Poco X5 Pro 5G: 108 ఎంపీ కెమెరాతో పోకో 5జీ ఫోన్‌.. పూర్తి వివరాలివే..

Poco X5 Pro 5G Details in telugu: పోకో నుంచి మరో 5జీ ఫోన్‌ విడుదలైంది. ప్లిప్‌కార్ట్‌లో త్వరలోనే దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Published : 07 Feb 2023 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా మొబైల్‌ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్‌ పోకో (Poco) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. పోకో ఎక్స్‌ 5ప్రో (Poco X5 Pro 5G) పేరిట 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. 108 మెగాపిక్సల్‌ కెమెరా, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ. ఈ ఫోన్‌ ధర, స్పెసిఫకేషన్స్‌, విక్రయాలు వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పోకో ఎక్స్‌ 5 ప్రో రెండు వేరియంట్లలో వస్తోంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధరను రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధరను రూ.24,999గా పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఫిబ్రవరి 13 నుంచి ఈ ఫోన్‌ అమ్మకాలు జరగనున్నాయి. నలుపు, నీలం, పసుపు రంగుల్లో  ఫోన్‌ లభ్యమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లు ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.2వేలు డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఇందులో 6.67 అంగుళాల ఎక్స్‌ఫినిటీ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 900 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ఈ డిస్‌ఫ్లే సొంతం. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 778జీ ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 12తో కూడిన ఎంఐయూఐ 14తో వస్తోంది.

వెనుక వైపు 108 ఎంపీ ప్రధాన కెమెరాను అమర్చారు. దీంతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా ఇస్తున్నారు. వీటితో 4K వీడియోలను రికార్డు చేయొచ్చు. 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఫుల్‌ హెచ్‌డీ వీడియోలను రికార్డు చేయొచ్చు. ఇందులో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. 67W ఫాస్ట్‌ఛార్జింగ్‌, 5W వైర్డ్‌ రివర్స్ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ అప్‌డేట్స్‌, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని పోకో చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని