Financial Planning: ఆర్థిక స్థిరత్వం సాధించాలంటే.. ప్రణాళిక ఉండాల్సిందే 

క్రమశిక్షణతో చేసే పొదుపు, పెట్టుబడులతో ఊహించిన పరిస్థితులను, ఖర్చులను సమర్థవంతంగా ఎదుర్కుని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించచ్చు.

Updated : 09 Sep 2021 16:53 IST

పాత రోజుల్లో ఐదెంకెల జీతం అంటెనే ఆశ్చర్యపడేవారు.. కానీ ప్రస్తుతం అలా కాదు సంపాదనా సామర్ధ్యం పెరిగింది. ఐదెంకెలు, అరెంకెల, అంతకంటే ఎక్కువ సంపాదన ఉన్నవారు చాలామంది ఉన్నారు. అయితే సంపాదన ఎంత ఉన్నా ఊహించిన ఖర్చులు వచ్చినప్పుడు.. ఎదుర్కోవడంలో తడబడుతున్నారు చాలామంది. చివ‌రికి రుణం తీసుకోక త‌ప్ప‌డం లేదు. తిరిగి చెల్లించేందుకు సంపాద‌న మొత్తం స‌రిపోతుంది. పొదుపు, పెట్టుబ‌డుల‌కు మాటే ఉండ‌డం లేదు. ఆర్థిక అసమానతల వల్ల మానసికంగా ఒత్తిడికి గురై ఆనారోగ్యం పాలవుతున్నారు. 

ఆర్థిక ఒత్త‌డి నుంచి బ‌యట‌ప‌డాల‌న్నా, ఊహించిన పరిస్థితులను, ఖర్చులను సమర్థవంతంగా ఎదుర్కుని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాల‌న్నా.. పొదుపు, మ‌దుపు రెండూ క్రమశిక్షణతో చేయాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇందుకోసం ముఖ్యంగా ఉండాల్సింది ప్రణాళిక. ఇప్పుడిప్పుడే  ఉద్యోగంలో చేరిన వారి దగ్గర నుంచి కేరీర్ మధ్యలో ఉన్న, పదవీ విరమణ దశలో ఉన్నా...చివరికి పదవీ విరమణ చేసినా కూడా ఆర్థిక ప్రణాళిక ఉండాల్సిందే. మనం చేసే ఏ పని అయినా ఒక ప్రణాళిక ప్రకారం.. క్రమశిక్షణతో చేస్తేనే విజయం సాధించగలం. ఇదే సూత్రం ఆర్థికంగానూ వర్తిస్తుంది. 

ఆర్థిక ప్రణాళిక ఈ కింది విషయాలలో సహాయపడుతుంది. 
* ఆర్థిక ప్రణాళిక ఉంటే..స్పష్టత ఉంటుంది.
* ఆదాయం, ఖర్చుల నిర్వహణలో సమతుల్యత ఉండేలా సహాయపడుతుంది.
* నగదు ఎక్కడ ఖర్చవుతుందో తెలుస్తుంది.. దీంతో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు.
*ల‌క్ష్యానికి త‌గిన‌ట్లు పెట్టుబ‌డులు చేస్తూనే.. ప‌న్ను మిన‌హాయింపు మార్గాలు అన్వేషించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.
* ఉత్తమ పెట్టుబడుల ఎంపకతో.. సాధ్యమైనంత ఎక్కవ రాబడికి సహాయపడుతుంది
* సంపద నిర్వహణ సులభమవుతుంది
* పదవీ విరమణ జీవితాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. 

ఎంత పెట్టుబడి పట్టగలం..
ఆర్థిక ప్రణాళికను రూపొందించే ముందు, మీ ఆర్థిక పరిస్థితిని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. వార్షిక, నెలవారీ ఆదాయం..ఖర్చులను పరిశీలించండి. అత్యవసర ఖర్చులు లేదా అనుకోని ఖర్చులు ఎప్పుడూ ఉండవు కాబట్టి వాటిని ప్రక్కన పెడితే రోజువారి అవసరాలు అద్దె, కిరాణా, బీమా చెల్లింపులు, ప్రయాణ ఖర్చులు వంటి సాధారణ ఖర్చులపై దృష్టి పెట్టాలి. దీని వల్ల మన ఆదాయంలో ఖర్చులు పోనూ ఎంత పొదుపు చేయోచ్చో తెలుస్తుంది. దీనిలో ఎంత పెట్టుబడి పెట్టగలమో అర్థం అవుతుంది.

ప్రస్తుత పెట్టుబడులు..
ప్రస్తుతం ఉన్న ఆస్తులు అంటే సొంత స్థలం, ఇల్లు లేదా మ‌రేదైనా ఆస్తి, బంగారం, మ్యూచవల్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి  ప్రస్తుత పెట్టుబడులు జాబితాను తయారు చేయండి. ఇందులో నుంచి ఇంటి విలువను, బంగారాన్ని తీసివేసి మిగిలిన ఆస్తులు, పెట్టుబడులను అంచనా వేయండి.  

లక్ష్యాలు..
ఆదాయం, ఖర్చులు, పొదుపు గురుంచి ఒక అవగాహనకు వచ్చాక ఆర్థిక ప్రణాళిక రూపొందించాలి. ఇందుకోసం తరువాత చేయాల్సి పని మీ ఆర్థిక లక్ష్యాలు ఏంటి.. ఆలోచించి,  ఒక జాబితాను రూపొందించండి. ఇందులో నుంచి అధిక ప్రాధాన్యత ఉన్న వాటిని షార్ట్ లిస్ట్ చేయండి. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు ఎంత మొత్తం అవసరమవుతుంది అంచనా వేయండి. ఉదాహరణకి.. మీరు కొంత కాలం తరువాత ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారు అనుకుందాం.  దీనికి ఎంత మొత్తం అవసరమవుతుంది.. ఎంత స‌మ‌యం ఉంది.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత కూడ‌బెట్టారు..ఇంకా ఎంత మొత్తం అవ‌స‌ర‌మ‌వుతుంది.. అంచనా వేయండి. ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి.. ప్రస్తుతం ఉన్న ధర భవిష్యత్తులో ఉండకపోవచ్చు.. ధర గణనీయంగా పెరగచ్చు.. అందువల్ల ద్రవ్యోల్భణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని లక్ష్యానికి అవసరమైన మొత్తాన్ని అంచనా వేయాలి. 

బీమా..
మీ, మీకుటుంబ రక్షణకు అవసరమైన జీవిత, ఆరోగ్య బీమాలు తీసుకున్నారా.. లేదా.. చూడాలి.  మీపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు టర్మ్ బీమా తప్పనిసరిగా తీసుకోవాలి. ప్ర‌స్తుత వార్షిక ఆదాయానికి క‌నీసం 15-20 రెట్లు హామీ మొత్తం ఉండాలి. అలాగే ఆరోగ్య భద్రత కోసం మీతో పాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా ఉండేలా చూసుకోవాలి.   

పెట్టుబడులు..
పెట్టుబడులు చేసేప్పుడు మీ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి.  ఆర్థిక లక్ష్యాలకు మ్యాచ్ అయ్యేలా పెట్టబడులు ఉండాలి. రివార్డ్, రేట్ ఆఫ్ రిటర్న్, లిక్విడిటిల‌తో రిస్క్‌ను బ్యాలెన్స్ చేస్తూ పెట్టుబడులు పెట్టాలి.

సమీక్ష..
ఇక్కడ వరకు చేరుకున్నాక.. రిలాక్స్ అయిపోతారు చాలామంది. ఆర్థిక ప్రణాళిక వేయడంతోనే సరిపోదు. ఇక్కడ నుంచి ఆర్థిక ప్రణాళిక రెండో దశ మొదలవుతుంది. అదే నిర్వహణ..దీనికి క్రమశిక్షణ అవసరం. 

పెట్టుబడులను ట్రేక్ చేస్తుండాలి.. కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఆటో-రెన్యువల్, వార్షిక రుసుములు వంటివి అనవసర ఖర్చులకు దారితీయోచ్చు. అందువల్ల నిరుపయోగంగా ఉన్న బ్యాంక్ పొదుపు ఖాతాలు/  డీమ్యాట్ ఖాతాలు, క్రెడిట్/  డెబిట్ కార్డులు, లాకర్లు మూసివేయండి. 

పన్ను ఆదా కోసం.. ఐటి చట్టాల ప్రకారం, పన్ను ఆదా చేసే పెట్టుబడులను ఎంచుకోవడం మంచిది. లేదా తక్కువ పన్ను రేట్లు వర్తించే వాటిలో మదుపు చేసేందుకు ప్రయత్నించండి. అయితే పెట్టుబడులు సాధానాన్ని ఎంచుకునేందుకు పన్ను ఎప్పుడూ ప్రాథమిక ప్రమాణికంగా ఉండకూడదు. రిస్క్, లిక్విడిటి పరిగణలోకి తీసుకోవాలి. రిస్క్, రివార్డుల‌ మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. 

రుణాలు.. ఇప్పటికే ఉన్న రుణాలను పర్యవేక్షించండి. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలు వంటివి అధిక వడ్డీతో వస్తాయి. రాబడిలో అధిక భాగం వీటికే మళ్లించాల్సి వస్తుంది. అందువల్ల వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేయండి.

చివరగా..
పెట్టుబడులను సకాలంలో సమీక్షీంచడం వల్ల.. ఆర్థిక సాధనాల పనితీరు మీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒక వేళ ప్రస్తుత పెట్టుబడుల పనితీరు సరిగ్గా లేకపోతే.. మరికొంత కాలం వేచిచూడటం.. లేదా విక్రయించడం.. లేదా వేరొక పెట్టుబడిలో పెట్టడం.. వంటి ఆప్షన్లను విశ్లేషించి తెలివైన నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని