పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల్లో రెండకెల వృద్ధి.. విద్యుత్‌ వినియోగంలోనూ తగ్గేదేలే!

Petrol, diesel sales: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల జోరు కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో వీటి విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది.

Published : 01 Dec 2022 20:53 IST

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల (Petrol, diesel sales) జోరు కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో వీటి విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. పండగలు, వ్యవసాయ రంగం నుంచి ఉన్న డిమాండే దీనికి కారణమని పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి.

  • దేశంలో నవంబర్‌లో పెట్రోల్‌ విక్రయాలు 11.7 శాతం పెరిగి 2.66 మిలియన్‌ టన్నులకు చేరింది. గతేడాది ఇదే సమయంలో విక్రయాలు 2.38 మిలియన్‌ టన్నులుగా ఉంది. కొవిడ్‌ విజృంభించిన 2020 నవంబర్‌ కంటే 10.7 శాతం; కొవిడ్‌ మునుపటి సంవత్సరం (2019)తో పోలిస్తే 16.2 శాతం విక్రయాలు పెరిగాయి.
  • దేశంలో డీజిల్‌ విక్రయాలు సైతం భారీగా జరిగాయి. గతేడాది నవంబర్‌ కంటే 27.6 శాతం మేర విక్రయాలు పెరిగి 7.32 మిలియన్‌ టన్నులకు చేరింది. 2020తో పోలిస్తే 17.4 శాతం, కొవిడ్‌ మునుపటి ఏడాదితో పోలిస్తే 17.1 శాతం చొప్పున విక్రయాలు పెరగడం గమనార్హం. వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కావడంతో ఇరిగేషన్‌ పంపులకు పెద్దమొత్తంలో డీజిల్‌ వినియోగించడమే ఈ పెరుగుదలకు కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
  • ఇక విమానాల్లో వినియోగించే జెట్‌ ఫ్యూయల్‌ (ATF) వినియోగం సైతం నవంబర్‌లో 21.5 శాతం వృద్ధితో 5,72,200 టన్నులకు చేరింది. 2020 నవంబర్‌తో పోలిస్తే 60.8 శాతం వృద్ధి నమోదు కాగా.. కొవిడ్‌ ముందు సంవత్సరంతో పోలిస్తే 13.3 శాతం క్షీణత నమోదైంది. దేశీయంగా విమానయాన రంగం కొవిడ్‌ మునుపటి స్థితికి చేరినప్పటికీ.. అంతర్జాతీయంగా ఆంక్షలు కొనసాగుతున్నందున విక్రయాలు ఆ స్థాయిని అందుకోలేకపోయాయి.

విద్యుత్‌ వినియోగమూ పెరిగింది..

నవంబర్‌ నెలలో విద్యుత్‌ వినియోగంలో సైతం వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే 13.6 శాతం వృద్ధితో 112.81 బిలియన్‌ యూనిట్లకు చేరింది. సాధారణంగా నవంబర్‌లో విద్యుత్‌ వినియోగం పెద్దగా ఉండదు. అయితే, గతేడాది కంటే వినియోగం పెరగడాన్ని దేశంలో ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు సూచికగా భావించొచ్చు. శీతాకాలంలో ఉత్తరాదిలో హీటింగ్‌ పరికరాల వినియోగించడం వల్ల మున్ముందు విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో ఒక్కరోజు విద్యుత్‌ డిమాండ్‌ గరిష్ఠంగా 186.89 గిగావాట్స్‌కు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని