సొంత ఇంటి నిర్మాణం చేప‌డుతున్నారా? ఇవి తెలుసుకోండి!

మీ ఇల్లు ఎలా ఉండాల‌నుకుంటున్నారో  మీ ఆలోచ‌న‌ల‌ను డెవ‌ల‌ప‌ర్ల‌తో పంచుకుంటే.. మీకు న‌చ్చిన విధంగా ఇంటిని డిజైన్ చేస్తారు.  

Updated : 25 Dec 2021 17:24 IST

   

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇల్లు నిర్మించుకోవడం సగటు వ్యక్తి కల. పైగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ విషయంలో నాణ్య‌తా, ప్ర‌మాణాలు పాటించాల్సిందే. సాధారణంగా ఒక కాంట్రాక్టర్ వేర్వేరు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిపుణుల‌ను నియమించుకుంటారు. డెవలపర్ అయితే, డిజైనర్‌, ఇంజినీర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు.. ఇలా కొన్ని బృందాలను కలిగి ఉంటాడు. అందుకే సొంత ఇంటిని నిర్మించుకునేటప్పుడు ముందుగా ఈ రంగంలో అనుభవం ఉన్న లైసెన్స్‌డ్‌ కాంట్రాక్ట‌ర్‌ లేదా డెవ‌ల‌ప‌ర్‌ను నియ‌మించుకోవాలి.

ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..
నిపుణుల సూచ‌న‌లు: 
ఇంటి ప్లాన్ చేసే ఇంజినీర్‌ ద‌గ్గ‌ర నుంచి ఇంట‌రీయ‌ర్ డిజైన‌ర్‌ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రికీ స‌మ‌న్వ‌య ప‌రిచి ఒక టీమ్‌గా ఏర్పాటు చేసుకుని డెవ‌ల‌ప‌ర్లు ప్రాజెక్టుల‌ను చేప‌డుతుంటారు. అందువ‌ల్ల మీ ఇల్లు ఎలా ఉండాల‌నుకుంటున్నారో మీ ఆలోచ‌న‌ల‌ను వారితో పంచుకుని మీకు న‌చ్చిన విధంగా ఇంటిని డిజైన్ చేయించుకోండి. పూర్తి ప్లాన్ త‌యారైన త‌రువాత వాస్తు ప్ర‌కారం ఇంటి ప్లాన్ స‌రిగ్గా ఉంద‌ని నిర్ధారించుకుని మీకు, కుటుంబ స‌భ్యుల‌కు న‌చ్చితే ఇంటి నిర్మాణం ప్రారంభించ‌వ‌చ్చు. ప్రారంభానికి ముందే చూసుకోక‌పోతే నిర్మించిన త‌ర్వాత స‌రిచేసుకునేందుకు మ‌రింత ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంది. అందువ‌ల్ల ప్రారంభానికి ముందే ప‌క్కా ప్ర‌ణాళిక ఉండాలి.

అనుమ‌తులు: డెవ‌ల‌ప‌ర్‌కి ఇంటిని నిర్మించేందుకు కావ‌ల‌సిన అన్ని అనుమ‌తులూ ఉన్నాయా లేదా తెలుసుకోండి. వివిధ శాఖ‌ల నుంచి అనుమ‌తులు, స‌ర్టిఫికెట్లు, సంబంధిత లేఖ‌లు వంటివి ఉండాలి. ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు ఆర్థిక ప‌రిస్థితుల‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
బ‌డ్జెట్‌: ఒక‌సారి ఇంటి ప్లాన్ సిద్ధ‌మైన త‌ర్వాత బ‌డ్జెట్ గురించి డెవ‌ల‌ప‌ర్‌కి తెలియ‌జేయాలి. అప్పుడు ఇంటికి ఏ ర‌క‌మైన మెటీరియ‌ల్స్ ఉప‌యోగించాలో, ఎలా నిర్మించాలో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ఫ్లోరింగ్, బాత్‌ ఫిట్టింగ్స్‌, ఫిక్ష‌ర్స్‌, పెయింటింగ్, ఎల‌క్ర్టిక‌ల్ స్విచెస్, ఫిట్టింగ్స్‌, మాడ్యుల‌ర్ కిచెన్ ఇలా మీరు ఎంచుకున్న దాన్ని బ‌ట్టి బ‌డ్జెట్ ఉంటుంది.
స‌బ్-కాంట్రాక్ట‌ర్లు: చాలావ‌ర‌కు డెవ‌ల‌ప‌ర్లు సొంతంగా టీమ్ క్వాలిటీ ఇంజినీర్స్‌, సూప‌ర్‌వైజ‌ర్ వంటి స‌బ్-కాంట్రాక్ట‌ర్ల టీమ్ క‌లిగి ఉంటారు. మీరు సొంతంగా సబ్‌-కాంట్రాక్ట‌ర్‌ను పెట్టుకోవాల‌నుకుంటే ముందుగా డెవ‌ల‌ప‌ర్‌కి చెప్పాల్సి ఉంటుంది. దాని ప్ర‌కారం ఎంత ఖ‌ర్చ‌వుతుంద‌నేది అంచ‌నా వేసుకుంటారు.
కూలి ఖ‌ర్చులు: ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందే కూలి ఖ‌ర్చుల‌ను మాట్లాడుకోవాలి. అప్పుడు ఎంత ఖ‌ర్చు అవుతుందో దానిపై మీకు స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ముందుగానే అన్ని ఖ‌ర్చులు, లెక్క‌లు మాట్లాడుకుంటే త‌ర్వాత ఏ స‌మ‌స్యా ఉండ‌దు. ఎలాంటి చ‌ట్ట‌ప‌ర‌మైన ఇబ్బందులు రాకుండా కూలీల భ‌ద్ర‌త‌కు కూడా జాగ్ర‌త్త వ‌హించాల్సి ఉంటుంది.
నిర్మాణంపై క‌న్నేయండి: నిర్మాణం జ‌రిగేట‌ప్పుడు అక్క‌డ ప‌రిస్థితుల‌ను డెవ‌ల‌ప‌ర్‌ను అడిగి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటుండాలి. అదేవిధంగా అప్పుడుప్పుడు సైట్‌కి వెళ్లి నిర్మాణ క‌ర్య‌క‌లాపాల‌ను ప‌రిశీలిస్తుండాలి. అప్పుడు ఎలాంటి స‌మ‌స్య‌లూ త‌లెత్త‌కుండా ఉంటాయి.
ఇంటిరీయ‌ర్ లే అవుట్‌: ప‌వ‌ర్‌, వాట‌ర్, లైటింగ్ వంటి అన్ని స‌దుపాయాలు అన్ని స‌క్ర‌మంగా అమ‌రుస్తున్నారా లేదా చూసుకోవాలి. య‌జ‌మాని, డెవ‌ల‌ప‌ర్ ఇద్ద‌రూ క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటే అనుకున్న‌దాని ప్ర‌కారం ఇంటి నిర్మాణం పూర్త‌వుతుంది. 
పాత ప్రాజెక్టుల‌ను ప‌రిశీలించండి: డెవ‌ల‌ప‌ర్ ఇదివ‌ర‌కే నిర్మాణ రంగంలో ఉంటే ఇంత‌కు ముందు ప‌నిచేస‌న చోట ఫీడ్‌బ్యాక్ అడిగి తెలుసుకోవ‌చ్చు. ప‌నితీరు, అనుభ‌వం, డిజైన్, ప్రాసెస్‌, స్థ‌ల వినియోగం, ప్ర‌త్యేక‌త‌లు, ఫ‌ర్నీషింగ్ వంటి వాటి గురించి తెలుసుకోండి.
మీ అభిరుచికి త‌గిన‌ట్లు ఎంచుకోండి: ఇంటి నిర్మాణం పూర్త‌య్యే స‌మ‌యంలో ఫ్లోరింగ్, పెయింట్ క‌ల‌ర్స్‌, లైట్ ఫిట్టింగ్స్‌, బాత్ ఫిట్టింగ్స్‌, ఫిక్ష‌ర్స్, క్యాబినెట్స్ వంటివి మీ ఇష్ట‌ప్ర‌కారం మీ అభిరుచి త‌గిన‌ట్లు ఎంచుకోవ‌చ్చు.

కాంట్రాక్టర్ ద్వారా ఇంటిని నిర్మిస్తున్న‌ప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన‌వి..
* ప్రాజెక్టు నిర్మాణ స‌మ‌యంలో ఒకే వ్య‌క్తిని ఎంచుకోవ‌డం మంచిది.
* కాంట్రాక్ట‌ర్ ప‌నితీరు, బ‌డ్జెట్, బిల్డింగ్ మెటీరియ‌ల్స్, వ్య‌యాలు, స‌బ్‌-కాంట్రాక్ట్ వంటివి తెలుసుకోవాలి.
* బిల్డింగ్ ప్లాన్, విద్యుత్ సదుపాయం, నీరు, ఇత‌ర స‌దుపాయాలు వంటివి అన్ని ప‌రిశీలించిన త‌ర్వాత డిజైన్‌ను ఫైనల్‌ చేయాలి.

* కాంట్రాక్ట‌ర్‌ను అడిగి నిర్మాణ షెడ్యూల్ తెలుసుకోవాలి. కిచెన్‌, టైల్స్, బాత్ ఫిట్టింగ్స్‌, ఇంటీరియ‌ర్స్, పేమెంట్ షెడ్యూల్ వంటివి మాట్లాడుకోవాలి.

* ఇంటి నిర్మాణం గురించి ఎప్ప‌టిక‌ప్పుడు మీకు స‌మాచారం అందేలా చూసుకోవాలి. దీంతో ఏదైనా మార్పులు చేయాల‌నుకుంటే అనుకూలంగా ఉంటుంది.

* నిర్మాణ స్థ‌లాన్ని ప‌రిశీలిస్తున్న సూప‌ర్‌వైజ‌ర్ వివరాలు తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. చాలా వ‌ర‌కు కాంట్రాక్ట‌ర్లు నిర్మాణ తీరును, నాణ్య‌త‌ను ప‌రిశీలించేందుకు సూప‌ర్‌వైజ‌ర్ల‌ను నియమించుకుంటారు.

* ముందుగా అనుకున్న‌ట్లుగా కాకుండా నిర్మాణంలో ఏదైనా మార్పులు కావాలంటే వ్య‌యాలు, షెడ్యూల్‌లో వ‌చ్చిన మార్పులు రాత‌పూర్వ‌కంగా ఉండాలి.

* వీలైనంత వ‌ర‌కు నిర్మాణం జ‌రిగినంత కాలం య‌జ‌మానులు, కాంట్రాక్ట‌ర్‌కు అందుబాటులో ఉండాలి. నిర్మాణం జ‌రిగే స్థ‌లానికి ద‌గ్గ‌ర‌గా ఉంటే కాంట్రాక్ట‌ర్ మిమ్మ‌ల్ని త్వ‌ర‌గా సంప్ర‌దించ‌గ‌లుగుతారు. విద్యుత్ స‌దుపాయాలు, టైల్స్ వంటివి ఫిక్స్ చేసేట‌ప్పుడు ఆర్కిటెక్ట్‌తో పాటు య‌జ‌మాని ఉంటే నిర్మాణంలో ఇబ్బందులు ఉండ‌వు.

చివ‌ర‌గా..
ఇంటి నిర్మాణం కాంట్రాక్ట‌ర్ సాయంతో పూర్తి చేసినప్పుడు త‌క్కువ ఖ‌ర్చు ఉండొచ్చు. అదే డెవ‌ల‌ప‌ర్ అయితే అంద‌రి టీమ్‌ను క‌లిగి ఉంటారు కాబ‌ట్టి ఎక్కువ‌గా ఖ‌ర్చు ఉంటుంది. మీ స‌దుపాయాన్ని బ‌ట్టి మీరు నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని