Never Give up: గూగుల్‌ పీకేస్తే.. మాజీలతో కలిసి కొత్త కంపెనీ!

Google Layoffs: లేఆఫ్‌ల్లో ఉద్యోగం కోల్పోయిన గూగుల్‌ ఉద్యోగి ఒకరు తనలానే ఉద్యోగం పొగొట్టుకున్నవారితో కలిసి కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. నోటిఫికేషన్‌ పిరియడ్‌ పూర్తయ్యేలోపు కొత్త కంపెనీ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

Published : 22 Feb 2023 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌లో ఉద్యోగం. లక్షల్లో వేతనం. హాయిగా సాగిపోతున్న అతడి జీవితంలో ఒక్కసారిగా భారీ కుదుపు. పరిస్థితుల ప్రభావంతో గూగుల్‌ (Google layoffs) కంపెనీ 12 వేల మందిని తొలగించింది. అందులో అతడూ ఉద్యోగం కోల్పోయాడు. ఉద్యోగం నుంచి తొలగించారని అతడు కుంగిపోలేదు. తనలానే ఉద్యోగం కోల్పోయిన వారితో కలిసాడు. కొత్తగా కంపెనీ ఏర్పాటుకు నిర్ణయించాడు. నోటిఫికేషన్‌ పిరియడ్‌ పూర్తయ్యేలోపు కంపెనీ స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

గూగుల్‌లో దాదాపు 8 ఏళ్ల పాటు సీనియర్‌ మేనేజర్‌ స్థాయిలో పనిచేసి హెన్రీ కిర్క్‌. గూగుల్‌ తాజా లేఆఫ్‌ల్లో ఉద్యోగం కోల్పోయాడు. ప్రస్తుతం నోటీసు పీరియడ్‌లో కొనసాగుతున్నాడు. అయితే, అందరిలా మరో ఉద్యోగం కోసం అన్వేషణ మొదలు పెట్టకుండా కొత్త కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. ఆయన ఆలోచనకు మరో ఆరుగురు గూగుల్‌ మాజీ ఉద్యోగులు తోడయ్యారు. న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో డిజైన్‌, డెవలప్‌మెంట్‌ స్టూడియోను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.

కొత్త కంపెనీ ఏర్పాటు గురించి హెన్రీ ఇటీవల లింక్డిన్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. మార్చిలో తన లేఆఫ్‌ నోటిఫికేషన్‌ పిరియడ్‌ పూర్తి కానుందని అందులో తెలిపాడు. ఇంకా తనకు 52 రోజులు మాత్రమే గడువు ఉందని, ఆలోగా తన బృందంతో కలిసి కొత్త కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు హెన్రీ పేర్కొన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునేందుకు ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. తాము నెలకొల్పబోయే కంపెనీ ద్వారా డిజైన్‌, రీసెర్చ్‌ టూల్స్‌ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం యూజర్ల సపోర్ట్‌ కావాలని కోరాడు. వారం క్రితం హెన్రీ పెట్టిన ఈ పోస్ట్‌కు 15వేలకు పైగా రియాక్షన్స్‌ వచ్చాయి. దాదాపు వెయ్యి కామెంట్లు, 1300 రీపోస్ట్‌లు లభించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని