PhonePe IPO: ఐపీఓకి సన్నద్ధమవుతున్న ఫోన్‌పే.. ఎప్పుడు రావొచ్చు?

వాల్‌మార్ట్‌ నియంత్రణలోని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపులో భాగమైన ఫోన్‌పే (PhonePe) తొలి పబ్లిక్ ఆఫర్‌ (IPO)కు సన్నాహాలు చేసుకుంటోంది....

Published : 15 Jun 2022 18:53 IST

దిల్లీ: వాల్‌మార్ట్‌ నియంత్రణలోని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపులో భాగమైన ఫోన్‌పే (PhonePe) తొలి పబ్లిక్ ఆఫర్‌ (IPO)కు సన్నాహాలు చేసుకుంటోంది. తమ కంపెనీ విలువ 8-10 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు ఐపీఓ (IPO)కి సంబంధించిన ప్రక్రియను పూర్తిచేయడానికి బ్యాంకర్లు, లీగల్‌ కన్సల్టెంట్లతో త్వరలో భేటీ కానున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఫోన్‌పే హోల్డింగ్‌ కంపెనీని సింగపూర్‌ నుంచి భారత్‌కు మార్చేందుకు కూడా ఫ్లిప్‌కార్ట్‌ సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు ఇటీవలే ఫోన్‌పే (PhonePe) బోర్డు ఆమోదం కూడా లభించింది.

సాధారణంగా టెక్నాలజీ ఆధారిత అంకుర సంస్థలు అమెరికా, సింగపూర్‌ వంటి పన్ను ఆదా చేసుకోగలిగే దేశాల్లో లిస్ట్‌ కావడానికి ఆసక్తి చూపుతాయి. కానీ, ఫోన్‌పే (PhonePe) మాత్రం అందుకు భిన్నంగా భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కోసం ప్రయత్నిస్తుండడం విశేషం. ఫోన్‌పే (PhonePe)ను ఫ్లిప్‌కార్ట్‌ మాజీ ఉద్యోగులైన సమీర్ నిగమ్‌, రాహుల్‌ చారీ, బుర్జిన్‌ ఇంజినీర్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2016లో దీన్నీ ఫ్లిప్‌కార్ట్‌ సొంతం చేసుకుంది. 2018లో ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో ఫోన్‌పేను భాగం చేశారు.

ఫోన్‌పే తన ప్రధాన వ్యాపారం లాభదాయకంగా మారిన వెంటనే ఐపీఓకి రావాలని కంపెనీ యోచిస్తోంది. 2023 నాటికి ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ఆఖరుకు ఉద్యోగుల సంఖ్యను 5,200కు పెంచాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 2,600 మంది పనిచేస్తున్నారు. కంపెనీ ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌, బ్యాంకింగేతర సంస్థ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. యూపీఐ లావాదేవీల్లో ప్రస్తుతం ఫోన్‌పేదే అగ్రస్థానం. నెలవారీ యూపీఐ లావాదేవీల్లో ఈ కంపెనీదే 47 శాతం వాటా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని