PhonePe: ఫోన్‌పే కొత్త సర్వీస్‌.. విదేశాల్లోనూ యూపీఐ పేమెంట్స్‌!

భారతీయులు (Indians) విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వ్యాపారులకు యూపీఐ (UPI) ద్వారా పేమెంట్స్ చేసేందుకు వీలుగా ఫోన్‌పే (PhonePe) అంతర్జాతీయ యూపీఐ సేవలను ప్రారంభించింది. 

Published : 08 Feb 2023 01:33 IST

దిల్లీ: విదేశాల్లోని భారతీయులు ఇకపై యూపీఐ (UPI) ద్వారా స్థానికంగా నగదు చెల్లింపులు చేయొచ్చు. ఈ మేరకు ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే(PhonePe) యూఏఈ, సింగపూర్‌, మారిషస్‌, నేపాల్‌, భూటాన్‌ దేశాల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అంతర్జాతీయంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి ఫిన్‌టెక్‌ సంస్థగా ఫోన్‌పే అవతరించింది. ఇకపై భారతీయులు (Indians) విదేశాలకు వెళ్లినప్పుడు నగదు మార్పిడి చేయాల్సిన అవసరం లేకుండా తమ భారతీయ బ్యాంకు ఖాతా ద్వారానే నగదు చెల్లింపులు చేయొచ్చు. 

గత నెలలో భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (NPCI) ఒక ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా యూపీఐ లావాదేవీలు నిర్వహించే సంస్థలు ఏప్రిల్ 30 నాటికి విదేశాల్లో యూపీఐ చెల్లింపులు చేసేందుకు అనువైన సాంకేతికతను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా ఫోన్‌పే విదేశాల్లో సైతం పేమెంట్స్ చేసే అవకాశం కల్పిస్తోంది. భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వ్యాపారులకు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తే విదేశీ కరెన్సీ వారి బ్యాంకు ఖాతా నుంచి డెబిట్‌ అవుతుంది. 

‘‘గత ఆరేళ్లుగా యూపీఐ సేవలు దేశీయంగా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. విదేశాల్లో సైతం ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యూపీఐ ఇంటర్నేషనల్‌ను పరిచయం చేసింది. ఈ సేవలు అంతర్జాతీయంగా ముందుగా  అందుబాటులోకి తీసుకొచ్చినందుకు గర్విస్తున్నాం. విదేశాల్లో ప్రయాణించే భారతీయులు అక్కడ చెల్లింపులు చేసేందుకు ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది.  త్వరలోనే మరిన్ని దేశాల్లో తమ సేవలను విస్తరిస్తాం’’ అని ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ చారి తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని