రైతులకు నెల నెలా ₹3వేల పింఛన్‌.. అర్హత ఏంటి? ఎంత చెల్లించాలి?

PM Kisan Mandhan Yojana: వృద్దాప్యంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనందిచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకమే ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన (PM Kisan Mandhan Yojana).

Updated : 15 Mar 2023 13:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైతుకు ఆసరా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టింది. రైతుల రుణాల కోసం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ఇస్తోంది. పెట్టుబడి సాయం కోసం  పీఎం-కిసాన్‌  సమ్మాన్‌ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే, వయసు పైబడిన రైతులకు ఆర్థికంగా తోడుగా నిలవాలనే ఉద్దేశంతోనే అమలు చేస్తున్న మరో పథకమే ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన (PM Kisan Mandhan Yojana). ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన రైతులు నెలకు కనీసం రూ.3 వేల చొప్పున పెన్షన్‌ పొందచ్చు. ఈ పథకం అర్హత, నమోదు వివరాలు ఇవీ..

అర్హత.. 

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంబంధిత  భూ రికార్డుల్లో పేర్లు ఉండాలి. అందులో  2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమి కలిగి ఉండాలి. 18-40 మధ్య వయసున్నవారై ఉండాలి. వయసు 60 దాటాక ఈ పథకం కింద నెలకు కనీస పింఛను రూ.3 వేలు అందుతుంది. ఒక వేల అర్హుడైన వ్యక్తి మరణిస్తే అతడి జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్‌ వస్తుంది. కేవలం భాగస్వామికి మాత్రమే ఇలా పెన్షన్‌ లభించే వెసులు బాటు ఉంటుంది.  అతడి పిల్లలకు వర్తించదు.

ఎంత కట్టాలంటే?

అర్హుడైన రైతు తనకు 60 ఏళ్లు వచ్చేంత వరకు నెలకు రూ.55 నుంచి రూ.220 వరకు  చెల్లించాలి. రైతుకు 60 ఏళ్లు నిండగానే పెన్షన్‌ కోసం క్లెయిమ్‌ చేసుకోవాలి. అనంతరం ప్రతి నెలా రైతు బ్యాంక్‌ ఖాతాలో ప్రభుత్వం ఆ పెన్షన్‌ను అందిస్తుంది.

వీరు అనర్హులు..

నేషనల్‌ పెన్షన్‌  స్కీం (NPS), ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌వో పథకం తో పాటు ఏ ఇతర చట్టబద్ధమైన  సామాజిక భద్రతా పథకాల నుంచి లబ్ది పొందుతున్న వారు.. జాతీయ పెన్షన్‌ పథకాన్ని ఎంచుకున్న రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు.

ఇవీ కావాల్సినవి..

ఈ పథకంలో చేరాలంటే దరఖాస్తుదారుడు ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, పేరు, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ, జీవిత భాగస్వామి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అర్హత గల రైతులు తమ ప్రాంతంలో ఉన్న కామన్‌ సర్వీస్‌ సెంటర్‌/ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న రైతులు 60 ఏళ్లు వచ్చే వరకు నెలవారీ చందాగా రూ.55 నుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు నిండాక పింఛన్‌ అందుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని