Poco C55: ₹10వేల్లోపే 50 ఎంపీ కెమెరాతో పోకో కొత్త ఫోన్‌..!

Poco C55 Full details: పోకో నుంచి బడ్జెట్‌ ధరలో మరో ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. 50 ఎంపీ కెమెరా, లెదర్‌ స్టిచ్‌ ఫినిషింగ్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత.

Published : 21 Feb 2023 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ పోకో (Poco).. తన విజయవంతమైన సి-సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. సీ55 (Poco C55) పేరిట దీన్ని తీసుకొచ్చింది. రూ.10వేల కన్నా తక్కువ ధరలో 50 ఎంపీ కెమెరా, 10W ఫాస్ట్‌ఛార్జింగ్‌ సదుపాయం, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ వస్తోంది. వెనుకవైపు ప్రీమియం లెదర్‌ తరహా స్టిచ్‌ డిజైన్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత.

పోకో సీ55 రెండు వేరియంట్లలో వస్తోంది. 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధరను రూ.9,499గా నిర్ణయించారు. 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధరను రూ.10,999గా పేర్కొన్నారు. కూల్‌ బ్లూ, ఫారెస్ట్‌ గ్రీన్‌, పవర్‌ బ్లాక్‌ రంగుల్లో లభ్యమవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌, పోకో వెబ్‌సైట్లలో ఫిబ్రవరి 28 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులపై ఆఫర్‌ ఇస్తున్నారు. బ్యాంక్‌ ఆఫర్‌ కలుపుకొంటే తొలిరోజు ఈ ఫోన్లు వెయ్యి రూపాయలు తక్కువకే లభిస్తాయి.

పోకో సీ55లో డ్యూయల్‌ నానో సిమ్‌ ఆప్షన్‌తో వస్తోంది. ఎంఐయూఐ 13తో పనిచేస్తుంది. మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ అమర్చారు. 6.71 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ 60Hz రీఫ్రెష్‌ రేటుతో వస్తోంది. ఫొటోలు, వీడియోల కోసం వెనుకవైపు 50 మెగాపిక్సల్‌ కెమెరా ఇస్తున్నారు. ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 4జీ, బ్లూటూత్‌ 5.1, , మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌ అందిస్తున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 10W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ కోసం ఐపీ52 రేటింగ్‌ కలిగి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని