Gold Investment: భౌతిక బంగారం, ఈటీఎఫ్‌లు.. పెట్టుబడులకు ఏది మేలు?

ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడికి బంగారం, బంగారు ఈటీఎఫ్‌లు పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

Updated : 28 Oct 2022 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో భౌతిక బంగారం కొనుగోలు ఎప్పటి నుంచో ఉన్నదే. శుభ సందర్భాల్లో బంగారం కొనడం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. అయితే బంగారం పెట్టుబడులపై మెరుగైన రాబడికి గోల్డ్‌ ఈటీఎఫ్‌లు కూడా పరిగణించవచ్చని పెట్టుబడి నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడికి బంగారం పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

పెట్టుబడి పెట్టే ముందు నాణేలు, ఆభరణాల రూపంలో కొనుగోలు చేయడం మంచిదా లేదా గోల్డ్‌ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదా అనేది తెలుసుకోవాలి. 5 ఏళ్లలో భౌతిక బంగారం 12.20% సగటు వార్షిక రాబడి అందించగా.. అదే కాలంలో గోల్డ్‌ ఈటీఎఫ్‌లు 12.40% రాబడి ఇచ్చాయి. గత 5 సంవత్సరాలలో బంగారం 2017 చివరి నాటికి 10 గ్రాములకు రూ. 30 వేల నుంచి ప్రస్తుతం రూ.50వేలకు చేరింది.

గోల్డ్‌ ఈటీఎఫ్‌ కొనుగోలు-లిక్విడిటీ:

చాలా తక్కువ నగదు మొత్తంతో కూడా ఈటీఎఫ్‌ యూనిట్లను కొనుగోలు చేయొచ్చు. కేవలం 1 గ్రాము బంగారం విలువతో ఒక యూనిట్‌ ఈటీఎఫ్‌ను కొనుగోలు చేయొచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌ను డీమ్యాట్‌ ఖాతా కలిగినవారు ఒక బటన్‌ను క్లిక్‌ చేయడం ద్వారా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయొచ్చు. విక్రయించొచ్చు. 24 క్యారెట్ల విలువ కలిగిన బంగారం విలువను.. కొనుగోలు, అమ్మకం ప్రక్రియలో పొందుతారు. అంతేకాకుండా ఈటీఎఫ్‌ల కొనుగోలు, అమ్మకం సమయంలో బంగారం నాణ్యతను, విలువను, తరుగును కోల్పోతామన్న భయాలు పెట్టుకోనక్కర్లేదు.

ఈటీఎఫ్‌ల భద్రత

గోల్డ్‌ ఈటీఎఫ్‌ నిర్వహణ డీమ్యాట్‌ ఖాతాతో జరుగుతుంది కాబట్టి పెట్టుబడిదారుడు నిల్వ, భద్రత అంశాల గురించి ఆందోళన చెందనక్కర్లేదు. ఈటీఎఫ్‌లు మీ పేరు మీదే ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉంటాయి. ఎవరూ దొంగిలించే అవకాశం లేదు. వీటి భద్రతకు అదనంగా ఏమీ ఖర్చుపెట్టనక్కర్లేదు. డీమ్యాట్‌ ఖాతా లేనివారు గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో కూడా పెట్టుబడి పెట్టొచ్చు.

భౌతిక బంగారం

బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు ఎక్కువ మొత్తం నగదు అవసరమేర్పడుతుంది. అతి తక్కువ పెట్టుబడితో బంగారం బార్‌లు, నాణ్యమైన నాణేలు కొనడం సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ దొరికినా వాటిపై ఛార్జీలు ఉంటాయి. అధిక మొత్తంలోనే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మీరు సరైన బంగారాన్ని కొనుగోలు చేయాల‌ని నిర్ణయించుకున్నట్లయితే పేరున్న డీల‌రుతో గానీ, నమ్మకమైన వ్యాపార సంస్థను గానీ చూసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్‌లో ప్రతి ఒక్కరినీ నమ్మడానికి వీలు లేదు.

నష్టాలు

దుకాణాల‌లో బంగారాన్ని ఆభ‌ర‌ణాల రూపంలో కొనుగోలు చేసిన‌పుడు త‌రుగు కింద 6-18% దాకా తీసివేస్తారు. అలాగే, తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి. ఇందులో కొనుగోలుదారునికి నష్టమే మిగులుతుంద‌ని నిపుణుల అభిప్రాయం. బంగారం కొనుగోళ్లపై జీఎస్‌టీ కూడా ఉంటుంది. భౌతిక బంగారాన్ని(ముఖ్యంగా ఆభరణాలను) నగదు అవసరార్థం అమ్మేటప్పుడు అందులోని రాళ్లకి విలువ ఉండదు. వినియోగదారుడు బాగా నష్టపోయేది బంగారం అమ్మకాల విషయంలోనే. అంతేగాకుండా ఈ భౌతిక బంగారాన్ని దాచడానికి బ్యాంకు లాకర్లను ఆశ్రయించాలి. ఈ లాకర్లకు డిపాజిట్లు, అద్దె లాంటి అదనపు ఖర్చులుంటాయి.

చివరిగా: సాధార‌ణ నియ‌మంగా ఆర్థిక నిపుణులు మీ మొత్తం ఆస్తుల్లో కొద్ది శాతం బంగారం రూపంలో ఉండాలని స‌ల‌హా ఇస్తారు. కాబ‌ట్టి ఈ విలువైన లోహాన్ని కొనుగోలు చేసేట‌ప్పుడు పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని