Philips: ఫిలిప్స్‌లో మళ్లీ కోతలు.. ఈసారి 6000 మంది తొలగింపు

తీవ్ర నష్టాలతో సతమతమవుతోన్న ఫిలిప్స్‌(Philips) మరోసారి కోతలను ప్రకటించింది. మరో 6వేల మందిని తొలగించనున్నట్లు వెల్లడించింది.

Published : 30 Jan 2023 13:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫిలిప్స్‌ (Philips) మరోసారి కోతల (Job Cuts)ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మరో 6 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైన స్లీప్‌ రెస్పిరేటర్స్‌లో లోపాల కారణంగా భారీ నష్టాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. కంపెనీ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగుల కోతల ప్రకటన వెలువడటం మూడు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

తాజా కోతల గురించి కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాయ్‌ జాకోబ్స్‌ ప్రకటన చేశారు. కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ ఉద్యోగుల సంఖ్యను మరింత తగ్గించుకోక తప్పని పరిస్థితి నెలకొందని వెల్లడించారు. ‘‘మా పనితీరును మెరుగుపర్చుకోవడం, ఉత్పాదకతను పెంచుకోడానికి మా పని విధానాన్ని సులభతరం చేసుకోవడం ఇప్పుడు అత్యవసరం. అందుకే కష్టమైనా సరే.. 2025 నాటికి దాదాపు 6 వేల మంది ఉద్యోగులను తొలగించక తప్పట్లేదు’’ అని జాకోబ్స్‌ ప్రకటించారు. తాజా లేఆఫ్‌ల్లో భాగంగా 2023లోనే దాదాపు 3 వేల మందిని విధుల నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. గతేడాది అక్టోబరులో కంపెనీ 4 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ సీఈఓ జాకోబ్స్‌ ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. అంటే రానున్న రెండేళ్లలో కంపెనీ మొత్తంగా 10వేల మంది ఉద్యోగులను తొలగించనుంది.

స్లీప్‌ ఆప్నియా అనే సమస్యతో బాధపడేవారి కోసం ఫిలిప్స్‌ (Philips) ‘స్లీప్‌ రెస్పిరేటర్స్‌’ను ఉత్పత్తి చేసింది. అయితే, ఈ మెషిన్లలో ఉన్న లోపాల కారణంగా రోగులు విషపూరిత, క్యాన్సర్‌ కారక ప్రభావాలకు గురయ్యే ప్రమాదం ఉందని గతంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో 2021లో ఫిలిప్స్‌ ఈ మెషీన్లను ప్రపంచవ్యాప్తంగా వెనక్కి తీసుకుంది. దీంతో కంపెనీకి భారీగా నష్టం వాటిల్లింది. ఈ రీకాల్‌ కారణంగా.. 2022లో ఫిలిప్స్‌ 1.605 బిలియన్‌ యూరోలు నష్టపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని