వ్య‌క్తిగ‌త ప్ర‌మాదబీమాతో ఆర్థిక ర‌క్ష‌ణ‌

ప్రమాదం జరిగిన తరువాత పాలసీదారు పూర్తిగా లేదా పాక్షికంగా వైక‌ల్యానికి గురైతే పాల‌సీదారునికి ఆర్ధిక సహాయం ల‌భిస్తుంది.

Published : 27 Dec 2020 20:10 IST

మారుతున్న కాలంతో పాటు వ్య‌క్తుల జీవ‌న‌విధానంలో కూడా చాలా మార్పులు సంభ‌వించాయి. వాహ‌న వినియోగం భారీగా పెరిగింది ప్ర‌యాణాలు చేసేవారి సంఖ్య పెర‌గ‌డంతో పాటు ప్ర‌మాదాల బారిన ప‌డేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. వ్య‌క్తులు త‌మ ఆర్ధిక ప్ర‌ణాళిక లో భాగం వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా పాల‌సీ తీసుకోవ‌డం చాలా ముఖ్య‌మ‌ని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత ప్రమాద బీమా ఆర్థిక భ‌విష్య‌త్తు కోసం అవ‌స‌రం మాత్ర‌మే కాదు మ‌న బాధ్య‌తగా భావించాలి. ప్ర‌స్తుతం వివిధ ర‌కాల‌ పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి. పాల‌సీ తీసుకోవ‌డం చాలా సుల‌భం. సంవత్సరానికి రూ. 800 నుంచి రూ. 1,500 ప్రీమియంతో 10 లక్షల బీమా కవర్ను కొనుగోలు చేయవచ్చు. ప్రమాదం కారణంగా మరణం లేదా వైకల్యానికి వ్యక్తిగత ప్రమాదం పథకాలు పాలసీదారుని క‌వ‌రేజిని అందిస్తాయి. దీంతో పాటు అద‌న‌పు భ‌ద్ర‌త కోసం మ‌రిన్ని రైడ‌ర్ల‌ను కొనుగోలు చేసుకోవ‌చ్చు. ప్రమాదం వలన కోల్పోయే ఆదాయం, కుటుంబ స‌భ్యుల‌ను బీమా ప‌రిధిలోకి తీసుకువ‌చ్చేందుకు ఎంపిక కూడా ఉంటుంది. ప్ర‌మాదం కార‌ణంగా అయ్యే కింది న‌ష్టాల‌కు బీమా పాల‌సీ ద్వారా ఖ‌ర్చుల‌ను పాల‌సీదారులు భ‌ర్తీ చేసుకోవ‌చ్చు.

వైకల్యం: ప్రమాదం జరిగిన తరువాత పాలసీదారు పూర్తిగా లేదా పాక్షికంగా వైక‌ల్యానికి గురైతే పాల‌సీదారునికి ఆర్ధిక సహాయం ల‌భిస్తుంది. ప్రమాదంలో పాలసీదారుడు మరణించినట్ల‌యితే నామినీకి పరిహారం అందిస్తారు.

అత్యవసర ప్రమాదం వైద్య ఖర్చు: ప్రమాదంలో గాయ‌ప‌డిన పాల‌సీదారునికి వెంటనే అయ్యే ఖ‌ర్చు పొంద‌వ‌చ్చు. వైద్య సంరక్షణకు అయ్యే ఆసుపత్రి బిల్లులకు బీమా వ‌ర్తిస్తుంది. వైద్య చికిత్సకు ఆసుప‌త్రికి వ‌చ్చే ముందు అయ్యే ఖ‌ర్చుల‌ను, అంబులెన్స్ ఛార్జీలు వంటివి పొంద‌వ‌చ్చు.

ఆదాయం నష్ట పరిహారం: పాలసీదారుడు కంటిచూపు లేదా వినికిడి వంటి వైకల్యంతో బాధపడుతుంటే, పాలసీ అత‌నికి అయ్యే ఆదాయం నష్టం భర్తీ చేస్తుంది. ఒక వ్యక్తి తాత్కాలిక లేదా మొత్తం వైకల్యం కలిగి ఉంటే, బీమా సంస్థ వారంవారీ ప్రయోజనాన్నికూడా అందిస్తుంది.

పిల్లల విద్య ప్రయోజనాలు: వ్యక్తిగత ప్రమాద బీమా పాల‌సీదారుడు త‌మ పిల్లల విద్య‌కు అయ్యే ఖర్చులను భ‌ర్తీ చేస్తుంది. బీమా హామీ మొత్తానికి 10% లేదా విద్యాసంస్థ ట్యూషన్ ఫీజు, ఏది తక్కువగా ఉన్నట్లయితే అది చెల్లిస్తుంది. పాల‌సీదారుడికి జ‌రిగిన ప్ర‌మాదం వ‌ల్ల పిల్లల విద్యపై ప్ర‌భావం ప‌డ‌కుండా పాల‌సీ స‌హ‌క‌రిస్తుంది.

మార్పుల‌కు: ప్రమాదం కారణంగా, పాలసీదారుడు చక్రాల కుర్చీ ఉప‌యోగించాల్సి వ‌స్తే, వాటికి సంబంధించి ఇంటికి నిర్మాణపరమైన సర్దుబాట్లు అవసరమైతే తన ఇల్లు, వాహనంలో అలాంటి అవసరమైన మార్పులు చేసేందుకు అయ్యే ఖ‌ర్చు భర్తీ చేస్తుంది.

రవాణా ఛార్జీలు: ఒక వేళ ప్ర‌మాదానికి గురైన పాల‌సీదారుడు తన ఇంటికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రిలో చేరాల్సి వ‌స్తే, కుటుంబ సభ్యుల‌కు ఆసుపత్రి చేరుకోవడానికి అయ్యే రవాణా ఖర్చుల‌ను భ‌ర్తీచేస్తారు.

వ్యక్తిగత ప్రమాద బీమా పాల‌సీని తీసుకోవడానికి ముందు పాల‌సీదారులు, 15 రోజుల ఫ్రీలుక్ పీరియ‌డ్, 30 రోజుల గ్రేస్ పిరియ‌డ్ వంటి పాలసీ మినహాయింపులు వంటి నిబంధ‌న‌ల‌ను తెలుసుకోవాలి. మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ల చ‌రిత్ర ఉన్న బీమా సంస్థ నుంచి పాలసీని తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని