Budget 2023: గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌!

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తూ కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేశారు.

Updated : 01 Feb 2023 18:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నూతన గృహ కొనుగోలు/నిర్మించుకునేవారికి శుభవార్త. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఉద్దేశించిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (Pradhan Mantri Aawas Yojana) పథకానికి తాజా బడ్జెట్‌లో నిధుల వాటాను భారీగా పెంచారు. గత బడ్జెట్‌లో రూ.48వేల కోట్లు కేటాయించగా, ఇప్పుడు ఏకంగా ఆ నిధులను 66శాతం పెంచారు. తాజా బడ్జెట్‌లో రూ.79వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం.

అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేర్వేరుగా నిధులు సమకూర్చనున్నట్లు వెల్లడించారు. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తుందన్నారు. మానవ వ్యర్థాలు, డ్రైనేజీల్లోని చెత్తను తొలగించేందుకు ప్రతి నగరం, పట్టణంలో మెషీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. పీఎంఏవై పథకానికి భారీగా నిధులు కేటాయించడం ద్వారా రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకింగ్‌ రంగాలతో బలోపేతానికి అవకాశం ఏర్పడింది. ప్రత్యక్షంగా నిర్మాణరంగ కార్మికులకు, పరోక్షంగా అనేక వ్యాపారులకు ఉపాధి కల్పించినట్లైంది. ప్రభుత్వ ప్రకటనపై నిర్మాణ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గతేడాది నవంబరు నాటికి పీఎంఏవై కింద 1.20కోట్ల ఇళ్లు మంజూరయ్యాయి. సొంత స్థలం ఉండి, ఎలాంటి పక్కా గృహం లేని వారు ఈ పథకానికి అర్హులు. ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలు, మధ్య ఆదాయ వర్గాలను ఉద్దేశించి పీఎంఏవైని తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని