Petrol Prices: ఎన్నికల వేళ.. పెట్రోల్‌ ధరలు తగ్గుతాయా?

ఎన్నికల వేళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. లీటర్‌ ధరపై రూ.2 చొప్పున తగ్గనున్నట్లు సమాచారం.

Published : 02 Nov 2022 12:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు త్వరలో కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇంధన ధరలు కాస్త దిగిరావడంతో దేశంలోనూ వీటి ధరలను తగ్గించాలని చమురు ఉత్పత్తి సంస్థలు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఊహాగానాలు వినిపించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో నవంబరు 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక గుజరాత్‌ ఎన్నికలకు కూడా ఏ క్షణమైనా షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇంధన ధరల తగ్గింపు అధికార పార్టీకి సానుకూలంగా మారనుందని, అందుకే రాబోయే రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించే అవకాశాలున్నాయని సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై విడతల వారీగా రూ.2 వరకు తగ్గించనున్నట్లు తెలుస్తోంది.

చివరిసారిగా ఈ ఏడాది మే నెలలో చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఆ తర్వాత నుంచి పెట్రోల్‌ ఇంధన ధరల్లో మార్పులు చేయకుండా చమురు సంస్థలు స్థిరంగా ఉంచాయి. అయితే దీని వల్ల తమకు భారీ నష్టం వాటిల్లినట్లు ఇంధన తయారీ సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.72, డీజిల్‌ ధర రూ.89.62గా ఉంది.

ఇదిలా ఉండగా.. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌లో కోత విధిస్తూ ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. ఓఎన్‌జీసీ వంటి సంస్థలు ఉత్పత్తి చేస్తున్న టన్ను ముడి చమురుపై రూ.11,500గా ఉన్న ఈ పన్నును రూ.9,500కు తగ్గించింది. నేటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇక డీజిల్‌ ఎగుమతులపై విధిస్తున్న సుంకాన్ని లీటరుకు రూ.12 నుంచి రూ.13కు పెంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని