రిటైర్‌మెంట్ త‌ర్వాత నెల‌కు రూ.3 ల‌క్ష‌ల ఆదాయం రావాలంటే..?

సిప్, సిప్‌స్టెప్‌తో క్ర‌మం త‌ప్ప‌కుండా పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితానికి కావ‌ల‌సిన సంప‌ద‌ను  సృష్టించుకోవ‌చ్చు. 

Updated : 25 Dec 2021 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్ర‌మ‌శిక్ష‌ణ‌తో చేసే పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని తెచ్చిపెడ‌తాయి. మ్యూచువ‌ల్ సిప్ విధానంతో చిన్న మొత్తంతో పెట్టుబ‌డులు ప్రారంభించి పెద్ద మొత్తాన్ని కూడ‌బెట్టొచ్చు. నిపుణ‌ల అభిప్రాయం ప్ర‌కారం మ‌దుప‌ర్లు దీర్ఘ‌కాలంపాటు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్‌) ద్వారా మ‌దుపు చేస్తే 10 శాతం పోస్ట్‌-టాక్స్ రిట‌ర్నుల‌ను ఆశించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఉన్న జీవన శైలి ప్ర‌కారం మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తి ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితాన్ని రాజీ ప‌డ‌కుండా జీవించాలంటే నెల‌కు రూ.40 వేల నుంచి రూ.45 వేల వ‌ర‌కు అవ‌స‌రం. ద్ర‌వ్యోల్బణాన్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటే 30 ఏళ్ల తర్వాత నెల‌వారీ ఖ‌ర్చుల‌కు దాదాపు రూ.3 ల‌క్ష‌లు అవ‌స‌రమ‌వుతుంది. దీర్ఘ‌కాల ల‌క్ష్యాల కోసం ఎంత సంప‌ద కావాలో లెక్కించేట‌ప్పుడు 6 నుంచి 6.5 శాతం ద్ర‌వ్యోల్బణాన్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవ‌డం మంచిది.

ప‌ద‌వీ విర‌మ‌ణ తర్వాత ఒక వ్య‌క్తి ఆయుర్ధాయం 25 ఏళ్లు ఉంటుంద‌ని ఊహిస్తే.. నెల‌వారీ రూ.3 ల‌క్ష‌ల‌ ఆదాయం స‌మ‌కూర్చుకునేందుకు ఎంత సంప‌ద అవ‌స‌ర‌మో తెలుసుకోవాలి. 6 శాతం ద్ర‌వ్యోల్బణాన్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటే రూ.7.2 కోట్ల సంప‌ద అవ‌స‌రం. ఈ మొత్తాన్ని సిస్ట‌మాటిక్ విత్‌డ్రా ప్లాన్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా క‌నీసం 8 శాతం రాబ‌డి ల‌భించే అవ‌కాశం ఉంది. ఇది అంచ‌నా వేసిన‌ వార్షిక ద్ర‌వ్యోల్బణం కంటే 2 శాతం ఎక్కువ.

రూ.7.2 కోట్ల సంప‌ద‌ను ఎలా స‌మ‌కూర్చుకోవాలి?
ఒక వ్య‌క్తి త‌న 30 సంవత్స‌రాల వ‌య‌సులో సిప్ ద్వారా పెట్టుబ‌డులు ప్రారంభిస్తే ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితానికి మ‌రో 30 ఏళ్ల స‌య‌యం ఉంటుంది. ఈ 30 సంవ‌త్స‌రాల్లో వార్షికంగా ఆదాయం పెరిగిన ప్ర‌తిసారీ సిప్ పెట్టుబ‌డులు కూడా పెంచుతూ పోవాలి. మ‌దుప‌ర్లు సిప్ పెట్టుబ‌డులను వార్షికంగా 10 శాతం చొప్పున పెంచుకుంటే పెట్టుబ‌డుల ల‌క్ష్యాన్ని సులభంగా చేర‌గ‌లుగుతారు. ఉద్యోగంలో చేరిన కొత్త‌లో జీతం త‌క్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి ఎక్కువ శాతం పెట్టుబ‌డుల‌కు కేటాయించలేక‌పోవ‌చ్చు. అనుభవం, నైపుణ్యం పెరిగే కొద్దీ ఉద్యోగంలో ప‌దోన్న‌తులు, ఇంక్రిమెంట్లు రావ‌డంతో ఆదాయం పెరుగుతుంది. ఇలా ఆదాయంతో పాటు పెట్టుబ‌డులను పెంచుకుంటే ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డం సుల‌భం అవుతుంది.

ప‌న్ను దృష్టిలో పెట్టుకుంటే..
30 సంవ‌త్స‌రాల సుదీర్ఘ‌కాలం మ్యూచ్‌వ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టే మ‌దుప‌ర్లు 12 శాతం రాబ‌డి అంచ‌నా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే విత్‌డ్రా స‌మ‌యంలో చెల్లించాల్సిన పన్నును దృష్టిలో పెట్టుకుంటే పోస్ట్ ట్యాక్స్ త‌ర్వాత వ‌చ్చే రాబ‌డి 10 శాతం వ‌ర‌కు ఆశించొచ్చు.

నెల‌కు ఎంత మదుపు చేయాలి?
30 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఉన్న వ్య‌క్తి ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి కోసం రూ.12 వేల‌తో నెల‌వారీ సిప్‌ను ప్రారంభించి, 10 శాతం వార్షిక స్టెప్ అప్‌తో 30 సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే 12 శాతం రాబ‌డి అంచ‌నాతో రూ.9.61 కోట్ల సంప‌ద‌ను సృష్టించుకోవ‌చ్చు. పోస్ట్-ట్యాక్స్ రాబ‌డి రూ.7.23 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. రూ.9.61 కోట్ల‌లో మ‌దుప‌రి పెట్టిన పెట్టుబ‌డి మొత్తం- రూ.2,36,87,139. రాబ‌డి రూ.7,24,63,661. అదే 25 ఏళ్ల వ‌య‌సులో పెట్టుబ‌డి ప్రారంభిస్తే.. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కి 35 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంటుంది కాబ‌ట్టి రూ.6 వేల‌తో నెల‌వారీ సిప్‌ను ప్రారంభిస్తే స‌రిపోతుంది. 10 శాతం వార్షిక స్టెప్ అప్‌తో, 12 శాతం రాబ‌డి అంచ‌నాతో దాదాపు రూ.9.5 కోట్ల సంప‌ద‌ను సృష్టించుకోవ‌చ్చు. అందువ‌ల్లే వీలైనంత త్వ‌ర‌గా పెట్టుబ‌డులను ప్రారంభించాలని చెబుతుంటారు నిపుణులు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. అయితే దీర్ఘకాలికంగా ఈ రిస్క్ తగ్గి, అధిక రాబడి వచ్చేందుకు అవ‌కాశం ఉటుంది.

(గమనిక : ఈక్విటీ పథకాల్లో మదుపు నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పెట్టుబుడులు పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. పైన తెలిపిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని