Go First: పైలట్లకు ‘గో ఫస్ట్‌’ భారీ ఆఫర్‌

Go First: కంపెనీని వీడుతున్న పైలట్లను రక్షించుకునేందుకు గో ఫస్ట్‌ సిద్ధమైంది. వేతనాలు పెంచుతామని వారికి లేఖ రాసింది.

Updated : 30 May 2023 12:55 IST

దిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని సతమతమవుతున్న ‘గో ఫస్ట్‌’ (Go Fisrt) విమానయాన సంస్థ తమ పైలట్లకు భారీ ఆఫర్‌ ఇచ్చింది. సంస్థను వీడి వెళ్లకుండా వారిని రక్షించుకునేందుకు భారీ ఎత్తున వేతనాన్ని పెంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు పైలట్లకు కంపెనీ అంతర్గతంగా లేఖ రాసినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది.

కెప్టెన్లకు నెలకు రూ.1 లక్ష వరకు వేతనం పెంచేందుకు గో ఫస్ట్‌ (Go Fisrt) సిద్ధమైనట్లు సమాచారం. అలాగే ఫస్ట్‌ ఆఫీసర్లకు రూ.50 వేల వరకు అధిక వేతనం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వ్యక్తిగతంగా వారికి పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తన కథనంలో రాసుకొచ్చింది. పెంచిన వేతనాలు జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలియజేసింది. ఇప్పటికే రాజీనామా చేసిన వారు జూన్‌ 15లోగా ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలా చేసిన వారికి కూడా వేతన పెంపును వర్తింపజేస్తామని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు సుదీర్ఘ కాలంగా సంస్థలో పనిచేస్తున్న వారికి ప్రత్యేక బోనస్‌ ఇవ్వడానికి కూడా గోఫస్ట్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు పుంజుకున్నాయి. కానీ, విమానయాన పరిశ్రమను సిబ్బంది కొరత వేధిస్తోంది. ముఖ్యంగా పైలట్లకు భారీ డిమాండ్‌ ఉంది. అనేక సంస్థలు నియామక ప్రక్రియను వేగవంతం చేశాయి. దీంతో ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న గో ఫస్ట్‌ను వీడి పైలట్లు ఇతర సంస్థల్లో చేరుతున్నారు. దీన్ని అరికట్టేందుకే తాజాగా కంపెనీ వేతన పెంపు వ్యూహాన్ని ముందుకు తెచ్చింది.

ఇదీ చదవండి: ఎయిరిండియా భారీ నియామకాలు

వాడియా గ్రూప్‌ 2005లో నెలకొల్పిన గోఫస్ట్‌, 2017 కల్లా దేశంలోనే అయిదో అతిపెద్ద విమానయాన సంస్థగా నిలిచింది. అయితే 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి నష్టాల్లో నడుస్తోంది. వరుసగా 3 ఆర్థిక సంవత్సరాల్లో ఏర్పడిన నష్టాలు కలిపితే దాదాపు రూ.4,000 కోట్లకు చేరాయి. కరోనా సంక్షోభం సంస్థ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర దెబ్బకొట్టింది. ఇంతలోనే ఇంజిన్ల సమస్యలతో సంస్థ అధీనంలోని 57 విమానాల్లో 28 కార్యకలాపాలు ఆపేశాయి. దీంతో ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమై దివాలా పరిష్కార ప్రక్రియ కోసం జాతీయ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కు దరఖాస్తు చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని