Petrol Diesel Prices: పండగరోజూ వదల్లేదు.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు!

శుక్రవారం లీటర్‌ పెట్రోల్ 35 పైసలు‌, డీజిల్‌పై 36 పైసల చొప్పున పెరిగాయి...

Updated : 17 Oct 2022 14:34 IST

దిల్లీ: పండుగ రోజూ సామాన్యుడిపై పెట్రో బాదుడు ఆగలేదు.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఇప్పటికే నూనెలు, వంటగ్యాస్‌ సహా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చమురు ధరల పెంపు నుంచి కనీసం పండగరోజైనా ఉపశమనం లభిస్తుందని ఆశించిన సామాన్యులకు నిరాశే మిగిలింది. గత మూడు వారాల్లో డీజిల్‌ ధరలు 17 సార్లు పెరగ్గా.. పెట్రోల్‌ ధరలు 14 సార్లు ఎగబాకాయి. తాజాగా శుక్రవారం లీటర్‌ పెట్రోల్ 35 పైసలు‌, డీజిల్‌పై 36 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.14కు, ముంబయిలో రూ.111.09కు చేరుకుంది. లీటర్‌ డీజిల్‌ ధర ముంబయిలో రూ.101.78ను, దిల్లీలో రూ.93.87ను తాకింది. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.04, డీజిల్‌ రూ.104.44కి చేరింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 84.64 డాలర్లకు చేరుకుంది. ఈ స్థాయికి చేరడం గత ఏడేళ్లలో ఇదే తొలిసారి.  దేశవ్యాప్తంగా పెట్రోల్‌ ధరలు రూ.110 దిశగా వెళుతుంటే.. డీజిల్‌ ధరలు ఇప్పటికే రూ.100 మార్క్‌ను దాటేశాయి.

ప్రధాన నగరాల్లో లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు ఇలా..

నగరం           పెట్రోల్‌(రూ.లలో)        డీజిల్‌(రూ.లలో)

హైదరాబాద్‌           109.37                 102.42

గుంటూరు            112.04                 104.44

విజయవాడ           112.04                 103.88

విశాఖపట్నం          110.99                 103.43

దిల్లీ                  105.14                 93.87

ముంబయి            111.09                 101.78

చెన్నై                 102.50                  98.36

బెంగళూరు            108.80                 99.63

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని