PM modi: గత ప్రభుత్వ తప్పును మేం సరిచేశాం.. సీఐఐ సదస్సులో ప్రధాని మోదీ

గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తాము సరిదిద్దామని ప్రధాని మోదీ అన్నారు. రెట్రోస్పెక్టివ్‌ (పాత తేదీల నుంచి వేసే పన్ను) పన్నునుద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. దీని రద్దు ద్వారా ప్రభుత్వంపై పరిశ్రమ వర్గాలకు...

Published : 11 Aug 2021 17:55 IST

దిల్లీ: గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తాము సరిదిద్దామని ప్రధాని మోదీ అన్నారు. రెట్రోస్పెక్టివ్‌ (పాత తేదీల నుంచి వేసే పన్ను) పన్నునుద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. దీని రద్దు ద్వారా ప్రభుత్వంపై పరిశ్రమ వర్గాలకు నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు. ఈ మేరకు సీఐఐ వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశ ఆర్థికవ్యవస్థ వేగం పుంజుకుంటోందని చెప్పారు. 

దేశ ఆర్థికాభివృద్ధిలో పరిశ్రమల పాత్ర మరువలేనిదని ప్రధాని అన్నారు. ఇప్పుడు వారి సహకారంతోనే మరోసారి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని చెప్పారు. మునుపటితో పోలిస్తే ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సహకారం పెరిగిందన్నారు. కొవిడ్‌ సమయంలో మాస్కులు, పీపీఈ కిట్లు, కొవిడ్‌ వ్యాక్సిన్లు పరిశ్రమ వర్గాలు అందజేశాయని గుర్తుచేశారు. ఏడెనిమిదేళ్ల క్రితం కేవలం 3-4 యూనికార్న్‌ కంపెనీలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడా సంఖ్య 60కి చేరిందని చెప్పారు. వాటిలో 21 కంపెనీలు కేవలం గత కొన్ని నెలల్లో ఆవిర్భవించినవేనని చెప్పారు.

తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితంగానే దేశంలోకి ఎఫ్‌డీఐలు రికార్డు స్థాయిలో వస్తున్నాయని ప్రధాని చెప్పారు. ఎఫ్‌పీఐలు, ఫారెక్స్‌ నిల్వల విషయంలోనూ ఆల్‌టైమ్‌ రికార్డు సాధించినట్లు  వివరించారు. దేశంలోని ప్రజలు సైతం మేడిన్‌ ఇండియా వస్తువులే కొనాలని నిర్ణయించుకుంటున్నారని చెప్పారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ సంస్కరణలు అమలు చేశామని గుర్తుచేశారు. పరిశ్రమ వర్గాలకు తమ అండ ఉంటుందని భరోసా ఇచ్చారు. పరిశ్రమలకు ఎదురయ్యే అవరోధాలను తొలగించేందుకు తమ ప్రభుత్వం ముందు ఉంటుందని చెప్పారు. పెట్టుబడిదారులు కూడా పెట్టుబడులు పెట్టి కొత్త ఉద్యోగాలు సృష్టించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని