మోటారు వాహ‌న బీమాకు అత్యుత్తమ యాడ్‌-ఆన్‌లు ఇవే!

ప్ర‌పంచ బ్యాంకు నివేదిక ప్ర‌కారం భార‌త్‌లో ప్ర‌తీ సంవ‌త్స‌రం 4.5 ల‌క్ష‌ల రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి.

Updated : 22 Nov 2021 16:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌యాణాల‌కు మోటారు వాహ‌నాల వాడ‌కం త‌ప్ప‌నిస‌రి అయిన రోజులివి. ర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌తి వాహ‌నానికీ బీమా త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. బీమా లేని మోటారు వాహ‌నాలు రోడ్డుపై తిర‌గ‌డం ర‌వాణా నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. వాహనాలు ప్ర‌మాదానికి గురైనా, దొంగ‌త‌నం జ‌రిగినా, థర్డ్ పార్టీ రిస్క్‌ని క‌వ‌ర్ చేయ‌డానికి బీమా అవసరం. ప్ర‌పంచ బ్యాంకు ఇటీవల వెలువరించిన నివేదిక ప్ర‌కారం భార‌త్‌లో ఏటా 4.5 ల‌క్ష‌ల రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. రోడ్డు ప్రమాదం కారణంగా సంభవిస్తున్న మరణాల విషయంలో దేశం అగ్ర‌స్థానంలో ఉంద‌ని నివేదిక పేర్కొంటోంది. ఈ గణాంకాలు వాహన బీమా అవసరాన్ని తెలియజేస్తున్నాయి. బీమాను ఎంచుకోవ‌డం వ‌ల్ల మీ వాహ‌నాల‌కు ఆర్థిక భ‌ద్ర‌త ల‌భిస్తుంది. వీటికి మీ అవ‌స‌రాల‌కు స‌రిపోయే యాడ్‌-ఆన్‌ల‌ను జ‌త‌చేయ‌డం వ‌ల్ల మ‌రింత క‌వ‌రేజ్ ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు.

దేశంలో మోటారు వాహ‌నాల బీమాను దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వం 2019లో వ్య‌క్తిగ‌త, వాణిజ్య అవ‌స‌రాల‌కు ఉప‌యోగించే అన్ని మోటారు వాహ‌నాల‌కు చెల్లుబాటు అయ్యే థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది. చ‌ట్ట ప్ర‌కారం త‌ప్ప‌నిస‌రి అయిన థ‌ర్డ్ పార్టీ బీమా మీ వాహ‌నం వ‌ల్ల ఇత‌రుల‌కు (థ‌ర్డ్ పార్టీకి) జ‌రిగే న‌ష్టాన్ని క‌వ‌ర్ చేస్తుంది. మీ వ‌ద్ద పాత వాహ‌నం ఉండి, మీరు త‌ర‌చుగా రోడ్ల‌పైకి రాకుంటే థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క‌వ‌ర్ స‌రిపోవ‌చ్చు. దీనికి బీమా ప్రీమియం కూడా త‌క్కువ‌. మీ వాహ‌నం కొత్త‌ది అయ్యుండి క్ర‌మం త‌ప్ప‌కుండా న‌డుపుతున్న‌ట్ల‌యితే కచ్చితంగా స‌మ‌గ్ర బీమా క‌వ‌రేజీని ఎంచుకోవ‌డం మంచిది. ప్ర‌మాదాల కార‌ణంగా సంభ‌వించే ఏదైనా ఆర్థిక నష్టాల నుంచి మీ వాహ‌నానికి రిస్క్ క‌వ‌ర్‌కు స‌మ‌గ్ర బీమా పాల‌సీ హామీ ఇస్తుంది. అంతేకాకుండా యాడ్‌-ఆన్‌ల‌తో కూడిన స‌మ‌గ్ర బీమా పాల‌సీ ప్ర‌మాదాల నుంచే కాకుండా దొంగ‌త‌నం, ప్ర‌కృతి వైప‌రీత్యాలు (వ‌ర‌ద‌లు, అగ్నిప్ర‌మాదం) వంటి ప్ర‌మాదాల నుంచి కూడా ర‌క్ష‌ణ అందిస్తుంది. మీ మోటారు బీమా కోసం ముఖ్య‌మైన యాడ్-ఆన్‌లు ఉన్నాయి. ఇవి నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌పై ఆధార‌ప‌డి అద‌న‌పు ప్రీమియంతో ఉంటాయి. కొన్ని ముఖ్యమైన యాడ్‌ ఆన్‌లు ఈ దిగువన ఉన్నాయి.

జీరో డిప్రిసియేష‌న్ క‌వ‌ర్..
మోటారు వాహ‌నం పాత‌ది అయ్యే కొద్దీ త‌రుగుద‌ల‌కు లోన‌వుతుంది. బీమా పాల‌సీ సాధార‌ణంగా మీ వాహ‌నం త‌ర‌గుద‌ల‌ను క‌వ‌ర్ చేయ‌దు కాబ‌ట్టి సెటిల్‌మెంట్ స‌మ‌యంలో త‌రుగుద‌ల వ్య‌యాన్ని తీసివేసిన త‌ర్వాత క్లెయిమ్ మొత్తం లెక్కిస్తారు. కానీ మీ పాల‌సీకీ ‘జీరో డిప్రిసియేష‌న్‌’ క‌వ‌ర్‌ను జోడించ‌డం వ‌ల్ల త‌రుగుద‌లను కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటుంది. సెటిల్‌మెంట్ స‌మ‌యంలో మీరు క్లెయిమ్ మొత్తాన్ని పూర్తిగా పొందొవ‌చ్చు. ఈ యాడ్‌-ఆన్ సాధార‌ణంగా 5 ఏళ్ల మోడ‌ల్ కార్ల‌కు, 2 సంవ‌త్స‌రాల బైక్‌ల‌కు బీమా కంపెనీలు ఇస్తున్నాయి. కొన్ని బీమా సంస్థ‌లు 7 సంవ‌త్స‌రాల వ‌ర‌కు కూడా జీరో డిప్రెసియేష‌న్ క‌వ‌ర్‌ను అందిస్తున్నాయి.

రిటర్న్ టు ఇన్‌వాయిస్ క‌వ‌ర్: వాహ‌నం షోరూం నుంచి కొనుగోలు చేసి వినియోగంలోకి తీసుకొస్తే .. దాని విలువ త‌గ్గ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. కొద్ది రోజుల‌కే వాహ‌నం విలువ, కొనుగోలు ధ‌ర కంటే త‌క్కువ‌గా ఉంటుంది. పాల‌సీకి `రిటర్న్ టు ఇన్‌వాయిస్ క‌వ‌ర్‌` జోడించ‌డం వ‌ల్ల త‌గ్గిన ధ‌రను కాకుండా వాహనం కొన్నప్పుడు ఉన్న ధరను పాల‌సీ క‌వ‌ర్ చేస్తుంది. ఈ యాడ్ ఆన్ ఉన్న వారు, వాహనం దొంగతనానికి లేదా ఏదైనా ప్రమాదంలో రిపేర్ కాలేని స్థితికి చేరుకున్నప్పుడు, వాహనం కొనుగోలు సమయంలో గల ఇన్వాయిస్ మొత్తాన్ని పొందగలుగుతారు.

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ క‌వ‌ర్: ప్ర‌యాణంలో ఉండ‌గా అక‌స్మాత్తుగా వాహ‌నం పాడైపోతే (బ్రేక్‌డౌన్‌) త‌క్ష‌ణ స‌హాయం అందిస్తుంది ఈ యాడ్-ఆన్‌. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎదురైన‌ప్పుడు కాల్‌చేసి స‌హాయం కోరితే మీరు ఉన్న చోటికే మెకానిక్‌ని పంపే ఏర్పాటు ఉంటుంది.

ఇంజిన్ ప్రొటెక్ష‌న్ క‌వ‌ర్: ఇంజిన్ మీ వాహ‌నానికి గుండె వంటిది. ప్ర‌మాద‌వ‌శాత్తు ఇంజిన్‌కు జ‌రిగే న‌ష్టాలు బీమా ప‌రిధిలోకి రావు. వాహ‌నంలో చ‌మురు చింద‌డం, నీరు చేర‌డం, మెకానిక‌ల్ బ్రేక్‌డౌన్ వంటి వాటికి ‘ఇంజిన్ ప్రొటెక్ష‌న్’ క‌వ‌ర్ యాడ్-ఆన్ ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.

నో క్లెయిమ్ బోన‌స్ ప్రొటెక్షన్ క‌వ‌ర్: ఎటువంటి క్లెయిమ్‌లూ వాహ‌నానికి లేన‌ట్ల‌యితే, బీమా పున‌రుద్ధరణ చేసేటప్పుడు బోన‌స్ వ‌స్తుంది. దీనివల్ల బీమా పున‌రుద్ధరణపై.. ప్రీమియం త‌గ్గింపు ఉంటుంది. అయితే మీరు చిన్న క్లెయిమ్ చేసినా కూడా బోన‌స్ ర‌ద్దు అవుతుంది. అప్పుడు మీరు బీమా పున‌రుద్ధ‌ర‌ణ ప్రీమియాన్ని పూర్తిగా చెల్లించాలి. కానీ నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ క‌వర్ యాడ్‌-ఆన్ మీ పాల‌సీలో ఉంటే మీరు క్లెయిమ్ చేసినా కూడా మీ బోన‌స్ ర‌ద్ద‌వ్వ‌కుండా కాపాడుతుంది.

మోటారు వాహ‌నాల‌ను బీమా చేసేట‌ప్పుడు బీమా సంస్థ‌ల క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్ప‌త్తిని చూడాలి. సాధార‌ణంగా 90% లేదా అంత‌కంటే ఎక్కువ ఉన్న సీఎస్ఆర్‌ (క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్ప‌త్తి) మంచి నిష్ప‌త్తిగా ప‌రిగ‌ణిస్తారు. అటువంటి బీమా సంస్థ‌ల‌నే ఎంపిక చేసుకోవ‌డం మంచిది. మీరు కూడా క్లెయిమ్ ప్రకియ ముందుగానే తెలుసుకుంటే క్లెయిమ్ సమయంలో ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని