PhonePe: గోల్డ్ సిప్‌ను ప్రారంభించిన ఫోన్‌పే.. రూ.100తోనూ బంగారం కొనొచ్చు.

వినియోగ‌దారులు తాము సేక‌రించిన బంగారాన్ని ఎప్పుడైనా విక్ర‌యించ‌వ‌చ్చు

Updated : 26 May 2022 11:54 IST


ఫోన్ పే వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌. ప్ర‌ముఖ డిజిట‌ల్ పేమెంట్స్ యాప్ ఫోన్-పే ద్వారా ప్ర‌తీ నెల ఒక నిర్ధిష్ట మొత్తంతో 24 క్యారెట్ల స్వ‌చ్ఛ‌మైన బంగారాన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందుకోసం గోల్డ్ సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్‌)ని ప్రారంభించిన‌ట్లు ఫోన్‌పే బుధ‌వారం ప్ర‌క‌టించింది. సిప్ పెట్టుబ‌డుల ద్వారా సేక‌రించిన బంగారం భాగ‌స్వామ్య సంస్థ‌లైన ఎంఎంటీసీ- పీఏఎంపీ, సేఫ్ గోల్డ్ నిర్వ‌హిస్తున్న బ్యాంక్‌-గ్రేడ్ లాక‌ర్ల‌లో భ‌ద్ర‌ప‌రుస్తారు. 

ఫోన్ పే వినియోగ‌దారులు నెల‌కు రూ. 100 తో కూడా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. గోల్డ్ సిప్ అనేది క్రమమైన పెట్టుబడి, కాబ‌ట్టి పెట్టుబడి నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌తీ రోజు బంగారం ధ‌ర‌ల‌ను ట్రాక్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. నిర్ధిష్ట కాల‌వ్య‌వ‌ధుల‌లో ముందుగా నిర్ణ‌యించిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో వినియోగదారులు సగటు పెట్టుబడి వ్యయాన్ని త‌గ్గించుకోవ‌చ్చ‌ని సంస్థ తెలిపింది. 

ఫోన్‌పే యాప్‌లో గోల్డ్ సిప్‌ను ప్రారంభించే విధానం..
* వినియోగ‌దారులు.. త‌మ మొబైల్‌లో ఉన్న ఫోన్ పే యాప్‌ను తెరిచి.. గోల్డ్ సిప్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. 
* ఇప్పుడు 'గోల్డ్ ప్రొవైడ‌ర్‌'ను ఎంచుకోవాలి. స్క్రీన్ పై భాగంలో ఎంఎంటీసీ, సేఫ్ గోల్డ్ రెండు ఆప్ష‌న్లు అందుబాటులో ఉంటాయి. మీకు కావాల్సిన గోల్డ్ ప్రొవైడ‌ర్‌ను ఎంచుకోవచ్చు. 
* త‌ర్వాత నెల‌వారిగా ఎంత మొత్తాన్ని పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటున్నారో ఎంట‌ర్ చేయాలి. ఇక్క‌డ ఒకేసారి పెట్టుబ‌డి పెట్టే ఆప్ష‌న్ కూడా అందుబాటులో ఉంటుంది. ఒకేసారి పెట్టుబ‌డి పెట్టేవారు ఆ ఆప్ష‌న్ ఎంచుకోవచ్చు. 
* మీరు సిప్ మొత్తాన్ని ఎంట‌ర్ చేసిన త‌ర్వాత..మీరు ఎంచుకున్న మొత్తానికి ప్రస్తుతం ఉన్న బంగారం ధ‌ర ప్ర‌కారం ఎంత బంగారం వ‌స్తుంద‌నేది ప్ర‌క్క‌న చూపిస్తుంది. దాని కింద గ్రాము బంగారం ధ‌ర ఎంత ఉందో కూడా చూపిస్తుంది. 
* త‌ర్వాత మీరు ఎంత కాలానికి (3,5,7,10,15.. ఇలా) పెట్టుబడులు పెట్టాల‌నుకుంటున్నారో ఎంపిక చేసుకొని 'ప్రాసీడ్' బ‌ట‌న్ క్లిక్ చేస్తే సిప్ తేదీ ఎంపిక చేసుకునే ఆప్ష‌న్ వ‌స్తుంది. 
* సిప్ తేదీను సెల‌క్ట్ చేసుకున్న త‌ర్వాత మీ సిప్ అమౌంట్‌, తేది త‌దిత‌ర వివ‌రాలు స్క్రీన్‌పై క‌నిపిస్తాయి. ఒక‌సారి వివ‌రాలు స‌రిచేసుకుని పేమెంట్ చేయ‌వ‌చ్చు. 
* ప్ర‌తీనెల సిప్ తేదికి స్వ‌యంచాల‌కంగా చెల్లింపులు జ‌రిగేలా ఆటో - సెట‌ప్ ఆప్ష‌న్ కూడా అందుబాటులో ఉంది. 

ఫోన్‌పే ఫ్లాట్‌పారం ద్వారా గోల్డ్ సిప్‌ని ప్రారంభించ‌డం వ‌ల్ల యూపీఐ సౌల‌భ్యం ఉంటుంది. యూపీఐ ద్వారా సుల‌భంగా కొనుగోలు చేయ‌డంతో పాటు వినియోగ‌దారులు తాము సేక‌రించిన బంగారాన్ని ఎప్పుడైనా విక్ర‌యించ‌వ‌చ్చు. ఈ మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలో పొంద‌వ‌చ్చు. లేదా గోల్డ్ కాయిన్లు, బార్ల రూపంలో ఇంటికి పంపించే స‌దుపాయ‌మూ ఉంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని