు. అయితే మెచ్యూరిటీ పూర్త‌య్యేలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌ని మూసివేయ‌డం లేదా ముందుగానే ఉప‌సంహ‌రించుకోవ‌డం వంటివి చేసిన‌ప్పుడు బ్యాంకులు పెనాల్టీని వ‌సూలు చేస్తాయి.

బ్యాంక్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ని తెరిచేట‌ప్పుడు మీరు ఎంచుకోగ‌ల 2 ర‌కాల ఖాతాలు ఉన్నాయి. 1. అకాల ఉప‌సంహ‌ర‌ణ సౌక‌ర్యంతో 2. అకాల ఉసంహ‌ర‌ణ సౌక‌ర్యం లేకుండా. మీరు అకాల ఉప‌సంహ‌ర‌ణ సౌక‌ర్యం లేకుండా ఎంచుకుంటే, అది త‌ప్ప‌నిస‌రి లాక్‌-ఇన్ పీరియ‌డ్‌తో వ‌స్తుంది. ఎవ‌రైనా అకాల ఉప‌సంహ‌ర‌ణతో బ్యాంక్ ఎఫ్‌డీని విత్‌డ్రా చేయ‌గ‌లిగిన‌ప్ప‌టికీ ఆ ఎఫ్‌డీకి అద‌న‌పు పెనాల్టీ ప‌డుతుంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులు మెచ్యూరిటీకి ముందు ఎఫ్‌డీ ఖాతా నుంచి డ‌బ్బుని విత్‌డ్రా చేసుకునే విష‌యంలో వారి సొంత నియమాలు, నిబంధ‌న‌లు క‌లిగి ఉంటాయి.

కాల‌వ్య‌వ‌ధి పూర్త‌య్యేలోపు పిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా మూసివేయ‌డం లేదా ముందుగానే  ఉప‌సంహ‌రించుకోవ‌డం వంటివి జ‌రిగిన‌ప్పుడు బ్యాంకులు పెనాల్టీని వ‌సూలు చేస్తాయి. పెనాల్టీ ఎఫ్‌డీ మొత్తంలో 0.50% నుంచి 1% వ‌ర‌కు ఉంటుంది. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీ నుంచి ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ జ‌రిగితే రూ. 5 కోట్ల కంటే త‌క్కువ డిపాజిట్‌, ఒక సంవ‌త్స‌రం కంటే త‌క్కువ కాల వ్య‌వ‌ధి ఉన్న‌ట్ల‌యితే 0.50% పెనాల్టీ ఉంటుంది. సంవ‌త్స‌రం, అంత‌కంటే ఎక్కువ కాలం ఉన్న‌ట్ల‌యితే జ‌రిమానా 1%  ఉంటుంది. 

ఎస్‌బీఐ బ్యాంక్ ఎఫ్‌డీ అకాల ఉప‌సంహ‌ర‌ణ చేయ‌డానికి సాధార‌ణంగా 5 ల‌క్ష‌ల కంటే త‌క్కువ మొత్తానికి 0.5% జ‌రిమానా విధిస్తారు. అంటే బ్యాంకులో రూ. 3 ల‌క్ష‌ల‌కు ఎఫ్‌డీని క‌లిగి ఉంటే దానిని ముంద‌స్తుగా ఉప‌సంహ‌రించుకుంటే మీరు మీ డిపాజిట్ నుంచి దాదాపు రూ. 1,500 జ‌రిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. రూ. 5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ మొత్తంలో రూ. ఒక కోటి వ‌ర‌కు డిపాజిట్ ఉప‌సంహ‌రిస్తే 1% జ‌రిమానా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ సైతం ముందస్తు విత్‌డ్రాలకు 1 శాతం వరకు పెనాల్టీ వసూలు చేస్తోంది.

పెనాల్టీ అనేది వడ్డీ రేటు రూపంలో విధిస్తారు. మీరు 1 ఏడాదికి డిపాజిట్ చేసినప్పుడు వడ్డీ రేటు 6% అనుకుందాం. ముందస్తు ఉపసంహరణ పెనాల్టీ 1% అనుకుంటే, మీకు 6% బదులు 5% మాత్రమే వడ్డీ అందిస్తారు. చిన్న డిపాజిట్ లో ఇది ఎక్కువగా అనిపించకపోవచ్చు, కానీ పెద్ద మొత్తంలో  డిపాజిట్ చేసినప్పుడు ఇది భారమే.

కొంత‌ కాల‌ప‌రిమితి కోసం కొన్ని బ్యాంకులు నిర్దిష్ట వ‌ర్గాల ఎఫ్‌డీ ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై పెనాల్టీని మాఫీ చేయవచ్చు. అందువ‌ల్ల ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌కు ముందు నిబంధ‌న‌ల గురించి బ్యాంక్‌తో చ‌ర్చించండి. చాలా బ్యాంకుల‌లో ఖాతా తెరిచిన 7 లేదా 14 రోజుల‌లోపు చేసిన విత్‌డ్రాల‌కు ఎటువంటి పెనాల్టీ వేయరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని