Petrol Sales: మే నెలలో ఊపందుకున్న పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు

మే నెలల్లో ఇంధన విక్రయాలు మళ్లీ పుంజుకున్నాయి....

Published : 16 May 2022 15:07 IST

దిల్లీ: మే నెలల్లో ఇంధన విక్రయాలు మళ్లీ పుంజుకున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడంతో పాటు పంటకోతల సీజన్‌ ప్రారంభం కావడం అందుకు దోహదం చేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

ఏప్రిల్‌తో పోలిస్తే పెట్రోల్‌ విక్రయాలు మే ప్రథమార్ధంలో 14 శాతం పెరిగాయి. డీజిల్‌ డిమాండ్‌ 1.8 శాతం పెరిగింది. అధిక ధరల వల్ల గత నెలలో పడిపోయిన వంటగ్యాస్‌ విక్రయాలు మే 1-15 మధ్య 2.8 శాతం పెరిగాయి. ఈ సమయంలో ప్రభుత్వరంగ రిటైల్ విక్రయ కేంద్రాల్లో 1.28 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ అమ్ముడైంది. క్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 59.7 శాతం అధికం. ఏప్రిల్‌ 2022 ప్రథమార్ధంలో 1.12 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ విక్రయమైంది. 

దేశంలో అత్యధికంగా వినియోగించే డీజిల్‌ విక్రయాలు క్రితం ఏడాదితో పోలిస్తే మే తొలి 15 రోజుల్లో 37.8 శాతం పెరిగి 3.05 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. గత నెల ఇదే సమయంలో అమ్ముడైన 2.99 మిలియన్‌ టన్నుల కంటే ఇది 1.8 శాతం అధికం. క్రితం నెల ధరలు ఒక్కసారిగా పెరగడంతో విక్రయాలు నెమ్మదించాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కొత్త ధరలకు అలవాటుపడిన ప్రజలు తిరిగి కొనడం ప్రారంభించారని పేర్కొన్నాయి. పంటకోత సీజన్‌ ప్రారంభం కావడం కూడా డీజిల్‌ విక్రయాల పెరుగుదలకు దోహదం చేశాయని వివరించాయి. 

మరోవైపు మార్చి, మే నెలలో వంటగ్యాస్‌ ధర రూ.50 చొప్పున పెరిగిన విషయం తెలిసిందే. ధరలు భారీగా పెరగడంతో ఏప్రిల్‌లో పడిపోయిన విక్రయాలు మే తొలి 15 రోజుల్లో 2.8 శాతం పుంజుకొని 1.02 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. క్రితం ఏడాదితో పోలిస్తే మాత్రం విక్రయాలు 5.4 శాతం పడిపోయాయి. విమాన ఇంధన ఏటీఎఫ్‌ విక్రయాలు ఏప్రిల్‌తో పోలిస్తే 7.7 శాతం, క్రితం ఏడాది కంటే 83.5 శాతం పుంజుకున్నాయి. కానీ, కొవిడ్‌ మునుపటి 2019తో పోలిస్తే మాత్రం ఏటీఎఫ్‌ విక్రయాలు ఇంకా 18.7 శాతం పుంజుకోవాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని