పాల‌సీదారు విధులు, హ‌క్కులు

మీకు తెలుసా? పాల‌సీ న‌చ్చ‌క‌పోతే తిరిగిచ్చేసే హ‌క్కు పాల‌సీదారుకు ఉంటుంది. ఇలాంటివెన్నో...

Published : 19 Dec 2020 14:15 IST

పాల‌సీదారుకి ఏదైనా జ‌రిగితే ఆ కుటుంబానికి ఆర్థిక భ‌రోసా క‌ల్పించ‌డ‌మే బీమా పాల‌సీ ప్రాథ‌మిక ఉద్దేశం. సాధార‌ణంగా జీవిత బీమా తీసుకునే ముందు ఆర్థిక ప్ర‌ణాళిక‌ నిపుణుల అభిప్రాయం త‌ప్ప‌నిసరి. అయితే ఇది అంద‌రికీ వీలు కాదు. కాబ‌ట్టి ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో వెబ్‌సైట్ల‌లో శోధించి, బంధు మిత్రుల స‌ల‌హాల ద్వారా చాలా మంది పాల‌సీల‌ను కొనుగోలు చేస్తున్నారు. ఏ విధంగా తీసుకున్న‌ప్ప‌టికీ పాల‌సీ నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను క్షుణ్ణంగా చ‌దివి సంత‌కం చేయడం మంచిది. ఏదో ఒక బీమా పాల‌సీ తీసుకుని క్లెయిం స‌మ‌యంలో ఇబ్బందులు ఏర్ప‌డితే పాల‌సీ అస‌లు ప్ర‌యోజ‌నం నెర‌వేర‌దు. ఈ క్ర‌మంలో పాల‌సీదారుకు సంబంధించిన విధులు, హ‌క్కుల గురించి తెలుసుకుందాం.

పాల‌సీదారు విధులు

పాల‌సీని కొనేట‌ప్పుడు

  • పాల‌సీ ప‌త్రాన్ని మొత్తం చ‌దివి స్వ‌యంగా పాల‌సీదారుడే వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.

  • ఏ కాల‌మ్‌ను పూర్తిచేయ‌కుండా వ‌దిలేయ‌కూడ‌దు. ఖాళీ పాల‌సీప‌త్రంపై సంత‌కం చేసి ఏజెంటుకు ఇవ్వ‌కూడదు.

  • పాల‌సీ ప‌త్రంపై సంత‌కం చేస్తున్నామంటే పేర్కొన్న‌వివ‌రాల‌న్నీ గుర్తున్నంత‌ మేర‌కు నిజాల‌ని ధ్రువీక‌రిస్తున్న‌ట్లే.

  • ప్రీమియంను ఆర్థిక‌స్థితి, ఆదాయం ఆధారంగా ఎంచుకుంటే మంచిది. అవ‌స‌రాల‌కు త‌గిన పాల‌సీని ఎంచుకోవాలి.

  • ప్రీమియాన్ని ఒకేసారి చెల్లించాలా లేదా వాయిదాల్లో చెల్లించాలా అనే విష‌యాన్ని మొదటే నిర్ధారించుకోవాలి.

  • ఈసీఎస్‌(ఎల‌క్ట్రానిక్ క్లియ‌రింగ్ స‌ర్వీస్‌) విధానంలో ప్రీమియం చెల్లించ‌డం ద్వారా స‌మ‌యాన్ని ఆదా చేసుకోవ‌చ్చు. రికార్డుల‌ను భ‌ద్ర‌ప‌రుచుకునే వీలును ఇది క‌ల్పిస్తుంది.

  • పాల‌సీ ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో నామినీ పేరును న‌మోదు చేసేట‌ప్పుడు ఎలాంటి త‌ప్పులు లేకుండా చూసుకోవాలి.

పాల‌సీ కొన్న త‌ర్వాత‌

  • పాల‌సీ ప‌త్రాన్ని బీమా కంపెనీకి స‌మ‌ర్పించిన 15 రోజుల్లోగా బీమా కంపెనీ తిరిగి 15 రోజుల్లోగా పాల‌సీదారుని సంప్ర‌దిస్తుంది. అలా జ‌ర‌గ‌క‌పోతే పాల‌సీదారుడు కంపెనీని విచారించాలి.

  • పాల‌సీ తీసుకునేందుకు ఏమైనా అద‌న‌పు ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి వ‌స్తే వెంటనే అంద‌జేయాలి.

  • పాల‌సీ ప్ర‌పోజ‌ల్‌ను బీమా కంపెనీ ఆమోదించిన‌ట్ల‌యితే, గ‌డువులోపు పాల‌సీ బాండును అందుకోవాలి.

  • పాల‌సీ బాండును అందుకున్న త‌ర్వాత అనువైన పాల‌సీనే అందుకున్నారా లేదా అనేది స‌రిచూసుకోవాలి.

  • పాల‌సీ ష‌రతుల‌న్నింటినీ చ‌దివి, పాల‌సీ మ‌ధ్య‌వ‌ర్తి లేదా బీమా కంపెనీ అధికారి మీకు మొద‌ట చెప్పిన‌ట్లుగానే పాల‌సీ ఉందా లేదా చూసుకోవాలి.

  • బీమా మ‌ద్య‌వ‌ర్తిని లేదా బీమా కంపెనీ అధికారుల‌ను సంప్ర‌దించి అనుమానాలను నివృత్తి చేసుకోవాలి.

  • అవ‌స‌ర‌మైతే నేరుగా బీమా కంపెనీ కార్యాల‌యానికి వెళ్లాలి.

పాల‌సీ నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో

  • పాల‌సీ ప్రీమియంను గ‌డువు తేదీలోపు లేదా గ్రేస్ పీరియ‌డ్ లోపు చెల్లించాలి.

  • ప్రీమియం చెల్లించేందుకు అనువైన మార్గాన్ని ఎంచుకుని సరైన స‌మ‌యంలో చెల్లింపు జ‌రిగేలా చూసుకోవాలి.

  • చిరునామాలో మార్పు ఉంటే, బీమా కంపెనీకి తెలియ‌జేయాలి.

నామినేష‌న్:

  • పాల‌సీ తీసుకునేట‌ప్పుడు నామినీని నియ‌మించుకోవాలి. పాల‌సీ తీసుకున్న త‌ర్వాత అవ‌స‌ర‌మైతే నామినీని మార్చుకోవ‌చ్చు.

  • మైన‌ర్‌ను నామినీగా నియ‌మించుకోవాల్సి వ‌స్తే, అపాయింటీని కూడా సూచించాలి. ఒప్పంద ప‌త్రంపై అపాయింటీతో సంత‌కం చేయించాల్సి ఉంటుంది.

పాలసీ బాండును పోగొట్టుకుంటే:

  • పాల‌సీ బాండును పోగొట్టుకున్న వెంటనే బీమా కంపెనీకి స‌మాచారం అందించాలి.

  • విధివిధానాల‌ను పాటించి డూప్లికేట్ పాల‌సీని పొందాలి.

  • డూప్లికేట్ పాల‌సీతో ఒరిజిన‌ల్ బాండు ద్వారా పొందే ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు.

పాల‌సీదారు హ‌క్కులు:

  • పాల‌సీ విధివిధానాలు న‌చ్చ‌క‌పోతే పాల‌సీ డాక్యుమెంట్ అందుకున్న 15 రోజులలోపు స్వాధీన ప‌ర‌చ‌వ‌చ్చు.

  • పాల‌సీ న‌చ్చ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను తెలియ‌జేస్తూ పాల‌సీని తిరిగి ఇచ్చేయ‌వ‌చ్చు.

  • పాల‌సీ క‌వ‌రేజీ ఉన్న‌ని రోజుల‌కు ప్రీమియంను, వైద్య ప‌రీక్ష‌లేమైనా చేయించుకుంటే అందుకైన ఖ‌ర్చుల‌కు, స్టాంపు డ్యూటీల‌కు వెచ్చించిన ఛార్జీల‌ను మిన‌హాయించి మిగ‌తా మొత్తాన్ని చేతికందిస్తారు.

యులిప్స్ పాల‌సీ అయితే…

యులిప్స్ పాల‌సీ తీసుకున్నట్ల‌యితే పాల‌సీ ర‌ద్దు చేసుకున్న తర్వాత పెట్టుబ‌డి యూనిట్ల‌ను తిర‌గి కొనుగోలు చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

  • ఈ యూనిట్ల‌లోని సొమ్మును పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే వీలుంది.

  • పాల‌సీ లాక్ ఇన్ పీరియ‌డ్ త‌ర్వాత పాల‌సీని స‌రెండ‌ర్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

  • పాల‌సీలో కొన్ని మార్పుల‌ను కోరుకోవ‌చ్చు. అవేమిటంటే… ప్రీమియం పేమెంట్ మోడ్‌, పాల‌సీ కాల‌ప‌రిమితి, బీమా హామీ మొత్తాన్ని పెంచుకోవ‌డం, ప్రీమియం రీ డైరెక్ష‌న్ లాంటివి.

పాల‌సీదారులు త‌మ‌ హ‌క్కుల కోసం ఏ విధంగా పోరాడేందుకు అవ‌కాశం ఉందో అదే విధంగా నిబ‌ద్ధ‌తతో బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని