Loans: గృహ, వాహన, వ్యక్తిగత రుణాల్లో ఏది ముందు తీర్చాలి?

గృహ రుణం దీర్ఘకాలిక రుణం. ఇది ఆస్తి సమకూర్చుకోవడంలో సహాయపడడంతో పాటు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.

Updated : 21 Nov 2022 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ రోజుల్లో బ్యాంకులు విరివిగానే రుణాలు అందిస్తున్నాయి. ఒక వ్యక్తికి ఇప్పటికే రుణం ఉన్నప్పటికీ, మరో రుణం కూడా బ్యాంకులు అందిస్తున్నాయి. దీంతో ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువగా కూడా రుణాలు ఉన్నవారు చాలామందే ఉంటున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి గృహ రుణం ఉన్నప్పటికీ, కారు రుణం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు అత్యవసర పరిస్థితుల కారణంగా వ్యక్తిగత రుణం తీసుకొని ఉండొచ్చు.  రుణాలు ఎక్కువగా ఉంటే ఈఎంఐ భారం పెరుగుతుంది. ఒక్కో నెల ఈఎంఐ సమయానికి చెల్లించలేని పరిస్థితులు రావచ్చు. ఇలాంటి పరిస్థితులు రాకుండా రుణ భారాన్ని తగ్గించుకోవాలంటే ఒక పద్ధతి ప్రకారం రుణాలను చెల్లించడం మంచిది. మరి ఈ రుణాల్లో ముందుగా దేన్ని చెల్లించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

వడ్డీ రేటును చూడండి..

ఒకటి కంటే ఎక్కువ రుణాలు ఉన్నవారు ఏ రుణాలకు ఎక్కువ వడ్డీ రేటు చెల్లిస్తున్నారో చూడండి. ఎక్కువ వడ్డీ రేటు ఉన్న రుణాలను ముందుగా చెల్లించడం మంచిది. సాధారణంగా గృహ, వాహనం వంటి సురక్షిత రుణాల కంటే వ్యక్తిగత, క్రెడిట్ వంటి అసురక్షిత రుణాల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందుగా వీటిని చెల్లించే ప్రయత్నం చేయండి. 

పన్ను ప్రయోజనాలు..

వ్యక్తిగత, వాహన రుణాల చెల్లింపులకు ఎలాంటి పన్ను ప్రయోజనమూ ఉండదు. కానీ, గృహ రుణంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సి కింద గృహ రుణ అసలు చెల్లింపులపై రూ.1.50 లక్షలు, వడ్డీ చెల్లింపులపై సెక్షన్‌ 24బి కింద రూ.2 లక్షలు.. మొత్తంగా గృహ రుణ చెల్లింపులపై ఒక ఏడాదికి గరిష్ఠంగా రూ.3.50 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇలా దీర్ఘకాలంలో ఎంతో పన్ను ఆదా చేసుకోవచ్చు.

గృహ రుణం, కారు రుణం ఉంటే..

గృహ రుణం, కారు రుణం రెండూ ఉన్నప్పుడు ముందుగా కారు రుణం తీర్చేయడం మంచిది. ఎందుకంటే, కారు తరుగుదల ఆస్తి. సమయం గడిచే కొద్దీ దాని విలువ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల ఎంత త్వరగా రుణాన్ని చెల్లిస్తే అంత మంచిది. అలాగే గృహ రుణంతో పోలిస్తే, కారు రుణాల వడ్డీ రేటు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు గృహ రుణం దీర్ఘకాలిక రుణం. ఇది ఆస్తి సమకూర్చుకోవడంలో మీకు సాయపడుతుంది. కాబట్టి, ఈ రుణాన్ని తీర్చేందుకు కొంత సమయం తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ మీరు తీర్చలేకపోతే వారసులకైనా అప్పగించవచ్చు.

ఒకే రుణం ఉండాలనుకంటే..

ఇప్పటికే గృహ రుణం ఉన్నవారికి, వ్యక్తిగత, వాహన రుణాలు కూడా ఉంటే వ్యక్తిగత, వాహన రుణాలను తీర్చేందుకు గృహ రుణంపై టాప్-అప్‌ రుణాన్ని తీసుకోవచ్చు. టాప్-అప్‌ లోన్‌ అనేది గృహ రుణం ఉన్నవారికి మాత్రమే ఇస్తారు. వడ్డీ ఇంతకు ముందు తీసుకున్న గృహ రుణ వడ్డీకి సమానంగా గానీ, కాస్త ఎక్కువగా గానీ ఉంటుంది. కానీ, వ్యక్తిగత రుణ వడ్డీతో పోలిస్తే తక్కువే ఉంటుంది. ఎంత రుణం ఇస్తారు అనేది.. ఆయా వ్యక్తుల రుణ అర్హత, ఆస్తి విలువను అనుసరించి ఉంటుంది. టాప్‌-అప్‌లోన్‌ కాలపరిమితి సాధారణంగా 20 ఏళ్లు ఉంటుంది. లేదా ఒరిజినల్‌ లోన్‌ కాలపరిమితికి సమానంగా ఉంటుంది.

చివరిగా..

పైన తెలిపిన విషయాలను దృష్టిలో పెట్టుకుని గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు ఉన్నవారు ముందుగా వ్యక్తిగత రుణం, ఆ తర్వాత వాహన రుణం, అటు తర్వాత గృహ రుణంపై దృష్టి సారించడం మంచిది. ఇక్కడ గృహ రుణం చెల్లింపులను పూర్తిగా నిలిపి వేయమని కాదు. వ్యక్తిగత రుణం, వాహనం రుణం తీరేవరకు నెలవారీ ఈఎంఐ చెల్లింపుల్లో ఎక్కువ భాగం ఈ రుణాలకు కేటాయించడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని