Fuel credit card: క్రెడిట్ కార్డుతో పెట్రోల్ కొంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండి..

సొంత వాహ‌నాలు ఉప‌యోగించి ఎక్కువ‌గా ప్ర‌యాణించే వారికి  ఇంధ‌న కార్డులు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటాయి

Updated : 27 Sep 2021 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఇటీవ‌లి కాలంలో భారీగా పెరిగాయి. దీంతో క్రెడిట్ కార్డులు జారీ చేసే సంస్థలు.. ఇంధ‌న ఖ‌ర్చుపై మ‌రిన్ని డిస్కౌంట్లు, రివార్డులు, క్యాష్ బ్యాక్‌ల‌ను ఆఫ‌ర్ చేస్తూ కొత్త వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. కొన్ని సంస్థ‌లు బీపీసీఎల్‌, హెచ్‌పీ వంటి చ‌మురు సంస్థ‌లతో క‌లిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల‌ను తీసుకొస్తున్నాయి. భార‌త్ పెట్రోలియం భాగ‌స్వామ్యంతో ఎస్‌బీఐ ఈ వారంలోనే కో-బ్రాండెడ్ రూపే కాంటెక్ట్‌లెస్ కార్డును లాంచ్ చేసింది. ఇలా చాలా క్రెడిట్ కార్డు సంస్థ‌లు ఇంధ‌న కొనుగోలుపై ఆఫ‌ర్ల‌ను ఇస్తున్నాయి. అయితే ఈ క్రెడిట్ కార్డులు ఎలా ప‌నిచేస్తాయి? ఎవ‌రు ఉప‌యోగించాలి? ఈ కార్డుల‌ను ఉప‌యోగించేవారు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏంటి? తెలుసుకుందాం.. 

ఎవ‌రు ఉప‌యోగించాలి?
సొంత వాహ‌నాలు ఉప‌యోగించి ఎక్కువ‌గా ప్ర‌యాణించే వారికి ఇంధ‌న కార్డులు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటాయి. ఇంధ‌న కొనుగోలు ఎక్కువ‌గా ఉంటే రివార్డులు, క్యాష్‌బ్యాక్ ఎక్కువ‌గా ఉంటాయి. డ‌బ్బు ఆదా అవుతుంది. క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థ‌లు చ‌మురు సంస్థ‌ల‌తో క‌లిపి ఈ కార్డుల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. రివార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ల‌ను అన్‌లాక్ చేసేందుకు కొన్ని ష‌రతుల‌ను విధిస్తున్నాయి. సాధార‌ణంగా రోజువారీ లేదా నెల‌వారీ ఇంధ‌న వినియోగం ఎక్కువ‌గా ఉన్న‌వారికి ఇంధ‌న కార్డులతో  ఎక్కువ రివార్డు పాయింట్లు వ‌స్తాయి.

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..

నెల‌వారీ ఇంధ‌న ఖ‌ర్చుల‌ను పోల్చి చూడండి: ఇంధ‌న ఖ‌ర్చును ఆదా చేసేందుకు ఫ్యూయ‌ల్ కార్డును తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తుంటే.. జాయినింగ్ ఫీజుతో పాటు వార్షిక రుసుములు ఉంటాయి. అందువ‌ల్ల‌ కార్డుకు అయ్యే ఖ‌ర్చును తెలుసుకోవాలి. కొన్ని సంస్థ‌లు వార్షిక వినియోగానికి కొంత టార్గెట్‌ను ఏర్పాటు చేస్తాయి. అంతకుమించి ఖ‌ర్చు చేస్తే వార్షిక రుసుములు ర‌ద్దు చేస్తాయి. ఒక వేళ ఖ‌ర్చు చేయ‌డంలో విఫ‌లమైతే మొత్తం పొదుపుపై ప్ర‌భావం చూపుతుంది. అందువ‌ల్ల మీరు కార్డు జారీ చేసిన సంస్థ‌లు తెలిపిన దానికంటే ఎక్కువ ఇంధనంపై ఖ‌ర్చు చేయ‌గ‌లం అనుకుంటే మాత్ర‌మే కార్డును తీసుకోవ‌డం మంచిది. నెల‌వారీ ఇంధ‌న ఖ‌ర్చుల‌తో కార్డు ఉప‌యోగిస్తే అయ్యే ఖ‌ర్చుల‌ను పోల్చి చూడండి.

పెట్రోల్ పంప్‌ల‌ జాబితా: కో-బ్రాండెడ్ కార్డుల విష‌యంలో భాగ‌స్వామి కాని రీఫిల్ స్టేష‌న్‌లో చేసే కొనుగోళ్ల‌పై లాయ‌ల్టీ రివార్డు పాయింట్లు వ‌చ్చే అవ‌కాశం ఉండదు. అందువల్ల వినియోగ‌దారులు తాము ఎక్కువ‌గా ఆయిల్ కొనుగోలు చేసే పంపును నిర్ధారించుకోవాలి. అలాగే ఖర్చు చేసిన మొత్తంపై రివార్డు పాయింట్లు పొంద‌గ‌ల లేదా రీడీమ్ చేసుకోగ‌ల‌ భాగ‌స్వామ్య ఆయిల్ పంపుల జాబితాను రూపొందించుకుని అందుకు త‌గిన కార్డును తీసుకోవాలి.

ఫైనాన్స్ ఛార్జీలు: కార్డు బ‌కాయిల‌ను స‌కాలంలో చెల్లించాలి. గ‌డువు తేదీలోపు క్రెడిట్ కార్డు బిల్లుల‌ను పూర్తిగా చెల్లించ‌డంలో విఫలమైతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు కార్డు, అది జారీ చేసిన సంస్థ‌పై ఆధార‌ప‌డి 23 శాతం నుంచి 49 శాతం వ‌ర‌కు ఉంటాయి.

రివార్డు పాయింట్లు, వెల‌క‌మ్ బోన‌స్‌: సేక‌రించిన రివార్డు పాయింట్ల‌ను సాధార‌ణంగా భాగ‌స్వామ్య అవుట్‌లెట్స్ వ‌ద్ద వినియోగించాల్సి ఉంటుంది. కానీ ఎంపిక చేసిన ఆన్‌లైన్ భాగ‌స్వామ్యులు లేదా గిఫ్ట్ ఓచ‌ర్ల రూపంలో రీడీమ్ చేసుకునేందుకు కొన్ని కార్డు జారీ సంస్థ‌లు అనుమ‌తిస్తున్నాయి. రివార్డు పాయింట్ల విష‌యంలో గుర్తంచుకోవాల్సిన మరో ముఖ్య విష‌యం ఎక్స్‌పైరీ డేట్‌. చాలా వ‌ర‌కు ఫ్యూయ‌ల్ క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్ల‌కు 2 నుంచి 3 సంవ‌త్స‌రాల గ‌డువు ఉంటుంది. కొన్ని జారీ సంస్థ‌లు గడువు తేదీ లేకుండానే కార్డుల‌ను జారీ చేస్తున్నాయి. ఈ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కొత్త‌గా కార్డు తీసుకునే వారికి కొన్ని సంస్థ‌లు జాయినింగ్ బోన‌స్ లేదా వెల్‌క‌మ్ బోన‌స్‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. కాబ‌ట్టి కొత్త‌గా కార్డు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు వీటిని ప‌రిశీలించాలి.

స‌ర్‌ఛార్జీ మిన‌హాయింపు: చాలావ‌ర‌కు ఫ్యూయ‌ల్ బేస్డ్‌ క్రెడిట్ కార్డులు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసిన‌ప్పుడు 3 శాతం వ‌ర‌కు స‌ర్‌ఛార్జ్ వ‌ర్తించొచ్చు. మీ కార్డుపై కూడా ఈ స‌దుపాయం ఉంటే కొంత లేదా పూర్తి స‌ర్‌ఛార్జ్ మిన‌హాయింపు పొందొచ్చు. ఇది కార్డును బ‌ట్టి మారుతుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని