ఇంటి పేరు మారినా పెట్టుబ‌డుల‌పై ప్ర‌భావం ప‌డ‌కూడ‌దంటే..?

రాధిక‌కు వ‌చ్చే నెల‌లో వివాహం కాబోతోంది. ఆమె ఇప్పటి వరకు చేసిన పెట్టుబ‌డులు తండ్రి ఇంటి పేరుతోనే చేసింది. అయితే, వివాహం త‌ర్వాత ఆమె త‌న భ‌ర్త ఇంటి పేరును త‌న పేరుకు ముందు చేర్చాల‌నుకుంటోంది.

Updated : 17 Aug 2022 11:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాధిక‌కు వ‌చ్చే నెల‌లో వివాహం కాబోతోంది. ఆమె ఇప్పటి వరకు చేసిన పెట్టుబ‌డులు తండ్రి ఇంటి పేరుతోనే చేసింది. అయితే, వివాహం త‌ర్వాత ఆమె త‌న భ‌ర్త ఇంటి పేరును త‌న పేరుకు ముందు చేర్చాల‌నుకుంటోంది. అయితే, ఒక‌వేళ ఇంటి పేరు మార్చుకుంటే ఆ ప్రభావం తాను ఇది వరకే చేసిన పెట్టుబ‌డుల‌పై ఉంటుంది. దీనివల్ల మదుపు చేసిన మొత్తంపై వ‌చ్చే వ‌డ్డీ, డివిడెండ్లు ప్రభావితం కావొచ్చు. అలాగే పెట్టుబ‌డులు కాల‌ప‌రిమితి పూర్తయ్యాక పూర్తి ఆదాయం రాక‌పోవ‌చ్చు. అలా జరగకుండా ఉండాలంటే ఇంటి పేరు మారినా పెట్టుబడుల‌పై ప్రభావం పడకకుండా వివాహ ధ్రువీకరణ పత్రాన్ని పెట్టుబ‌డులు చేసిన ప్రతిచోటా (బ్యాంక్ ఖాతా, ఎఫ్‌డీ అకౌంట్లు, మ్యూచువ‌ల్ ఫండ్లు, డీమ్యాట్ ఖాతా) స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. వివాహం అయిన జంట‌ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో మ్యారేజ్ స‌ర్టిఫికెట్‌ పొందొచ్చు.

పీఎఫ్: పీఎఫ్ ఖాతాలో పేరు మార్చేందుకు ఖాతాదారులు యూఏఎన్ వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫార‌మ్‌ పూరించాలి. అలాగే ముందుగా సంస్థ ఆమోదం పొందాల్సి ఉంటుంది.. ఐడెంటీ ఫ్రూఫ్‌ని ఇస్తే 30 రోజుల‌లో ప్రాసెస్ పూర్తిచేస్తారు. 

ఎఫ్‌డి/ మ్యూచువ‌ల్ ఫండ్: పెళ్లి త‌ర్వాత పుట్టింటి పేరు స్థానంలో.. భ‌ర్త ఇంటి పేరును మార్చుకోవాల‌నుకునే వారు బ్యాంకు, కేఆర్ఏ (కేవైసీ ఆమోదిత ఏజ‌న్సీ)కి లేదా ఏఎఎంసీకి మ్యారేజ్ స‌ర్టిఫికెట్‌తో పాటు గుర్తింపు ధ్రువపత్రం సబ్మిట్‌ చేయాలి. మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల విష‌యంలో సంబంధిత కార్యాల‌యం వారు కొన్నిసార్లు యూనిట్ హోల్డర్‌ నుంచి నో-అబ్జెక్షన్‌ స‌ర్టిఫికెట్‌ను అడుగుతారు. అలాగే పాన్ కార్డును కూడా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

పేరు మార్చుకునేందుకు అవ‌స‌ర‌మ్యే ప‌త్రాలు..
*
వివాహ ధ్రువీకరణ పత్రం (మ్యారేజ్‌ స‌ర్టిఫికెట్‌)
* కొత్త పేరు లేదా భర్త ఇంటి పేరుతో ఉన్నట్లు ద్రువీకరణ పత్రం (పాస్‌పోర్ట్‌, పాన్ కార్డ్‌, ఓట‌ర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్)
* పేరు మార్చాల్సిందిగా అభ్యర్థిస్తూ ద‌ర‌ఖాస్తు లేఖ‌
* బ్యాంకు ఖాతాలో కూడా కొత్త పేరును అప్‌డేట్ చేయాలి. ముఖ్యంగా మ్యూచువ‌ల్ ఫండ్‌కు జ‌త చేసిన బ్యాంకు ఖాతాలో అవ‌స‌ర‌మైన మార్పులు చేయాలి.
* ఒక‌వేళ సంత‌కం మారుతుంటే.. ఈ విష‌యం గురించి బ్యాంక్ మేనేజ‌ర్‌కి లేఖ రాయాలి. సంత‌కం మారిన‌ట్లు బ్యాంక్ మేనేజ‌ర్ ధ్రువీకరించాల్సి ఉంటుంది.
* కొత్త పేరు లేదా భర్త ఇంటి పేరుతో ఉన్న బ్యాంక్ చెక్‌.
* అవ‌స‌ర‌మైతే హోల్డర్లు అందరి నుంచి 'నో ఆబ్జెక్షన్' లెట‌ర్ ఇవ్వాలి.
* కేవైసీ రిజిస్ట్రేష‌న్ ఫారంలో కూడా అవసరమైన మార్పులు చేయడం కూడా తప్పనిసరి.
వివాహ కార‌ణంగా కాకుండా మరే ఇతర కార‌ణాల వల్ల పేరు మార్చుకుంటే అధికారిక గెజిట్ లేదా వార్తాప‌త్రిక‌లో పేరు మార్పు గురించి ఇచ్చిన ప్రకటనను రుజువుగా ఇవ్వొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని