Published : 20 May 2022 15:10 IST

Personal Loan: వ్యక్తిగత రుణం తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి!

ఉద్యోగం చేస్తూ స్థిర‌ ఆదాయం పొందుతున్న వ్య‌క్తుల త‌క్ష‌ణ డ‌బ్బు అవ‌స‌రాల‌కు వ్య‌క్తిగ‌త రుణాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకులు ఈ రుణాల‌ను అందిస్తాయి. కాబ‌ట్టి ఇవి అసుర‌క్షిత రుణం కింద‌కి వ‌స్తాయి. బ్యాంకులకు న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల వ‌డ్డీ రేటు కూడా కొంచెం ఎక్కువ‌గానే ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ఆర్థిక ఒత్తిడి, అవ‌స‌రంలో ఉన్నప్పుడు సుల‌భంగా రుణం ల‌భించ‌డంతో పాటు ఈఎమ్ఐల రూపంలో నెల‌వారిగే చెల్లించే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి ఆర్థిక అత్య‌వ‌స‌రాల‌కు ఈ రుణాన్ని తీసుకోవ‌చ్చు. అయితే వ్యక్తిగత రుణం తీసుకునేముందు బ్యాంకు నియమ, నిబంధనలు, వడ్డీ రేట్లు, కాల పరిమితి, ఆలస్య రుసుము వంటివి తెలుసుకోవాలి. వ్యక్తిగత రుణం పొందేందుకు కావలసిన అర్హతలు కూడా తెలుసుకుంటే సులభంగా రుణం లభించే అవకాశముంది.

క్రెడిట్ స్కోర్..
మ‌నం ముందుగానే చెప్పుకున్న‌ట్లు బ్యాంకులు ఎటువంటి పూచీక‌త్తు లేకుండా ఈ రుణాల‌ను అందిస్తాయి కాబ‌ట్టి న‌ష్ట‌భ‌యం ఉంటుంది. అందువ‌ల్ల మంచి రుణ చ‌రిత్ర ఉన్న వారికే బ్యాంకులు ఈ రుణాల‌ను మంజూరు చేస్తుంటాయి. ఇంద‌కోసం ముందుగా ద‌ర‌ఖాస్తు దారుని క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తాయి. తిరిగి చెల్లించేందుకు ఉన్నస్థోమత, ఆదాయం, మూలాలను అంచనా వేస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగాలేకపోతే అప్లికేషన్ తిరస్కరించే అవకాశం ఉంది. అందువ‌ల్ల రుణం కోసం దాఖలు చేసుకునే వారు ముందుగా క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోవడం మంచిది. 

వడ్డీ రేట్లు, కాలపరిమితి..
వ్యక్తిగత రుణానికి వడ్డీ రేట్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చాలావరకు వ్యక్తిగత రుణాలకు ఎలాంటి హామీ ఉండదు. భద్రత తక్కువ ఉంటుంది. బ్యాంకులు సగటుగా 11 శాతం నుంచి 16 శాతం వడ్డీరేట్లు వసూలు చేస్తాయి. ఇతర ఆర్థిక సంస్థలు దీనికంటే ఎక్కువ రేట్లు విధిస్తాయి. వడ్డీ రేట్లు, కాల పరిమితిని బట్టి, నెలవారి వాయిదా (ఈఎమ్ఐ) ఉంటుంది. కాలపరిమితి ఎక్కువగా ఉంటే ఈఎంఐ తక్కువగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముంటుంది.

ప్రాసెసింగ్ ఫీజులు..
ప్రాసెసింగ్ ఫీజులు గురించి ఎవరూ పట్టించుకోరు. కానీ ఇవి రుణ పరిమాణంపై ఆధారపడి ఉంటాయి. జీఎస్టీ, వన్-టైమ్ ఫీజు వంటివి ఇందులోకి వస్తాయి. ఇవి అన్ని బ్యాంకుల‌కు ఒకేలా ఉండ‌దు. బ్యాంకును బ‌ట్టి మారుతూ ఉంటుంది. 

ఆలస్య రుసుములు..
ఈఎమ్ఐ చెల్లించడం ఆలస్యమైతే లేదా మరిచిపోతే బ్యాంకులు ఎక్కువ రుసుములు విధిస్తాయి. ఖాతాలో సరిపోయినంత నగదు లేక నగదు ఎలక్ర్టానిక్ క్లియరింగ్ సర్వీస్ (ఈసీఎస్) తిరస్కరించినా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు చాలా అధిక మొత్తంలో ఛార్జీలను వసూలు చేస్తాయి. ఇది ఒక్కోసారి ఈఎమ్ఐలో 5 శాతం నుంచి 10 శాతం వరకు కూడా ఉండే అవకాశముంది.

ప్రీ-పేమెంట్ ఛార్జీలు..
ఎక్కువమంది అత్యవసర సమయంలో వ్యక్తిగత రుణాలను తీసుకుంటారు. నగదు చేతికందిన‌ వెంటనే తిరిగి చెల్లిస్తారు. అందుకే గడువు ముగింపుకంటే ముందే ఖాతాను మూసివేస్తే ఛార్జీలు పడతాయా, అవి ఎంతమేరకు ఉంటాయో తెలుసుకోవడం మంచిది. కొన్ని బ్యాంకులు దీనికి ఛార్జీలు వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు ఎలాంటీ ఫీజులు విధించవు. అయితే గడువు కంటే ముందే ఖాతా ముగిస్తే అధిక వడ్డీ రేట్లు వ‌సూలు చేసే అవ‌కాశం ఉంది. 

చివ‌రిగా..
వ్య‌క్తిగ‌త రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసేముందే.. మీకు రుణం ల‌భించే అవ‌కాశం ఎంత‌వ‌ర‌కు ఉందో తెలుసుకోవాలి. రుణం జారీ చేసేందుకు ఒక్కో బ్యాంకు ఒక్కో అంశాన్ని ప‌రిశీలిస్తాయి. అందుకే అయా బ్యాంకుల ప‌రామితులను  ముఖ్యంగా క్రెడిట్ స్కోర్‌ తెలుసుకొన్న‌ త‌ర్వాత రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డం మంచిది. ఎందుకంటే బ్యాంకులు రుణ ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రిస్తే ఆ ప్ర‌భావం క్రెడిట్ స్కోర్ పై ప‌డుతుంది. అందుకే ముందుగానే క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకొని మెరుగుప‌ర్చుకోవ‌డం ద్వారా సుల‌భంగా రుణం పొందొచ్చు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని