Petrol Price Hike: లీటరు పెట్రోల్‌పై రూ.15 పెంపు?

ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా, పెట్రోలు, డీజిల్‌ ధరలను ఈవారంలోనే చమురు విక్రయ కంపెనీలు పెంచే అవకాశం ఉంది....

Updated : 08 Mar 2022 11:33 IST

మార్కెట్‌ విశ్లేషకుల అంచనా..

దిల్లీ: ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా, పెట్రోలు, డీజిల్‌ ధరలను ఈవారంలోనే చమురు విక్రయ కంపెనీలు పెంచే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో 4 నెలలుగా పెట్రో రిటైల్‌ ధరలను దేశీయంగా సవరించలేదు. ఇప్పటివరకు ఏర్పడిన నష్టాలను భర్తీ చేసుకోవాలంటే పెంపు తప్పదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

  1. రూ.15 పెంపు: చివరిసారి రిటైల్‌ ధరల్ని సవరించిన నవంబరు 4, 2021న అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 81.5 డాలర్లుగా ఉంది. మార్చి 1 నాటికి సగటున భారత్‌ 111 డాలర్లు చెల్లించి బ్యారెల్‌ చమురు కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు ధరలు మరింత భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ వ్యయం ఇంకా పెరిగి ఉంటుంది. మరి ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే రిటైల్‌ ధరల్ని భారీ ఎత్తున పెంచక తప్పదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.15 వరకు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఒకేసారి ఈ భారాన్ని ప్రజలపై మోపకపోవచ్చునంటున్నారు. రోజుకు 50పైసల చొప్పున పెంచే అవకాశం ఉందని తెలిపారు.
  2. బ్యారెల్‌ ధర 125 డాలర్లు: సోమవారం 139.14 డాలర్లను తాకిన బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర ప్రస్తుతం 125 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా క్రూడ్‌ (డబ్ల్యూటీఐ) బ్యారెల్‌ ధర కూడా 6 డాలర్లు పెరిగి 121.60 డాలర్ల వద్ద చలిస్తోంది. చమురు ధరలు ఎగబాకుతున్న కొద్దీ ఇతర కమొడిటీ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు రూపాయి పతనానికి దారితీస్తున్నాయి. నిన్న డాలరుతో పోలిస్తే 77.44 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని తాకిన రూపాయి విలువ ప్రస్తుతం 76.76 వద్ద ట్రేడవుతోంది.
  3. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం: భారత చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో చమురు ధరల పెరుగుదలతో ఆసియాలో అత్యంత భారీ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న దేశంగా భారత్‌ నిలుస్తోంది. చమురు ధరల పెరుగుదుల, రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. ద్రవ్యోల్బణ భయాలకు తోడు వృద్ధి మందగమనం పాలవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఒక్కో బ్యారెల్ చమురుకు 10 డాలర్లు పెరిగిన కొద్దీ దేశ ప్రస్తుత ఖాతా లోటు 14-15 బిలియన్‌ డాలర్లు మేర పెరుగుతుందని నిపుణులు చెప్పారు.
  4. రష్యాపై ఆంక్షలే కారణం: రష్యా నుంచి చమురు దిగుమతులపై కూడా అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించాలని యోచిస్తున్నాయి. అందువల్లే సోమవారం చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్‌ నుంచి ముడి చమురు ఎగుమతుల పునరుద్ధరణ ఆలస్యం కావొచ్చన్న అంచనాలు సైతం ధర భారీగా పెరిగేందుకు దోహదం చేసింది. ప్రస్తుతం భారత మార్కెట్‌కు సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, ధరలే కలవరపెడుతున్నాయి.
  5. ఐరోపా అవసరాలకు రష్యానే కీలకం: ఐరోపా దేశాల సహజవాయు అవసరాల్లో మూడో వంతు రష్యానే తీరుస్తోంది. రష్యా నుంచి ఐరోపాకు వెళ్లే గ్యాస్‌ పైప్‌లైన్లు మూడో వంతు ఉక్రెయిన్‌ గుండానే వెళుతున్నాయి. ఇక ప్రపంచ చమురు ఉత్పత్తిలో 10 శాతం వాటా రష్యాదే.
  6. దిల్లీలో రేట్లు ఇలా: ప్రస్తుతం దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.41గా ఉంది. డీజిల్‌ ధర రూ.86.67గా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం, దిల్లీ ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించిన తర్వాత ధరలు ఈ స్థాయికి చేరాయి. అంతకు ముందు లీటర్‌ పెట్రోల్‌ రూ.110.04, డీజిల్‌ రూ.98.42 వద్ద గరిష్ఠానికి చేరాయి.
  7. అలా అయితే, 300 డాలర్లు: ఒకవేళ తమ దేశ చమురు దిగుమతులపై రష్యా ఆంక్షలు విధిస్తే తీవ్ర పరిణామాలుంటాయని రష్యా ప్రపంచ దేశాలను హెచ్చరించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ధర 300 డాలర్లకు చేరుతుందని పేర్కొంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ఐరోపాకు కనీసం 1 సంవత్సరం పడుతుందని గుర్తుచేసింది. రష్యా చమురుపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న హెచ్చరికల మధ్య రష్యా ప్రధాని నొవాక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని