అవసరానికి ఆసరా వ్యక్తిగత రుణం!

చాలా సులువుగా తీసుకోగలిగే రుణాల్లో వ్యక్తిగత రుణం ఒకటి. దీన్ని తీసుకునేటప్పుడు రుణం అందించే సంస్థ నుంచి ఎక్కువగా ఇబ్బందులు ఎదురుకావు. మిగిలిన రుణాలతో పోలిస్తే సమర్పించాల్సిన పత్రాలు కూడా తక్కువగా ఉంటాయి. ఎటువంటి హామీ సమర్పించాల్సిన

Published : 15 Dec 2020 22:00 IST

చాలా సులువుగా తీసుకోగలిగే రుణాల్లో వ్యక్తిగత రుణం ఒకటి. దీన్ని తీసుకునేటప్పుడు రుణం అందించే సంస్థ నుంచి ఎక్కువగా ఇబ్బందులు ఎదురుకావు. మిగిలిన రుణాలతో పోలిస్తే సమర్పించాల్సిన పత్రాలు కూడా తక్కువగా ఉంటాయి. ఎటువంటి హామీ సమర్పించాల్సిన అవసరం ఉండదు కాబట్టి వడ్డీరేట్లు అధికంగా ఉంటాయి.

అర్హత :
* వ్యక్తిగత రుణం సాధారణంగా వేతన ఉద్యోగులు, వృత్తి నిపుణులు, స్వయం ఉపాధి కలిగిన వారికి ఇస్తారు.
* రుణ గ్రహీత ఆదాయం, రుణ చరిత్ర, ఇప్పటికే చెల్లిస్తున్న రుణాలు, ప్రస్తుత ఆర్థిక స్థితి ఆధారంగా రుణం పొందే అర్హతను నిర్ణయిస్తారు .
* వేతన ఉద్యోగులైతే వారి వయసు, రాబడి, పనిచేసే సంస్థను బట్టి నిర్ణయిస్తారు.
* అదే స్వయం ఉపాధి కలిగిన వారికైతే ఆదాయపు పన్నువివరాలను పరిశీలించి రుణ అర్హతను నిర్ణయిస్తారు.
* భార్య, భర్తలు కలిసి ఉమ్మడిగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
* ఇద్దరి ఆదాయం జత అవ్వడం వల్ల ఎక్కువ మొత్తం రుణంగా పొందవచ్చు.
రుణ పరిమితి :
* సాధారణంగా నెలసరి రాబడికి 40 నుంచి 50% వరకూ రుణం ఇస్తారు.
* రూ. పది వేల మొదలుకుని తిరిగి చెల్లించగల సామార్ధ్యాన్ని బట్టి గరిష్ట మొత్తాన్ని నిర్ణయిస్తారు.
బ్యాంకులు సాధారణంగా 48నుంచి 72 గంటల్లోపే వ్యక్తిగత రుణాన్ని మంజూరు చేస్తాయి. దానికి అనుగుణంగా అన్ని పత్రాలను సిద్ధం చేసి ఉంచుకోవాలి. తద్వారా పత్రాల పరిశీలన ఆలస్యం జరుగదు.

అవసరమయ్యే పత్రాలు:
* వ్యక్తిగత గుర్తింపు పత్రం
* చివరి 6నెలల బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు
* చిరునామా గుర్తింపు పత్రం
* శాలరీ స్లిప్‌/సర్టిఫికేట్‌
* మధ్యవర్తి, అతని పత్రాలు
* స్వయం ఉపాధి కలిగినవారి సంస్థ ఆర్ధిక నివేదికలు.
సిబిల్‌ క్రెడిట్‌ స్కోర్‌ - వ్యక్తిగత రుణం:
ఆర్థిక సంస్థలు రుణం మంజూరు చేసే సమయంలో సిబిల్‌ నుంచి వ్యక్తి రుణ చరిత్ర నివేదికను పరిశీలిస్తాయి. ఈ సమయంలో చెల్లించని రుణాలు, క్రెడిట్‌ కార్డుకు సంబంధించి బకాయిలు ఉంటే రుణ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది.

వడ్డీ రేట్లు
ఇతర రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణం పొందే విధానం సులభమైనప్పటికీ వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. సాధారణంగా వ్యక్తిగత రుణాలపై స్థిర, మారుతూ ఉండే రెండు రకాల వడ్డీ రేట్లు కలిగిన రుణాలు ఉంటాయి. ప్రస్తుతం రేట్లు 12 నుంచి 20 శాతం వరకు ఉన్నాయి. మీ క్రెడిట్ స్కోర్, కంపెనీ, జీతం, ఇలా చాలా విషయాలని బట్టి కూడా రేట్లు మారుతాయి.
వివిధ రుసుములు:
వ్యక్తిగత రుణాన్ని పొందేముందు వడ్డీతో పాటు విధించే వివిధ రుసుములను తెలుసుకోవాలి. ప్రాసెసింగ్‌ రుసుము, ముందస్తు చెల్లింపు రుసుము, ఆలస్య చెల్లింపు రుసుము, సేవా రుసుములు వంటివి బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. వీలైతే ప్రాసెసింగ్‌ రుసుము, ముందస్తు చెల్లింపు రుసుములు లేని వాటిని ఎంపిక చేసుకోవాలి. ఒక్కోసారి వడ్డీ తక్కువైనా వీటన్నింటిని కలుపుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ఎక్కువయ్యే అవకాశం ఉంది. అన్నింటినీ సరిపోల్చుకుని ఉత్తమమైన దానిని ఎంచుకోవాలి.

రుణ చెల్లింపు:
వ్యక్తిగత రుణాలను 12 నుంచి 60 నెలల వరకూ చెల్లించవచ్చు. సాధ్యమైనంత వరకూ తక్కువ కాల పరిమితి ఉన్న వాటిని ఎంచుకోవాలి. లేకపోతే అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
జాగ్రత్తలు:
* వ్యక్తిగత రుణాలు అధిక వడ్డీ చెల్లింపుతో కూడుకుని ఉంటాయి. అత్యవసరాల్లో సులభంగా లభించినా ఇవి కాస్త ఆర్థిక భారం కలిగించేవిగా ఉంటాయి. సాధ్యమైనంత వరకూ వ్యక్తిగత రుణాలను తీసుకోకపోవడమే మంచిది.
* వడ్డీ రేట్ల కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులను సంప్రదించాలి.
* వ్యక్తిగత అవసరాలను, ఆర్థిక స్థితిని, తిరిగి చెల్లించగల స్థోమతను బట్టి మనకు అనుగుణంగా ఉన్నదాన్ని ఎంచుకోవాలి.
* తీసుకున్న రుణాన్నితక్కువ కాలంలోనే తిరిగి చెల్లించేందుకు ప్రయత్నించాలి. తద్వారా అధిక వడ్డీ రేట్లను తప్పించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని